• 166 జలాశయాల్లో 26శాతానికి పడిపోయిన నీటి నిల్వలు
• సిడబ్ల్యూసి వారాంతపు నివేదిక వెల్లడి
ప్రజాశక్తి - న్యూ ఢిల్లీ : మన రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాలలోనూ జూన్ నెలలో తక్కువ వర్షపాతం కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఖరీఫ్ సాగు విషయమై రైతాంగంలో ఆందోళన నెలకొంది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. కేంద్ర జలసంఘం (సిడబ్య్లుసి) విడుదల చేసిన నివేదిక ఆధారంగా ఈ మేరకు 'డౌన్ టు ఎర్త్` ఒక కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం దేశ వ్యాప్తంగా 166 జలాశయాల్లో మొత్తం నీటి నిల్వలు 26 శాతానికి పడిపోయాయి. వాటిలో 34 జలాశయాల్లో పరిస్థితి మరింత ఆందోళన కరంగా ఉంది. నైరుతి రుతుపవనాల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ, వరదలు ముంచెత్తుతున్న సమయంలోనే మిగిలిన చోట్ల ఈ రకమైన దుర్బిక్ష ఛాయలు పరుచుకున్నాయి.
సిడబ్య్లుసి ఏం చెప్పింది?
ఈ నెల రెండవ తేదిన సిడబ్య్లుసి విడుదల చేసిన వారాంతపు బులెటెన్ ప్రకారం దేశంలోని 166 ప్రధాన జలాశయాల్లో మొత్తం47.725బిలియన్ క్యూబిక్ మీటర్ల (బిసిఎం) నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ జలాశయాల మొత్తం ప్రత్యక్ష నిల్వ సామర్థ్యం 183.365 బిసిఎం కాగా, ప్రస్తుతం ఉన్న నిల్వ కేవలం 26శాతమే. గత ఏడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టులలో 78.077 బిసిఎంల నీటి నిల్వ ఉండటం గమనార్హం. సాధారణంగా జులై మొదటి వారానికి దేశంలోని చాలా ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తాయి. జలాశయాలు వేగంగా నిండటం ప్రారంభమవుతుంది. ఈ సారి దానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
సిడబ్య్లుసి బులెటిన్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, బీహార్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులలో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. వీటిలో కూడా కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులలో నీటి నిల్వలు తీవ్ర ఆందోళన కరంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. తూర్పు భారతదేశంలోని జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో కూడా నీటి నిల్వలు సాధారణ స్థాయికి చాలా తక్కువగా నమోదయ్యాయి.
వర్షపాతంలోనూ అసమానత
భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం దేశంలోని 741 జిల్లాల్లో 325 జిల్లాలు వర్షపాతం లోటు, 165 జిల్లాలు తీవ్రమైన వర్షపాతం లోటు విభాగాల్లో ఉన్నాయి. అంటే దేశంలోని దాదాపు రెండు మూడొంతుల జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, అసోం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అత్యధిక జిల్లాలు సాధారణం కంటే తక్కువ లేదా అత్యల్ప వర్షపాతం విభాగాల్లో ఉన్నాయి. మరోవైపు తమిళనాడులోని చాలా జిల్లాలు, అలాగే రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో సాధరణం, అంతకన్నా ఎక్కువ వరపాతం నమోదైంది.
అత్యంత ఆందోళనకరం
జలాశయం రాష్ట్రం సాధారణంతో పోలిస్తే నిల్వ
చందన్ బీహార్ 1.86%
రెంగాళి ఒడిశా 3.15%
ఆల్మట్టి కర్ణాటక 10.35%
తుంగభద్ర కర్ణాటక/ ఆంధ్రప్రదేశ్ 15.80%







కామెంట్‌లు (0)