- 36.27% లోటు వర్షపాతం
- 1.25 లక్షల ఎకరాల్లో తగ్గిన వరి
- మిగిలిన పంటల్లోనూ వెనుకబాటు
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : విజయనగరం జిల్లాలో కరువు మేఘాలు కమ్మేశాయి. వర్షాభావం ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 36.27 శాతం లోటు వర్షపాతంతో చెరువులు, గెడ్డలు వెలవెలబోతున్నాయి. నీటి ఎద్దడితో 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గిపోయింది. మొక్కజొన్న, పత్తి మొదలుకుని, పప్పులు, చిరుధాన్యాల సాగు వరకు వెనుకబాటు కనిపిస్తోంది. అక్కడక్కడ వేసిన వరి నాట్లు, ఇతర పంటలు ఎండిపోతున్నాయి. చాలా చోట్ల పంట భూములు బీటలు వారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎలా బతుకుతామో అంటూ అన్నదాత ఆందోళన వ్యక్తం చేస్తుండగా, వ్యవసాయ కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసపోయేందుకు సిద్ధమవు తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో అన్ని పంటలూ కలుపుకుని సాధారణ సాగు విస్తీర్ణం 3.05 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.09 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. అంటే సాధారణ విస్తీర్ణంలో సుమారు 69 శాతం మాత్రమే సాగులోకి వచ్చింది. గత ఖరీఫ్‌తో పోల్చినా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 2025లో జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 1.41 లక్షల ఎకరాల సాగు తగ్గింది. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే మరో 96 వేల ఎకరాలు ఇంకా సాగులోకి రావాల్సి ఉంది.
సగానికి పైగా తగ్గిన వరి సాగు
జిల్లాలో ప్రధాన పంట వరి. దీని ద్వారా వచ్చిన ఆదాయంతోనే సగానికి సగం మంది రైతులు ఏడాది పొడవునా జీవనం సాగిస్తారు. కానీ, సాధారణ సాగు విస్తీర్ణం 2.48 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.23 లక్షల ఎకరాల్లోనే సాగైంది. గత ఏడాది ఇదే సమయంలో 2.37 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు 1.14 లక్షల ఎకరాల వరి సాగు తగ్గింది. సీజన్ ప్రారంభం నుంచీ తగిన వర్షాలు లేకపోవడంతో నారుమళ్లు, నాట్లు ఆలస్యమయ్యాయి. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 27,963 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 23,443 ఎకరాల్లో సాగైంది. సాధారణ విస్తీర్ణంలో ఇది సుమారు 84 శాతం. పత్తి సాధారణ విస్తీర్ణం 5,447 ఎకరాలకుగానూ ఇప్పటివరకు 5,382 ఎకరాల్లో సాగైంది. నువ్వులు 7,989 ఎకరాల్లో, చెరకు 5,051 ఎకరాల్లో సాగయ్యాయి. రాగి, పప్పుధాన్యాలు, వేరుశనగ వంటి పంటల సాగు కూడా సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే వెనుకబడింది.
మూడు నెలల్లో 36 శాతం లోటు వర్షం
జూన్‌లోనూ సాధారణ వర్షపాతం 123.5 మిల్లీమీటర్లకుగానూ 96.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 22.02 శాతం లోటు ఏర్పడింది. ముఖ్యంగా జులైలో సాధారణ వర్షపాతం 170.8 మిల్లీమీటర్లకుగానూ 58.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో, 65.98 శాతం లోటు ఏర్పడింది. దీంతో, వర్షాభావం తీవ్రంగా ఉండటంతో సాగు ముందుకు సాగలేదు. ఈ రెండు నెలలతో పోలిస్తే వర్షపాతం ఆగస్టులో పరిస్థితి కొంత మెరుగుపడినా సాధారణ వర్షపాతం 154.8 మిల్లీమీటర్లకు గానూ 131.8 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో, ఆ నెలలోనూ 14.86 శాతం లోటు కొనసాగింది. మొత్తంగా జూన్ నుంచి ఆగస్టు వరకు సాధారణ వర్షపాతం 449.1 మిల్లీమీటర్లు కాగా, 286.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. మొ త్తంగా 163 మిల్లీమీటర్లు లోటు, అంటే 36.27 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సకాలంలో వర్షాలు పడితే ఈ పాటికి వరి పొట్టదశలో ఉండేది. కానీ, పూర్తిస్థాయిలో నాట్లు వేసేందుకు కూడా అవకాశం లేకపోవడం, నాట్లు వేసిన చోట కూడా నీటి లభ్యత లేక ఎండిపోవడం వంటి కారణాలతో వరితోపాటు ఇతర పంటల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. సాధారణంగా వరి నారు పోసిన 25 రోజుల నుంచి 30 రోజుల లోపే నాట్లు వేయాల్సి ఉంటుంది. కానీ, నారుపోసి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇక వర్షాలు కురిసినా దిగుబడి వచ్చే అవకాశం లేదని వ్యవసాయ శాఖ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేధిస్తున్న విద్యుత్తు సమస్య
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో నాట్లు ఎండిపోతున్నాయి. కాలువలు, మోటార్లు ఉన్న చోట్ల రైతులు వరి నాట్లను బతించుకొనేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మోటార్ల కింద వేసి నాట్లను బతికించుకొందామంటే విద్యుత్తు సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఎప్పుడు త్రీఫేజ్ విద్యుత్తు ఉంటుందో తెలియని పరిస్థితి ఉందని సాలూరు, పాచిపెంట తదితర మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ ద్వారా నీరందక శివారు భూముల రైతులు అవస్థలు పడుతున్నారు.
ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి
వరి, ఇతర పంటల సాగు శ్రేయస్కరం కాదు. ఒకవేళ వేసినా ఆశించిన దిగుబడి రావడం కష్టం. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా వరి స్థానంలో అపరాలు లేదా ఇతర ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నాం.
-విటి.రామారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
వరి పొలాలు బీటలు వారుతున్నాయి
వర్షాభావంతో నాలుగు ఎకరాల్లో సాగు కష్టంగా ఉంది. మోటారుకు గంటకు రూ.400 అద్దె చెల్లించి నాట్లు వేశాను. వర్షాల్లేక పొలాలు బీటలు వారుతున్నాయి. నాట్లకు ఎకరాకు సుమారు రూ.18 వేలు వరకు మదుపులు అయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలి.
-సంగారెడ్డి కృష్ణ, పాతబగ్గాం, గజపతినగరం మండలం
ఇంజన్‌తో నీటి తడులు అందిస్తున్నాను
నేను 1.5 ఎకరాల్లో వరి సాగు చేశాను. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల పంట పండే అవకాశం లేదు. పంట సాగుకు ఇప్పటి వరకూ రూ.8 వేలు మదుపు అయ్యింది. ప్రస్తుతం ఇంజన్లతో నీరు తోడి పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. పెట్రోల్ నిమిత్తం రూ.2 వేలు వరకు ఖర్చయింది. వారం, పది రోజుల్లో వర్షం పడితే కొంతవరకు ఫర్వాలేదు. లేకపోతే ఈ ఏడాది వరి పంట నష్టం పోవడమే.
-రౌతు అప్పలనాయుడు, రైతు, పల్లిగండ్రేడు, గుర్ల మండలం








కామెంట్‌లు (0)