గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపది లక్షలమంది అరెస్టయినా పట్టదా..!

1 రోజు క్రితం

3333Screenshot from 2026-08-10 22-55-27.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 06:06 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

కార్మిక కర్షకులు సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారంనాడు దేశవ్యాప్తంగా పది లక్షలమందికి పైగా అరెస్టు కాగా ప్రధానమైనవని చెప్పబడే మూడు తెలుగు దినపత్రికలలో మంగళవారం నాటి కవరేజి చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కష్టజీవులు దేశమంతటా రోడ్డెక్కి ఏలినవారిని నిలదీస్తే అంత ప్రముఖ పరిణామాన్ని ఇవ్వడానికి వారికి చేతులెందుకు రాలేదో! దేశవ్యాప్తంగా వివిధ రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘాలతో కూడిన ఉమ్మడి వేదిక రైతాంగ సమస్యలపై ఆందోళనా పోరాటాలు సాగిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా అదే విధంగా కేంద్ర కార్మిక సంఘాలు జైలు భరో కు పిలుపునిచ్చ్చాయి. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ ఆందోళన సాగింది. పాలకులకు వ్యతిరేకంగా ఆసేతు హిమాచలం పిడికిలి బిగించింది.

​తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రిక మెయిన్ పేజీల్లో సోమవారంనాటి జైలు భరో వార్త ఎక్కడా కానరాలేదు. ఉద్యమాలకు బలమైన కేరళం, బెంగాల్, త్రిపుర వంటివేగాక తమిళనాడు, కర్ణాటక, బిజెపి పాలిత రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో అంతేగాక చిన్నవైన గోవా, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లోనూ ఉద్యమం ఉత్సాహంగా సాగింది. పది లక్షల మందికిపైగా నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇంత జరిగినా ఆ 'అగ్రశ్రేణి' దినపత్రిక చిన్నపాటి ఫోటో కానీ సింగల్ కాలం వార్తకానీ ఇవ్వకపోవడానికి కారణమేంటి? వారికి తెలియలేదా? ప్రపంచంలో ఏ మూలన సంభవించే పరిణామాన్నయినా ప్రచురించే ఆ పత్రిక దేశం నలుమూలలా దాదాపు అన్ని జిల్లాల్లో జరిగిన జైలు భరో కార్యక్రమం గురించి ఇవ్వకపోవడం ఆ వార్తను తొక్కిపెట్టాలనే దుర్బుద్ధితోనా? లేక కేంద్ర రాష్ట్ర పాలకులపై ప్రజాగ్రహాన్ని గురించి ప్రచురించ కూడదనా? లేక ఇంకేమైనా కారణాలున్నాయా?

నాలుగక్షరాల ఓ పత్రిక ఎక్కడో తొమ్మిదవ పేజీ కింది భాగంలో ఒక డబల్ కాలం ఫోటో ఇచ్చి దానికింద రైటప్ మాదిరిగా రెండు వాక్యాలు రాసింది. కనీసం శీర్షిక కూడా ఇవ్వనంత కోపం ప్రదర్శించింది. రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘాలు, జాతీయ ట్రేడ్ యూనియన్లు అనేక ప్రజా సంఘాల విశాల ఐక్యతతో సాగించిన ఉద్యమాన్ని.. మూడు నాలుగు విభాగాలకు ​చెందిన స్కీం వర్కర్లు కనీస వేతనాల కోసం కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారని పేర్కొనడాన్ని ఏమనుకోవాలి? వాస్తవానికి జులై 30 , 31 తేదీల్లో కనీస వేతనాల కోసం సి ఐ టి యు ఆధ్వర్యాన షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు స్కీం వర్కర్లు కాంట్రాక్ట్ ఔట్సోర్చింగ్ ఉద్యోగులు కలెక్టరేట్లను ముట్టడించారు .అది గుర్తుండిపోయి ఇప్పుడు మరలా రాసినట్టుంది.

పై రెండు పత్రికల్లో రాసినదానికి వ్యతిరేకంగా రాసే రెండక్షరాల పత్రిక ఒకటి తన మూడవ పేజీలో అట్టడుగున అంగన్వాడీ ఆశా వర్కర్లపై ఖాకీల క్రౌర్యం శీర్షికతో వార్త ఫోటో ప్రచురించింది. ఈ పత్రిక కూడా స్కీం వర్కర్ల కార్యక్రమం లాగానే రాసింది. అయితే శీర్షికలో వార్తలో పోలీసుల దౌష్ట్యం గురించి ఎండగట్టడం కొద్దిగా మెరుగు. అయితే ప్రతిపక్షం గొంతు వినిపిస్తామని చెప్పుకొనేవారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా గళాన్ని నినదించే ఇటువంటి కార్యక్రమాలకు కవరేజ్ ఇవ్వడం ఇలాగా?

​ప్రధాన తెలుగు దినపత్రికలుగా చెప్పబడే ఈ మూడు పత్రికలూ పరస్పర వ్యతిరేకమైన వార్తలు కథనాలు ఇస్తున్నా ఆ మూడింటికీ ఒక ఉమ్మడి లక్షణం కూడా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బిజెపిని అవి పల్లెత్తి మాట్లాడవు. గతంలో మణిపూర్ మారణహోమాన్ని బిజెపి కపట నాటకాన్ని ఇవ్వకపోవడం వంటి అనేక ఉదాహరణాలున్నా తాజా విద్యార్థి యువజన ఉద్యమానికి వారిచ్చిన అతి తక్కువ కవరేజ్ పరిశీలిస్తే సులభంగా బోధపడుతుంది. ఆ రెండు పత్రికలూ రాష్ట్రం లోని కూటమి సర్కారును రక్షించే 'పవిత్ర' కర్తవ్యాన్ని చేపట్టాయి. రాష్ట్రం లోని ఎన్డీయే ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసే మరోపత్రిక కేంద్రంలోని ఎన్డీయే పాలకులకు వ్యతిరేకంగా ఒక్క వాక్యం కూడా రాయదు . కానీ ఈ మూడూ కమలాన్ని ఎల్లవేళలా కాపాడుతూనే ఉండడం గమనార్హం. ఇదే సూత్రం జైలు భరో కార్యక్రమానికి వారు వర్తింపజేశారు. కార్మిక కర్షకులకు ప్రజలందరికీ కంటకంగా ఉన్న కార్పొరేట్ మతతత్వ కూటమి పాలనకు వ్యతిరేకంగా దేశమంతటా జరిగిన జైలు భరో ఉద్యమం ఢిల్లీ పీఠంపైనున్న పెద్దలకు కంటగింపుగా ఉంటుంది. కనుకనే ఆ మూడు పత్రికలూ ఇలా వ్యవహరించాయనుకోవాలి. అంతే!

-గిరిపుత్ర

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్