mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిశాఖలో డేటా సెంటర్లపై డిజిటల్‌ ‌వార్‌

9 గంటల క్రితం

data center
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:47 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

డేటా సెంటర్ కథనం 1

• అభూత కల్పనలతో సర్కారు ప్రచారం

• తిప్పికొడుతున్న నగర ప్రజానీకం

ప్ర : డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల విశాఖలో వేడి, శబ్ద కాలుష్యం పెరుగుతుందా?

:ఆధునిక డేటా సెంటర్లు వేడి, శబ్ధాన్ని నియంత్రించేలా సమర్ధవంతంగా రూపొందించబడతాయి. వేడి ఉత్పత్తి అయినప్పటికీ అది 100-200 మీటర్ల దూరంలోనే గణనీయంగా తగ్గిపోతుంది. అందుకే వీటికి విశాలమైన స్థలాలు కేటాయిస్తారు. డేటా సెంటర్లు తయారీ పర్రిశమలు కావు. వీటిలో వినియోగించే అత్యాధునిక పరికరాలు 50 నుండి 90 శాతం శబ్దాన్ని నియంత్రిస్తాయి. ఇరుగుపొరుగు వారికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.

... ఇది విశాఖ ఎంపి శ్రీ భరత్‌ సోషల్‌ ‌మీడియాలో ఇటీవల చేసిన ఒక పోస్ట్‌!

• అమెరికా, యూరప్‌‌లలో ఒక్క డేటాసెంటర్‌ ‌కూడా ఎందుకు లేదు?

• సింగపూర్‌‌లో సముద్రపు నీటిని శుద్ది చేసి వాడుతున్నారు. ఇక్కడ ఎందుకు అలా చేయడం లేదు.

• అటువంటప్పడు మీ కళాశాల క్యాంపస్‌‌లో పెట్టుకోవచ్చు కదా!

• అమెరికా ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో

వాటి గురించి ఏమీ తెలియని మన దేశంలో పెడుతున్నారు.

• ఎంత నీటిని వాడుతారో చెప్పండి

• బహిరంగ చర్చ ఎందుకు నిర్వహించరు?

వేల సంఖ్యలో వ్యూస్‌ ‌పొందిన ఆ పోస్టుకు నగర ప్రజానీకం స్పందిస్తున్న తీరు ఇది. మేధావులు డేటా సెంటర్లు ఎలా హానికరమో వివరిస్తూ గణాంకాలతో సహా కామెంట్లు పెడుతున్నారు. సామాన్యులు సైతం నిరసన గళం వినిపిస్తున్నారు. ఇదొక్కటే కాదు. ఇటీవల కాలంలో డేటా సెంటర్లపై స్థానిక ఎంపి పెడుతున్న అన్ని పోస్టులకు దాదాపుగా ఇదేరకమైన స్పందన వస్తోంది.


ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ​డేటా సెంటర్లపై విశాఖలో డిజిటల్‌ ‌వార్‌ సాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు చోట్ల గూగుల్‌, ‌అదాని డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటిపై అభూత కల్పనలు, అవాస్తవాలతో ప్రభుత్వం తరపున సోషల్‌ ‌మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున చేస్తుండగా, వాటిని అంతే స్థాయిలో నగర ప్రజానీకం తిప్పికొడుతోంది. ప్రజల నుండి వస్తున్న విమర్శలు, మేధావులు చెబుతున్న వాస్తవాలతో కామెంట్‌ ‌బాక్సులు నిండిపోతున్నాయి. విశాఖ ఎంపి భరత్‌ ఈ అంశంపై ఇటీవల మూడు పోస్టులు చేయగా, వాటికి వేల సంఖ్యలో వ్యూస్‌ ‌రావడంతో పాటు రియాక్షన్స్‌ ‌కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఇది ఇంకా కొనసాగుతోంది. మొత్తానికి సోషల్‌ ‌మీడియా వేదికగా సాగుతున్న ఈ పోరాటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ డేటా సెంటర్లకు ఇచ్చే భూమి, నీరు, విద్యుత్‌, తదితరాలకు సంబంధించిన గణాంకాలపై రాష్ర్ట ‌ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ తో పాటు విశాఖ ఎంపి శ్రీభరత్‌ ‌ సోషల్‌‌ మీడియా ద్వారా సాగించే ప్రచారం వాస్తవానికి అల్లంత దూరాన వున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి.

రాయితీల వరద

​రూ. వేల కోట్ల విలువైన వందలాది ఎకరాలను గూగుల్‌, అదాని డేటా సెంటర్లకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఉమ్మడి విశాఖలో ధారాదత్తం చేశాయి. రాయితీల సంగతికొస్తే స్టాంప్‌ ‌డ్యూటీ పూర్తిగా మినహాయించారు. పారిశ్రామిక నీటి సరఫరా ధరపై పదేళ్ల పాటు 25 శాతం రాయితీ ఇవ్వనున్నారు. విద్యుత్‌ ‌సుంకాన్ని పూర్తిగా మినహాయించేశారు. 15 ఏళ్ల తర్వాత యూనిట్‌‌కి ఒక్కరూపాయి విధించ నున్నారు. నిర్మాణ దశలో రాష్ర్ట ప్రభుత్వానికి రావా ల్సిన పన్నులను వంద శాతం రీయింబర్స్‌‌మెంట్‌ ఇచ్చేశారు. భూములను కారుచౌకగా గూగుల్‌, అదానికి మార్కెట్‌ ‌ధరలో 25 శాతం తగ్గింపుతో 480 పైచిలుకు ఎకరాలను ఇచ్చేశారు.

​నిరంతరాయ డేటా సెంటర్లతో ముప్పే

విశాఖ నగరంలో భూగర్భజలాలు ఇప్పటికే ఇంకిపోతున్న తరుణంలో రాత్రీ, పగలూ నిరంతరాయంగా పనిచేసే డేటా సెంటర్లతో పెను ముప్పే వాటిల్లనుంది. నీరు, విద్యుత్‌ ‌వీటికి నిరంతరం కావాలి. డేటా సెంటర్ల వల్ల నీరు, విద్యుత్‌ ‌సంక్షోభం వస్తుందన్నది అపోహ మాత్రమేనంటూ ఎంపి శ్రీభరత్‌ ఇటీవల మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. అదే అంశాన్ని సోషల్‌ ‌మీడియాలో కూడా పోస్ట్‌ ‌చేశారు. అయితే, వాస్తవం దానికి భిన్నమని మేధావులు స్పష్టం చేస్తున్నారు. డేటా సెంటర్ల వల్ల విశాఖలో నీటికొరత పెరిగే ప్రమాదం ఉందని, వాటికి రోజూ లక్షలాది లీటర్లు అవసరమని, భారీగా విద్యుత్‌ అవసరమవుతుందని, దీంతో నగరంపై ఒత్తిడి పెరుగుతుందని రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌ ‌శర్మ, మానవ హక్కుల వేదిక ప్రతినిధులు, వామపక్షాల నేతలు చెబుతున్నారు. టెక్నాలజీ అభివృద్ధిలో ఎఐ మేలు చేసేదే అయినా డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో వందల ఎకరాల ప్రభుత్వ, ప్రజల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడంపై ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతూ పెట్టుబడులు, ఉద్యోగాలంటూ తప్పుడు లెక్కలతో గడచిన కొన్ని వారాలుగా ప్రచారం లంఖించుకోవడంపై ప్రజల్లో చర్చరేగుతోంది.

డేటా సెంటర్లు ఎక్కడ?

విశాఖ జిల్లాలో దాదాపు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్‌ సామర్థ్యంతో హైపర్‌ ‌స్కేల్‌ ‌డేటా సెంటర్‌ ‌నిర్మించడానికి గూగుల్‌ ముందుకొచ్చింది. ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో సుమారు 266 ఎకరాల్లో గూగుల్‌ ఎఐ డేటా సెంటర్‌ ‌క్యాంపస్‌ ‌నిర్మాణం కోసం తర్లువాడ కొండ చుట్టూ తవ్వకాలు, చదును పనులు నాలుగు నెలల క్రితమే ప్రారంభమయ్యాయి. అదాని గ్రూప్‌, సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్‌ ‌కంపెనీ కలిసి మధురవాడ ఐటి పార్కు ప్రాంతంలో 170 ఎకరాల్లో 200 మెగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌‌ను అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని ఇండస్ట్రియల్‌ ‌పార్కులో గూగుల్‌ ‌తన ప్రాజెక్టులను విస్తరించే యత్నాలు చేస్తోంది. విశాఖ జిల్లా అడవివరంలో గూగుల్‌ ‌మరో ఫెసిలిటీ సెంటరును సుమారు 160 ఎకరాల్లో చేపడుతోంది. వీటన్నింటికీ సింగపూర్‌, ఇతర దేశాల నుంచి సబ్‌ -‌సీ కేబుల్స్‌‌ను అనుసంధానించే కేబుల్‌ ‌ల్యాండింగ్‌ ‌కేంద్రాలను పైన తెలిపిన చోట్ల ఏర్పాటు చేయబోతున్నారు.

నీటి వినియోగంపై అవాస్తవాలు

విశాఖ.. గోస్తనీ నదితో పాటు పలు రిజర్వాయర్లపై ఆధారపడ్డ నగరం. ప్రతి ఎండాకాలంలోనూ నీటి ఎద్దటి ఎదుర్కొంటోంది. కానీ గూగుల్‌, అదాని వంటి కార్పొరేట్‌ ‌దిగ్గజాల కోసం పాలకులు ప్రజలను మభ్యపెడుతూ ప్రజలకు నష్టం చేసే ప్రాజెక్టులపై వాస్తవాలను దాచిపెడుతున్నారు. ఎంపి శ్రీభరత్‌ ‌చెప్పే లెక్క చూస్తే... ‘విశాఖ నీటి అవసరం ప్రస్తుతం రోజుకు 470-480 ఎంఎల్‌‌డి. సరఫరా అవుతున్నది 410 ఎంఎల్‌‌డి. పోలవరం పూర్తయి, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం పరిధికి 2110 ఎమ్‌ఎల్‌‌డిల నీటి సామర్థ్యం లభిస్తుంది. డేటా సెంటర్లు వచ్చినా నీటి మిగులు ఉంటుంది’ అని ఆయన చెబుతున్నారు. రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌.శర్మ చెబుతున్న ప్రకారం ఒక గిగావాట్‌కి ఏటా 1.86 టిఎంసి నీరు అవసరం. అంటే దాదాపు 161 మిలియన్‌ ‌లీటర్లు రోజుకు కావాలి. 380 ఎంఎల్‌‌డి మిగులు నీరు అనేది పోలవరం పూర్తి చేస్తేగానీ సాధ్యపడదు. ఇప్పటికే ఏళ్ల నుంచి పోలవరం సాగుతోంది. ఈ రెండేళ్లలో అయిపోతుందన్న రీతిలో ప్రభుత్వం చెప్పేయత్నాల్లో నిజమెంత ? గ్యారెంటీ ఎక్కడ ?. డేటా సెంటర్ల నీటి అవసరం 2040 నాటికి 1500 ఎంఎల్‌‌డి అని చెప్పినా దీనికి ప్రభుత్వం నిర్థిష్ట ఆధారమేదీ చూపకపోవడం గమనార్హం


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్