బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవ్యవసాయ వృద్ధి అంతంతే..!

21 గంటల క్రితం

image-cmwkt3613gszw0js0wysjsxja.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 03:14 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఐదు త్రైమాసికాల కనిష్టానికి జిడిపి

  • క్యూ2లో 7.5 శాతానికి పరిమితం

  • ఇక్రా అంచనా

​న్యూఢిల్లీ: వర్షపాత లోటు, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, అధిక ద్రవ్యోల్బణం భారత జిడిపికి సెగ పెడుతోన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగ ఉత్పత్తి అత్యంత దారుణంగా పడిపోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జులై-సెప్టెంబరు త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) ఐదు త్రైమాసికాల కనిష్ఠానికి తగ్గి 7.5 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో నమోదైన 7.8 శాతంతో పోలిస్తే ఇది 0.3 శాతం పాయింట్లు తక్కువ. గతేడాది క్యూ2 కాలంలో నమోదైన 8.2 శాతంతో పోలిస్తే కూడా తగ్గనుంది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల్లో వృద్ధి మందగించడం ఇందుకు కారణమని పేర్కొంది. ఆర్‌‌బిఐ అంచనా 7.2 శాతం కంటే వృద్ధి ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం నవంబరు 30న అధికారికంగా విడుదల చేయనుంది. రంగాలవారీగా చూస్తే వ్యవసాయ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఇక్రా తెలిపింది. జూన్‌ ‌ముగిసిన తొలి త్రైమాసికంలో 3.6 శాతంగా ఉన్న ఈ రంగం వృద్ధి రెండో త్రైమాసికంలో కేవలం 0.2 శాతానికి పరిమితం కావచ్చని విశ్లేషించింది. పారిశ్రామిక రంగంలో వృద్ధి 7.7 శాతం నుంచి 7.2 శాతానికి, సేవల రంగంలో 10 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గవచ్చని పేర్కొంది. అంటే మూడు ప్రధాన రంగాల్లోనూ వృద్ధి వేగం తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పారిశ్రామిక, సేవల రంగాల్లో రెండో త్రైమాసికానికి సంబంధించిన కీలక సూచీలు మెరుగ్గా ఉండటం ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటనిస్తోందని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ తెలిపారు.

ద్వితీయార్థంలోనూ మందగింపు..

ప్రస్తుత 2026-27 అక్టోబర్‌ ‌నుంచి మార్చి కాలం ద్వితీయార్థంలో వృద్ధి మరింత మందగించే ప్రమాదం ఉందని ఇక్రా హెచ్చరించింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణ డిమాండ్‌పై ప్రభావం చూపవచ్చని తెలిపింది. మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వినియోగాన్ని దెబ్బతీయడంతో పాటు, ముడిసరుకుల వ్యయాలు పెరగడం కంపెనీల లాభాల మార్జిన్లపై ఒత్తిడి పెంచవచ్చని వివరించింది. ఈపరిణామాల నేపథ్యంలో 2026-27 పూర్తి ఆర్థిక సంవత్సరానికి భారత జిడిపి వృద్ధి 7.1 శాతానికి పరిమితం కావచ్చని ఇక్రా అంచనా వేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్