- సాధారణంగా జులైలోనే గేట్లు ఎత్తివేత
- ఈ సారి కానరాని ఆ పరిస్థితి
- గత రెండేళ్ల కంటే దారుణంగా *నీటి నిల్వ
- 2023 పరిస్థితి తలెత్తేనా..?
ప్రజాశక్తి -కర్నూలు ప్రతినిధి : రాయలసీమతో పాటు ఉమ్మడి కృష్ణా బేసిన్‌కు జీవనదైనా శ్రీశైలం జలాశయంపై ఎల్‌నినో ప్రభావం పడింది. ఈ ఏడాది వరద జాడ కనిపించడం లేదు. సాధారణంగా జులై, ఆగస్టు నాటికి ఎగువ కృష్ణా నుంచి భారీగా వరద నీరు వచ్చి నిండుకుండలా మారేది. ఈసారి ఆగస్టు మూడో వారం వచ్చినా ఆశించిన స్థాయిలో నిండలేదు. గతేడాది ఇదే సమయానికి 2.32 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదై గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 76,951 క్యూసెక్కులకే పరిమితమైంది. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావం వల్ల 2023 ఈ ఏడాదీ పునరావృతమవుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2023లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో శ్రీశైలం జలాశయానికి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. గతేడాది జులై 8న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. 2024లో జులై 29న గేట్లను ఎత్తారు. ఈ ఏడాది ఆగస్టు మూడో వారం వచ్చినా ఇప్పటి వరకూ నీటిని విడుదల చేయలేదు. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ 215.81 టిఎంసిలు కాగా గతేడాది ఇదే సమయానికి 209,5948 టిఎంసిల నీరు ఉంది. ప్రస్తుతం 167.4860 టిఎంసిల నీరు మాత్రమే ఉన్నాయి. జలాశయ గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా గతేడాది ఇదే సమయానికి నీటిమట్టం 883.90 అడుగులు ఉంది. ప్రస్తుతం 875.80 అడుగులు మాత్రమే ఉంది. 2023లోశ్రీశైలం నీటిమట్టం 808.80 అడుగులకు పడిపోయి, నిల్వ 33.62 టిఎంసిలకు పరిమితం కావడంతో ఆ ఏడాది ఆగస్టు ఐదు నాటికి జలాశయంలో 102.89 టిఎంసిల నీరు నిల్వ ఉంది. అదే సమయంలో 69,814 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే నమోదైంది. అలాంటి పరిస్థితుల్లో గేట్లు ఎత్తలేదు. ఆగస్టు 11 నాటికి నిల్వ 118 టిఎంసిలకు చేరి నీటిమట్టం కేవలం 863 అడుగుల వద్దే ఉంది. సాధారణంగా ఈ దశలో శ్రీశైలం పూర్తిస్థాయి నిల్వకు చేరువలో ఉండాల్సి ఉండగా, వర్షాలు వరదలు లేకపోవడంతో దిగువకు నీటి విడుదలపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. 2023లో పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో బలపడడంతో నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా ఆగస్టులో 36 శాతం వర్షపాతం లోటు నమోదైంది. దక్షిణ భారతదేశంలో ఈ లోటు 60 శాతం వరకు ఉండడంతో కృష్ణా నదీ ఎగువ క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో వరదలు రాలేదు. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి శ్రీశైలానికి నీటి ప్రవాహం తీవ్రంగా తగ్గింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే, 2023లో నమోదైన వర్షాభావ పరిస్థితులను ఈ ఏడాది కూడా శ్రీశైలం జలాశయం తలపిస్తోందనే అభిప్రాయం జలవనరుల శాఖ అధికారుల్లో వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది జూన్ వరకూ తాగునీటి అవసరాల కోసం ఉండేలా శ్రీశైలంలో నీటిని నిల్వ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది గేట్లు ఎత్తే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసి, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలకు భారీగా వరదలు వస్తేనే శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరిగే అవకాశం ఉంది. వచ్చే వారం వర్షాల తీరుబట్టే జలాశయ పరిస్థితిని నిర్ణయించే కీలక అంశంగా మారనుంది.








కామెంట్‌లు (0)