గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏరువాకకు ఎల్‌‌నినో దెబ్బ

01 జులై, 2026

El Niño
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 06:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

• జూన్‌‌లోనే వర్షాభావం భయానకం

• రాష్ట్రంలో 63% మైనస్‌

• ఖరీఫ్‌‌నకు ఆదిలోనే వాన గండం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఖరీఫ్‌ వ్యవసాయ పనుల ఆరంభానికి (ఏరువాక) ఈ సంవత్సరం ఎల్‌‌నినో దెబ్బ తగిలింది. ఈ మారు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని మొదట్లోనే వాతావరణ శాఖ హెచ్చరించగా మరీ తొలుతనే సమస్య ఉండకపోవచ్చని, జూలై, ఆగస్టు మాసాల్లో తక్కువగా వానలు పడతాయని రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా ఉంది. అటు వాతావరణశాఖ ఇటు ప్రభుత్వం అంచనాలకు భిన్నంగా ఖరీఫ్‌ ‌మొదటి నెల జూన్‌‌లోనే సేద్యానికి వాన గండం వచ్చి పడింది. నైరుతి రుతుపవనాలు ఊహించిన దానికంటే ఐదారు రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించి మురిపించి అంతలోనే ముఖం చాటేశాయి. తొలకరి వానల జాడ లేక సాగు పనులు స్తంభించాయి. మామూలుగా జూన్‌‌లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయి. కాని ఈ ఏట రాష్ట్రంలో సగటు సాధారణ వర్షంలో ఏకంగా 63.19 శాతం తక్కువ పడింది. జూన్‌ 1 ‌నుంచి జూన్‌ 30 ‌వరకు సాధారణ వర్షపాతం 79.24 మిల్లీమీటర్లు కాగా 29.17 మిమీ పడింది. ఎపిలో 28 జిల్లాలుండగా ఏకంగా 17 జిల్లాల్లో అత్యల్ప వర్షం (‌మైనస్‌ 60-99 శాతం) కురిసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, మార్కాపురం, పోలవరం జిల్లాల్లో అత్యల్ప స్థాయిలో వర్షం పడింది. నంద్యాలలో రాష్ట్రంలోనే అత్యల్ప వర్షం కురిసింది. ఆ జిల్లాలో 84.42 శాతం తక్కువ నమోదైంది. లోటు 80 శాతం కంటే పైబడిన జిల్లాలు అన్నమయ్య, పశ్చిమగోదావరి. పదకొండు జిల్లాల్లో తక్కువ వర్షం (మైనస్‌ 20-59 శాతం) ‌కురిసింది. జూన్‌‌లో రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. తక్కువ వర్షం కేటగిరీలో కూడా పల్నాడు, అనకాపల్లిలో మాత్రమే మైనస్‌ 20-30 శాతం వర్షం పడింది. రాష్ట్రంలోకెల్ల కాస్త మెరుగ్గా పల్నాడులో మైనస్‌ 23.37 శాతం, అనకాపల్లిలో మైనస్‌ 25.57 శాతం నమోదయింది. నెల్లూరులో 37.56 శాతం తక్కువగా వర్షం పడింది. తక్కువ వర్షం కురిసిన తతిమ్మా జిల్లాల్లో 40 శాతం పైనే లోటు నమోదైంది. ఎంతటి తీవ్ర కరువు పరిస్థితులు తెలెత్తినా నైరుతి రుతుపవన కాలం మొదటి నెలలో ఇటువంటి అనావృష్టి లేదని వయసులో సీనియర్లయిన రైతులు చెబుతున్నారు.

సేద్యానికి సమస్య

వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రపదేశ్‌‌లో అత్యధిక సాగు ఖరీఫ్‌‌లోనే సాగుతుంది. సీజన్‌లో దాదాపు 80 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటల సాగుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. కూరగా యలు, ఉద్యానవన పంటలతో కలిపితే కోటి ఎకరాల సేద్యం ఒక్క ఖరీఫ్‌‌లోనే జరుగుతుంది. ఆదిలోనే తీవ్ర వర్షాభావం నెలకొనడంతో మొత్తం సీజన్‌పై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్‌, నవంబర్‌‌లో తరచు తుపాన్లు వచ్చి చేతికొచ్చిన పంటలను ఊడ్చిపెడుతున్న అనుభవంతో ఈ తడవ పంట కాలాన్ని కాస్త ముందుకు జరపాలని ప్రభుత్వం ఆశించింది. ముందుగానే కాల్వలకు నీరు విడుదల చేయడానికి క్యాలెండర్‌ సైతం ప్రకటించింది. కాని జూన్‌‌లో తీవ్ర వర్షాభావం ఏర్పడటంతో ప్రభుత్వ అంచనాలు తప్పాయి.

నిండుకున్న జలాశయాలు

ప్రధాన జలాశయాలైన శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 42 టిఎంసిలే ఉన్నాయి. డెడ్‌ ‌స్టోరేజిగా పేర్కొంటున్నారు. నాగార్జునసాగర్‌‌ ఫుల్‌ ‌కెపాసిటీ 312 టిఎంసి కాగా ఇప్పుడు 138 టిఎంసి ఉన్నాయి. పులిచింతలలో 45 టిఎంసిలకు 33 టిఎంసి ఉన్నాయి. సోమశిల, కండలేరులో వాటి కెపాసిటీలనుబట్టి నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయంటున్నారు. కృష్ణాపై ఎగువనున్న కర్ణాటక ఆల్మట్టి, నారాయణపూర్‌‌లోనూ అంతంత మాత్రంగానే నీటి నిల్వలున్నాయి. ఈ తరుణంలో కృష్ణా డెల్టాకు పీట్టిసీమ నీరే దిక్కు. అయితే గోదావరి బేసిన్‌‌లో వానల్లేకపోతే వరద రాకపోతే పట్టిసీమ నీటికి సైతం సమస్య నెలకొంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు, తక్కువ కాల వ్యవధిలో పంట చేతికొచ్చే రకాలను సాగు చేయాలని సూచిస్తోంది. ఇదిలాఉండగా, గతేడాది ఖరీఫ్‌, రబీ సీజన్లలో పలు మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఆ ప్రభావంతో భూగర్భ జలాలు కిందికి చూస్తున్నాయి. ఒకవేళ విద్యుత్‌ అందించినా నీటి కొరత తప్పదని ఆవేదన చెందుతున్నారు. వర్షాలు పడకపోతే విద్యుదుత్పత్తికీ అంతరాయం ఏర్పడుతుందనన్న భయాలు నెలకొన్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్