గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉద్యోగుల సమరశంఖం ...

2 రోజుల క్రితం

Employees Sound the Bugle of Struggle
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 01:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఎస్‌బిఐఒఎ(ఎసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జికె విశ్వనాథ్‌

ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్లు స్టేట్‌ ‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్‌ (అమరావతి సర్కిల్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జికె విశ్వనాథ్‌ తెలిపారు. ఆదివారం ఆయనను కలిసిన ప్రజాశక్తితో మాట్లాడుతూ... యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బియు) పిలుపు మేరకు ఈ సమ్మె చేస్తున్నాం. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోతే అక్టోబర్‌ 26 నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తాం. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలుపై ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు, వినతిపత్రాలు, నిరసనలు, సమ్మెలు నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. 2024 మార్చి 8న కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందం, 9వ జాయింట్‌ నోట్‌ సందర్భంగా అనేక సమస్యలు చర్చకు వచ్చాయి. బ్యాంకింగ్‌ రంగంలో యుపిఐ, ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఎటిఎంలు వంటి డిజిటల్‌ సేవలు విస్తరించినప్పటికీ ఉద్యోగులపై పని భారం పెరిగింది. వ్యాపార లక్ష్యాలు, కేవైసి, నియంత్రణ నిబంధనలు, కస్టమర్‌ సేవలు, పరిపాలనా బాధ్యతలు పెరిగిన నేపథ్యంలో ఐదు రోజుల పని విధానం ఉద్యోగులకు పని జీవిత సమతుల్యతకు దోహదపడుతుంది. జనవరి 27న దేశవ్యాప్త సమ్మె, ఆగస్టు 12న నిరసన, సెప్టెంబర్‌ 11న ఒకరోజు సమ్మె నిర్వహించినా సమస్యలు పరిష్కారం కాలేదు. ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పెడచెవిన పెట్టడంవల్లే మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ పోరాటం ఖాతాదారులకు వ్యతిరేకం కాదు, ఉద్యోగుల సంక్షేమం, మెరుగైన పని పరిస్థితుల కోసం చేపడుతున్న ఉద్యమం. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలయ్యే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగిస్తాం. మా ప్రధాన లక్ష్యం ఎప్పటికీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవడ మే. బ్యాంకింగ్ వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకు ఉద్యోగులు ఎల్లప్పుడూ అంకితభావంతో సేవలందిస్తున్నారు. అన్ని కేడర్లకు చెందిన ఉద్యోగులు, అధికారులు ఐక్యంగా, క్రమశిక్షణ, శాంతియుతంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరముంది. మన ఐక్యతే, మన ఉద్యమానికి అతి పెద్ద బలం, ఐదు రోజుల బ్యాంకింగ్ సాధించే వరకు మన సమిష్టి కృషి కొనసాగాలి... అని విశ్వనాథ్‌ వివరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్