ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థిరంగా వర్షాభావం

1 రోజు క్రితం

no rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 01:06 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- జూలైలోనూ ఆశలు ఆవిరి

- 604 మండలాల్లో లోటు

- 240 మండలాల్లో తీవ్రం

- ఖరీఫ్‌‌నకు భారీ దెబ్బ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : ఖరీఫ్‌ను వర్షాభావం కాటు వేసింది. జూలై ముగిశాక కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. సీజన్‌ ‌మొదటి నెల జూన్‌‌లో వర్షాల్లేక సేద్యం సాగలేదు. జూలైలోనైనా వానలు పడతాయేమోనని రైతులు ఆశించగా రెండవ మాసంలో కూడా చినుకు పడకపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. తొలకరి వానలకు వేసిన కొద్దిపాటి పంటలు ఎండిపోవడంతో రెండు మూడు మార్లు విత్తనాలేస్తున్నారు. అప్పటికీ మొలకలు పైకి రాక నేలలోనే మాడిపోతున్నాయి. ఒక వేళ మొలకలొచ్చినా వర్షాల్లేక త్రీవ ఉష్ణోగ్రతలతో ఎండిపోతున్నాయి. బోర్ల కింద, కృష్ణా డెల్టాలో, ఇతర చిన్న, పెద్ద, మధ్య నీటి వనరుల కింద ప్రభుత్వం వరిని అప్రకటితంగా నిషేధించడంతో ప్రత్యామ్నాయ పంటలకేసి రైతులు చూస్తున్నారు. ప్రభుత్వం ఆరు తడి పంటలు మాత్రమే వేయాలని సలహాలివ్వడమే తప్ప సమస్యాత్మక ప్రాంతాల్లో సబ్సిడీపై విత్తనాలు, సూచనలు, ఇతర సహాయక చర్యలు చేపట్టక పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పంటలు వేయడానికి జంకుతున్నారు. వేసిన పంటలను కాపాడుకునేందుకు ఆయిల్‌ ఇంజన్లు, ట్యాంకర్లు, ఇతర మార్గాల్లో నీటిని తరలించేందుకు వ్యయప్రయాసలకోర్చుతున్నారు.

దుర్భిక్షం అలాగే...

జూన్‌‌లో రాష్ట్రం మొత్తమ్మీద 49 శాతం లోటు వర్షం నమోదైందని ప్రాథమికంగా తెలపగా అనంతరం లోటును 26 శాతానికి తగ్గించి చూపిస్తున్నారు. ఆ నెలలో ఏ జిల్లాలోనూ సాధారణ వర్షం పడలేదు. జూలైలోనూ లోటు కొనసాగింది. జూలై 31 (శుక్రవారం) సాయంత్రానికి సాధారణ వర్షంలో 63 శాతం తక్కువ పడింది. 140.98 మిల్లీమీటర్లకుగాను 51.69 మిమీ పడింది. కోస్తాలో లోటు 61.68 శాతం కాగా రాయలసీమలో లోటు 74 శాతం. జూన్‌ 1 ‌నుంచి జూలై చివరాఖరికి లోటు 51.83 శాతంగా ఉంది. ఈ సమయంలో 229.46 మిమీ వర్షం పడాల్సి ఉండగా 124.43 మిమీ పడింది. ఈ రెండు మాసాల్లో కోస్తాలో 47.70 శాతం, రాయలసీమలో 49.76 శాతం తక్కువ వర్షం నమోదైంది. ఇప్పటి వరకు సాంకేతికంగా అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలు అత్యల్ప వర్షం పడ్డ జాబితాలో (లోటు 60-99 శాతం) ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో రాష్ట్రంలోకెల్ల కనిష్ష వర్షం పడింది. ఆ జిల్లాలో 72.74 శాతం లోటు కొనసాగుతోంది. జూలైలో కేవలం 6.6 మిమీ వర్షం పడింది. నెల్లూరులో కొంత మేరకు వర్షం కురిసినా ఇంకా మైనస్‌ ‌కేటగిరీలోనే ఉంది. ఆ జిల్లాలో సాధారణం కంటే 23 శాతం తక్కువ వర్షం నమోదైంది. కాగా శ్రీకాకుళం, వైఎస్‌ఆర్‌, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి సైతం అత్యల్ప వర్షం కేటగిరీకి అత్యంత చేరువలో కొనసాగుతున్నాయి. జూలైలో వాయుగుండం, ఆల్పపీడనం, ఆవర్తనాల వలన స్వల్ప ప్రాంతాల్లో కురిసిన వానలకు తాత్కాలికంగా రైతులు, ప్రజలు ఊపిరి పీల్చుకోగా అంతలోనే వర్షాభావం పెరిగి ఆందోళనకు గురి చేస్తోంది. ఎపిలో 688 మండలాలకు 604 మండలాల్లో తక్కువ వర్షం నమోదైంది. వాటిలో 240 మండలాల్లో అత్యల్పవర్షం పడగా, 359 మండలాల్లో తక్కువ వర్షం (లోటు 20 నుంచి 59 శాతం) రికార్డయింది. కేవలం 84 మండలాల్లోనే సాధారణ వర్షం కురిసింది.

అప్పుడే ఏడున్నర లక్షల ఎకరాలు తక్కువ

సూపర్‌ ఎల్‌‌నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావంతో ఖరీఫ్‌ ‌సాగుకు ప్రమాదం ముంచుకొచ్చింది. జూలై 29 నాటికి వ్యవసాయశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం

అప్పటికి కావాల్సిన సాధారణ సాగులో 7.62 లక్షల ఎకరాలు తక్కువ సాగయ్యాయి. సీజన్‌ ‌సాధారణ సాగు విస్తీర్ణం 77 లక్షల ఎకరాలుకాగా ఈ పాటికి 40.90 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలి. సుమారు 33.27 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. ఇరవై శాతం తక్కువ సాగయ్యాయి. రాయలసీమలో వర్షాభావం కారణంగా అక్కడ అధికంగా సాగు చేసే వేరుశనగ 23 శాతమే సాగైంది. జూలై ముగియడం, భవిష్యత్తులో వర్షాలు పడతాయన్న గ్యారంటీ లేకపోవడంతో వేరుశనగ సాగుపై రైతులు ఆశలు వదులుకున్నారు. ప్రత్యామ్నాయ పంటలే దిక్కయ్యాయి. నూనెగింజలన్నీ కలుపుకొని 27 శాతమే సాగయ్యాయి. రాయలసీమలో వర్షాభావ ప్రభావం మొత్తంగా నూనెగింజల సాగుకు ప్రతిబంధకంగా తయారైంది. రాష్ట్రంలో ఆహారధాన్యాలు 52 లక్షల ఎకరాలకు 21 లక్షల ఎకరాల్లో వేశారు. ఇప్పటికి 25 లక్షల ఎకరాల్లో పడాలి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 35.37 లక్షల ఎకరాలు కాగా ఈపాటికి 16.3 లక్షల ఎకరాల్లో వేయాలి. కానీ 14.82 లక్షల ఎకరాల్లోనే వేశారు. తొలకరి వానలు, ప్రాజెక్టుల్లో నీరు చేరుతుందన్న ఆశతో నారుమళ్లు పోశారు. అనంతరం నీరు లేకపోవడంతో చాలా చోట్ల నారుమళ్లు ఎండుతున్నాయి. నాట్లు పడ్డ చోట్ల నీరు అందక నాట్లు ఎండుతున్నాయి. కృష్ణా డెల్టాలో వరి వేయొద్దనడంతో సుమారు పది లక్షల ఎకరాల్లో వరి సాగు ప్రశ్నార్దకమైంది. గోదావరి డెల్టాలోనూ చివరి భూములకు నీరందక పంటలు ఎండుతున్నాయి. భూగర్భజలాలూ లోతులను చూస్తున్నాయి. దాంతో ఉచిత విద్యుత్‌ ఇచ్చినా బోర్ల కింద వరి సాగుకు ఇబ్బందే. పలు చోట్ల విద్యుత్‌ అంతరాయాలతో పంటలు ఎండుతున్నాయి. కాగా ఇప్పుడిప్పుడే ఎగువన కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాల కారణంగా కొద్ది పాటి వరద వస్తున్నా కర్ణాటకను దాటట్లేదు. కర్ణాటక ప్రాజెక్టులు నిండి, తెలంగాణాను దాటుకొని కిందికి రావడం కనాకష్టంగానే ఉంది. మరోవైపు ఎగువన పడ్డ వానలతో గోదావరి వరద కాస్త పెరిగినా ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేమంటున్నారు. అయితే ఆగస్టులో కొంత వరకు వానలు పడతాయన్న భారత వాతావరణ శాఖ తాజా సమాచారం రైతుల్లో ఆశలు రేపుతోంది. ఆ సూచనలు దేశం మొత్తానికీ కావడంతో మన రాష్ట్రంలో ఆ మేరకు వర్షాలు పడతాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్