మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు, ఏదో రకంగా అధికారంలోకి రావడం. అధికారంలోకి వచ్చిన తరువాత దానిని శాశ్వతం చేసుకునేందుకు మరింతగా అడ్డుగోలు వ్యవహారాలకు పాల్పడటం సంఘ్ పరివార్ వ్యూహం! దీనిలో భాగంగానే వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీయడం, తన అనుచరులతో నింపివేయడం, మరింతగా మతోన్మాద విషం చిమ్మడం వంటి చర్యలకు పాల్పడుతుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో సంఘ్ వ్యూహం మరోసారి చర్చనీయాంశమైంది. భారత రాజ్యాంగం ఎన్నికల కమిషన్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చి దాని విధివిధానాలను రూపొందించింది. రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన భారత ఎన్నికల సంఘం 2014 తర్వాత వరుస వివాదాల్లో కూరుకుపోయింది. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై వచ్చిన ఆరోపణలు భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) విశ్వసనీయతనే ప్రశ్నార్థకంగా మార్చాయి. మెజారిటీ నిర్ణయానికి భిన్నంగా, కేంద్ర పాలకుల రాజకీయ, మతతత్వ ప్రయోజనాల కోసం జ్ఞానేష్ కుమార్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదంగా మారింది.
ఎవరీ జ్ఞానేష్ కుమార్ గుప్తా ?
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కోర్ ఎజెండా ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటు, సహకార వ్యవస్థను గుజరాత్ తరహాలో కేంద్రీకృతం చేయడంలో జ్ఞానేష్ కుమార్ గుప్తా కీలక పాత్ర పోషించారు. బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి మోడీ, షా లతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, ఎదుగుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్ స్థాయికి చేరారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఈయన 1988 బ్యాచ్‌కు చెందిన కేరళ క్యాడర్ ఐఎఎస్ అధికారి. 2014కు ముందు వరకు కేరళంలో పనిచేసిన ఈయన మోడీ ప్రధాని అయ్యాక కేంద్ర సర్వీసుల్లోకి వచ్చారు. 2025 ఫిబ్రవరి 19న జ్ఞానేష్ కుమార్ 26వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. మహారాష్ట్రతో పాటు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత పక్షపాతంతో ఎన్నికల కమిషన్ బిజెపి వైపు మొగ్గింది. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి గెలవడంలో ఎన్నికల కమిషన్ కీలక పాత్ర పోషించిందనే విమర్శలకు కారణమైంది. ఇటీవల ఎన్నికల కమిషన్ తీసుకున్న ఓటర్ల సవరణ దేశవ్యాప్తంగా పెద్ద కలకలమే సృష్టించింది. ఇందులో మతతత్వ ఎజెండా కూడా ఉంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌తో పాటు అనేక కీలక రాష్ట్రాల్లో సుమారు కోటి మంది ఓటర్లను తొలగించి ఎన్నికలకు ముందే బిజెపి గెలవడానికి కావలసిన పరిస్థితులను ఎన్నికల కమిషన్ సృష్టించింది. ఇందులో జ్ఞానేష్ కుమార్ పాత్ర కీలకమైంది.
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నియామక బిల్లు-2023 పార్లమెంట్‌లో చర్చకు వచ్చినప్పుడు సిపిఎం రాజ్యసభ సభ్యుడుగా నాటి ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా ప్రతిఘటించారు. ప్రధాన కమిషనర్ ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి వుండాలనే సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఈ సవరణ ఉందని, ఇది అంతిమంగా ప్రభుత్వ గుత్తాధిపత్యానికి దారితీసి, ఎన్నికల సంఘం యొక్క స్వతంత్రతను దెబ్బ తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఇది రుజువైంది.
2024 సార్వత్రిక ఎన్నికలలో రిగ్గింగ్ చేయడానికి పాలక బిజెపి తో ఇసిఐ కుమ్మక్కైందని ఆరోపిస్తూ, దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలోని ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో నకిలీ ఓటర్లు, చెల్లని చిరునామాలు, ఒకే ప్రదేశంలో బల్క్ రిజిస్ట్రేషన్లతో సహా లక్షకు పైగా ఓటర్లు ఉన్నారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు రుజువు చేయాలి, లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలంటూ బిజెపి నాయకుని తరహాలో జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇచ్చారు. ఓటరు జాబితాల యాక్సెస్ సహచర కమిషన్ సభ్యులకే లేనప్పుడు ఆధారాలు చూపలేరనే ధైర్యంతోనే ఆయన ఈ రకంగా స్పందించారు.మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత సిబిఐ, ఇ.డి, ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ల ద్వారా ప్రతిపక్ష పార్టీల నాయకులను భయపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఎన్నికల కమిషన్ ద్వారా ప్రజాస్వామ్యానికే ప్రమాదం తెచ్చారు. వీటిని విశాల ఐక్యతతో ప్రతిఘటించకుండా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేము.








కామెంట్‌లు (0)