గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅధికార పార్టీ ఎంపికే ఆర్‌ఎస్‌‌కె ఫ్రాంచైజీలు?

19 గంటల క్రితం

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిరసన తెలుపుతున్న దస్తావేజు లేఖరులు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 04:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • -తొలుత ప్రతి జిల్లాలో ఒక రిజిస్ట్రేషన్ కేంద్రం ప్రైవేటుకు

  • ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్నీ గంపగుత్తగా అప్పగింత!

  • రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : సంస్కరణల పేరుతో రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోంది. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను (ఆర్‌ఎస్‌‌కెల)ను ఏర్పాటు చేస్తోంది. తొలుత జిల్లాకొక ఆర్‌ఎస్‌‌కె ఫ్రాంచైజీలు ఏర్పాటు కానున్నాయి. వీటిని ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న అధికార పార్టీ ఎంపికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలనూ ప్రైవేటీకరించి అదే ఎంపికి గంపగుత్తగా అప్పగించేందుకు ప్రభుత్వ పెద్దల స్థాయిలో నిర్ణయం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. భూములు, ఇళ్లు వంటి ఆస్తులు, ఇతర చట్టబద్ధ పత్రాల నమోదుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ప్రస్తుతం ఈ లావాదేవీలు జరుగుతున్నాయి. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఆస్తుల విలువను బట్టి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ లో డాక్యుమెంట్ రైటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. తద్వారా వారు ఉపాధి పొందుతున్నారు. పిపిపిలో భాగంగా ఆర్‌ఎస్‌‌కె ఫ్రాంచైజీలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం జిఒ 396ని జారీ చేసింది. ఈ జిఒను వ్యతిరేకిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు, దస్తావేజుల విక్రయదారులు గత కొన్ని రోజులుగా ఆందోళనకు దిగారు. సబ్‌ ‌రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట నిరాహారదీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా, ప్రభుత్వం ఏ మాత్రమూ వెనుకంజ వేయకుండా ఆర్‌ఎస్‌‌కెల ఏర్పాటుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ప్రభుత్వ పెద్దల దగ్గరి బంధువైన ఒక ఎంపికి పిపిపి పద్ధతిలో మొదట జిల్లాల్లో ఒక్కో ఆర్‌ఎస్‌‌కె ఏర్పాటుకు గ్రీన్‌‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది. ఆయన ద్వారా జిల్లాల వారీగా ఫ్రాంచైజీలు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మీ-సేవా కేంద్రాల మాదిరిగా కొద్దిమంది కంప్యూటర్‌ ఆపరేటర్లతో డాక్యుమెంట్‌‌ల రూపకల్పనకు త్వరలో క్షేత్రస్థాయి నియామకాలు చేయనున్నారు. ఆర్‌ఎస్‌‌కెల ద్వారా డాక్యుమెంట్ల రూపకల్పనకు ఫీజులు వసూలు చేస్తారు. ప్రజలే తమ డాక్యుమెంట్లను స్వచ్ఛందంగా తయారు చేసుకోవచ్చని, సాధారణ ఫీజులు చెల్లిస్తే సరిపోతుందని ఒక ఆప్షన్‌ ‌చాలా కాలంగా అమలులో ఉంది. అయినా, విద్యావంతులు సైతం తప్పులు దొర్లుతాయన్న భయంతో డాక్యుమెంట్‌ ‌రైటర్లపైనే ఆధారపడి ఆస్తుల రిజిస్ర్టేషన్‌ ‌చేయించుకుంటున్నారు. ఇకపై ఆర్‌ఎస్‌‌కెలను ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రజల ఆస్తుల రిజిస్ర్టేషన్‌లో ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంతోపాటు అనధికారికంగా జరుగుతున్న లావాదేవీల (లంచాల) ద్వారా నిత్యం కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని టిడిపి అధికారంలోకి వచ్చాక చేసిన సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. ఈ డబ్బులనూ తమ జేజుల్లో వేసేకొనేందుకు పిపిపి పద్ధతిలో ఆర్‌ఎస్‌‌కెల ద్వారా రిజిస్ర్టేషన్‌ల ప్రక్రియకు స్కెచ్ రూపొందించి అమలుకు ప్రభుత్వ పెద్దల ద్వారా ఆ ఎంపి రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్