రికార్ద్ స్థాయిలో 6.29% నమోదు
ధరల అదుపులో వైఫల్యమే కారణం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర ప్రభుత్వాన్ని ద్రవ్యోల్బణం భయపెడుతోంది. నిత్యావసర వస్తులు ధరలను అదుపుచేయలేకపోవడం ఈ పరిస్థితికి కారణం.
సెప్టెంబర్ చివరినాటికి ఏకంగా 6.29 శాతానికి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇది కేరళ, కర్ణాటక రాష్ట్రాలకన్నా జాతీయ ద్రవ్యోల్బణం కన్నా కూడా ఎక్కువగా ఉంది. ప్రధానంగా చక్కెర, ఉల్లి, మిర్చి, ధనియాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం ఈ పరిస్థితికి కారణంగా గుర్తించారు. బంగారంకూడా ఈ జాబితాలో ఉంది. తాజాగా ప్రజాళిక శాఖ విడుదల చేసిన ఒక నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నారు. రాష్టానికి సంబంధించి సెప్టెంబర్‌లో వినియోగదారుల ధరల సూచీ మేరకు రిటైల్ ద్రవ్యోల్బణం 6.29 శాతంగా నమోదైంది. ఇది జాతీయ సగటు 5.54 శాతం కంటే ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 6.63 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 5.74 శాతంగా నమోదైంది. వ్యక్తిగత సంరక్షణ, సామాజిక రక్షణ, ఇతర సేవల విభాగంలో అత్యధికంగా 17.30 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.
ధరల పెరుగుదల ఇలా...
ఉల్లి ఏకంగా 112శాతంకన్నా ఎక్కువగా ద్రవ్యోల్బణాన్ని నమోదు చేయగా, వెండి ఆభరణాలు 83 శాతం, అల్లం 80 శాతం చక్కర 45 శాతం, గోధుమ పిండి కూడా 25 శాతం చొప్పున ద్రవ్యోల్బణాన్ని నమోదుచేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ధరలను అదుపు చేస్తే తప్ప ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం సాధ్యం కాదని వారే తేల్చిచెబుతున్నారు. ఇవే కాకుండా డీజిల్, ఆహార పదార్థాలు, పానీయాలు, విద్యా సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, పొగాకు, మత్తు పదార్థాలు, రవాణా, విద్యుత్, గ్యాస్, ఆరోగ్య సేవలు వంటి వాటిల్లో పెరిగిన ధరలుకూడా ద్రవ్యోల్బణం పెరగడానికి కారణంగా విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ద్రవ్యోల్బణం కేవలం 2.82 శాతంగా ఉండగా, ఫిబ్రవరిలో 3.45 శాతానికి, మార్చిలో 4.05 శాతానికి చేరింది. మేలో 4.90 శాతం, జూన్‌లో 5.39 శాతం, జూలైలో 5.73 శాతం నమోదైంది. ఆగస్టులో 5.54 శాతానికి స్వల్పంగా తగ్గినప్పటికీ, సెప్టెంబర్‌లో మళ్లీ 6.29 శాతానికి చేరింది.
వివిధ సరుకుల్లో నమోదైన ద్రవ్యోల్బణం
సరుకు ద్రవ్యోల్బణం (%)
ఉల్లి 112.46
ఆభరణాలు 83.18
అల్లం 80.15
నిమ్మకాయ 45.22
ఎండు మిర్చి 42.89
వెల్లుల్లి 39.70
చక్కెర 34.63
ధనియాలు 32.55
బంగారం, వజ్రాలు 27.71
గోధుమ పిండి 25.00
వేరుశనగ 22.22
రిఫైన్డ్ నూనె 20.92
బియ్యం 15.87








కామెంట్‌లు (0)