- నివాస ప్రాంతంలో కూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది దుర్మరణం
ఫ్లోరిడా: అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బిజినెస్ జెట్ నివాస ప్రాంతంలో కూలిపోవడంతో విమానంలో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. పామ్ బీచ్ కౌంటీలోని క్రెస్ట్‌హేవెన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 12:50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన మార్-ఎ-లాగో రిసార్ట్‌కు సుమారు 9 మైళ్ల దూరంలో ఉంది. లియర్‌జెట్ 60 రకానికి చెందిన ఈ విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహామాస్‌కు బయలుదేరింది. ప్రయాణ సమయంలో విమానం సుమారు 35 వేల అడుగుల ఎత్తులో ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనట్లు సమాచారం. తీవ్ర గాలులు, మంచు పేరుకుపోవడం, వర్షం కారణంగా పైలట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. విమానాన్ని మరో 2 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లేందుకు అనుమతి కోరిన కొద్దిసేపటికే అది కూలిపోయింది.
విమానం రహదారి సమీపంలో కూలిన వెంటనే భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. రహదారిపై భారీ గుంత ఏర్పడటంతో పాటు దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. సమీపంలోని ఇళ్లకు అతి దగ్గరగా విమానం కూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కార్లలో ప్రయాణిస్తున్న పలువురు ఈ ప్రమాద దృశ్యాలను వీడియోల్లో చిత్రీకరించారు.
ప్రమాదంపై అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమానంలోని తొమ్మిది మంది మరణించినట్లు ధ్రువీకరించారు. ఎఫ్ఏఏ, ఎన్టిఎస్బి అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్నవారి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ప్రమాదానికి అసలు కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.







కామెంట్‌లు (0)