- గ్రామసభలు లేకుండానే భూ సేకరణ సర్వేలా?
- సాగుకు కంటే ముందుగా ప్రాజెక్టుకే నీటి కేటాయింపులా?
- జెన్‌కో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుపై రైతుల ఆగ్రహం
ప్రజాశక్తి- బనగానపల్లె : నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పాతపాడు, మీరాపురం గ్రామాల పరిధిలో ఏటా మూడు పంటలు పండే అత్యంత సారవంతమైన భూములు ఎపి జెన్‌కో ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడనుంది. జెన్‌కో ఏర్పాటు చేయతలపెట్టిన వెయ్యి మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు (పిఎస్ పి) కోసం 641 ఎకరాల సేకరణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. యాగంటి కొండల కింద పాతపాడు, కటికవానికుంట, ఫతేనగరం, మీరాపురం గ్రామాల పరిధిలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంగల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ప్రాణాలైనా అర్పిస్తాం తప్ప, ఏటా మూడు పంటలు పండే తమ జీవనాధారమైన భూములను ప్రాజెక్టుకు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని భూగర్భ జలాలు అడుగంటుతున్నా, యాగంటి కొండల దిగువన ఉన్న పాతపాడు, మీరాపురం గ్రామాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. కేవలం వంద నుండి 200 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీరు లభ్యమవుతుండటంతో రైతులు బోర్ల ద్వారా ఏటా మూడు పంటలు సాగు చేస్తున్నారు. దుర్భిక్ష కాలంలోనూ పచ్చటి పంటలతో కళకళలాడే ఈ భూములను సేకరిస్తే తమ బతుకులు రోడ్డున పడతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏ ప్రాజెక్టుకైనా భూ సేకరణ చేపట్టే ముందు గ్రామసభలు నిర్వహించి, భూ పరిహారంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కానీ, ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్‌డిఒ, తహశీల్దార్ స్థాయి అధికారులు సర్వే చేపట్టడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పోరాడుతున్నా దద్దనాల ప్రాజెక్టుకు హంద్రీనీవా నీటిని విడుదల చేయని ప్రభుత్వం, ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు మాత్రం గాలేరు నగరి సుజల స్రవంతి నుండి 0.572 టిఎంసిల నీటిని కేటాయిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మూడు పంటలు పండే భూములను ఇవ్వం
బోర్ల కింద ఏడాదికి మూడు పంటలు పండే భూములను జెన్‌కో ప్రాజెక్టుకు ఇచ్చేది లేదు. భూమి లేకపోతే మాకు బతుకే లేదు. కోట్లాది రూపాయల విలువైన సారవంతమైన భూములను కోల్పోవడానికి ఎవ్వరూ అంగీకరించరు.
– బెడదల నారాయణరెడ్డి, రైతు, పాతపాడు
చావనైనా చస్తాం...
మా కుటుంబం తరతరాలుగా ఈ భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవిస్తోంది. బలవంతంగా భూ సేకరణ చేయాలని చూస్తే చావడానికైనా సిద్ధమే తప్ప, ప్రాణసమానమైన భూములను వదులుకోం.
-గడ్డం రామకృష్ణారెడ్డి, రైతు, పాతపాడు
బలవంతపు భూసేకరణను అడ్డుకుంటాం
రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం దారుణం. ప్రాజెక్టుల కోసం కొండలు, బీడు భూములను ఉపయోగించుకోవాలి. రైతులకు చుక్క నీరు ఇవ్వని ప్రభుత్వం... ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేయడం దారుణం. బలవంతపు సేకరణకు దిగితే రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాడుతాం.
-వి.సుబ్బారాయుడు, ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు








కామెంట్‌లు (0)