శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూటమిలో పెరుగుతున్న గ్యాప్‌

2 గంటల క్రితం

seats
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- తేలని ‘స్థానిక కోటా’

- బల ప్రదర్శన కోసం సమావేశాలు

- డిఎస్సి విమర్శలపై స్పందించని జనసేన

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూటమి పార్టీల మధ్య గ్యాప్‌ ‌పెరుగుతోంది. త్వరలో జరగనున్న ‘స్థానిక సంస్థల ఎన్నికలు’ నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఇప్పటి వరకు ఏ పార్టీకి ఎంత శాతం సీట్లు అనే అంశం తేలలేదు. సమన్వయ సమావేశాలు పేరుతో గ్యాప్‌ ‌లేదంటూ పైకి చెబుతున్నా లోపల మాత్రం బలబలాల ప్రదర్శనల కోసం సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశాల్లో కిందిస్థాయి క్యాడర్‌‌ను కదిలిస్తూ స్థానిక ఎన్నికల్లో బలం చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా టిడిపి, జనసేన ఈ సమావేశాలు నిర్వహించి కిందిస్థాయి కార్యకర్తలను కదిలించాలని నాయకులకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. లీడర్‌షిప్‌ ‌కాంక్లేవ్‌ ‌పేరుతో టిడిపి అధిష్టానం ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు సోమ, మంగళ వారాల్లో పార్టీ కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున ప్రభుత్వం నుంచి విడుదల చేస్తామని ప్రకటించారు. కేవలం ఈ నిధులు స్థానిక సంస్థల ఎన్నికల ముందే ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఇదోరకం ప్రలోభంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క జనసేన స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమం పేరుతో బుధవారం తాడేపల్లిలో సమావేశం జరిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35శాతం పోటీ చేసే అవకాశం కల్పించాలని 35శాతం 10శాతం కల్పించాలని బిజెపి డిమాండ్‌ ‌చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రెండు నెలల క్రితం కోరినట్లు సమాచారం. రెండు పార్టీలకు కలిపి 15శాతమే ఇస్తామని టిడిపి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌నారా లోకేష్‌ అనట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్‌ ‌మాటలతో పవన్‌ ‌కళ్యాణ్‌ అలకబూనినట్లు సమాచారం. అందుకనే సుమారు రెండు నెలల నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటునట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశాలకు, ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాటు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. లోక్‌‌భవన్‌‌లో ఆగస్టు 15వ తేదిన ఎట్‌‌హోం కార్యక్రమానికి, ఈ తరువాత నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు తీవ్ర జ్వరం ఉందని హాజరు కాలేదు. అసెంబ్లీ చివరి రోజు మాత్రం వచ్చిన పవన్‌ ‌కళ్యాణ్‌ ‌జనసేన పార్టీ శాసనసభపక్ష సమావేశం నిర్వహించుకొని వెళ్లిపోయారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ జరుగుతున్నా, శాసనసభలో లోకేష్‌ ఉన్నా కలవకుండానే వెళ్లిపోయారు. ఇద్దరు కూడా అసెంబ్లీ ప్రాంగణం నుంచి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే కలుసుకోకుండా బయటకు వెళ్లిపోవడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 10,11 తేదీల్లో జరిగిన కలెక్టర్ల సదస్సుకు కూడా పవన్‌ హాజరు కాలేదు. మరోపక్క పార్లమెంటరీ కూటమి సమావేశాల్లో పార్టీ విధానాన్ని మాత్రమే చెప్పాలని, సీట్లు, సర్దుబాట్లు పార్టీ అధ్యక్షుడి పరిధిలో ఉంటాయని జనసేన పిఎసి చైర్మన్‌ ‌నాదెండ్ల మనోహర్‌ ఆ పార్టీ నేతలకు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ శ్రేణుల ఆత్మగౌరవం దెబ్బతినకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలో పోటీలో నిలుస్తుందని అన్నారు.

డిఎస్సిపై జనసేన మౌనం

డిఎస్సి-2025పై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై జనసేన నుంచి స్పందన లేదు. కనీసం ఆ పార్టీ మంత్రలు,ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా స్పందించకపోవడంతో టిడిపి నేతలు కొంత గుర్రుగా ఉనట్లు సమాచారం. డిఎస్సిపై పెద్దఎత్తున వైసిపి విమర్శలు చేస్తున్నా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన, బిజెపి ఎందుకు స్పందించడం లేదని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క డిఎస్సి నియామక ప్రతాలు అందజేత కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్ధులకు నియామక పత్రాలు అందించేందుకు గతేడాది సెప్టెంబర్‌ 25వ తేదిన సచివాలయం వద్ద పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్‌ అభ్యర్ధులకు నియామక పత్రాలు అందించారు. పవన్‌ ‌కళ్యాణ్‌ ‌మాత్రం ఈ సభకు హాజరు కాలేదు. చంద్రబాబు నాయుడు బుధవారం కోనసీమ జిల్లా పి గన్నవరంలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పవన్‌ ‌కళ్యాణ్‌‌తో కలిసి ఈ నియామక పత్రాలు అందించామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కొంతమంది జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి నియామకాలపై విమర్శలు వస్తున్న సమయంలో తమ నేతను ఇరికించేందుకు ప్రయత్నిస్తునట్లు వారు భావిస్తునట్లు తెలిసింది.

తలనొప్పిగా సోషల్‌ ‌మీడియా

టిడిపి, జనసేనకు సోషల్‌ ‌మీడియా తలనొప్పిగా మారింది. .ఇరు పార్టీల కార్యకర్తలు సోషల్‌ ‌మీడియా వేదికగా ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రాజకీయంతో పాటు సినిమాల పరంగా కూడా ఈ విమర్శలు వేడి ఉండటం ఇరుపార్టీలకు గ్యాప్‌ పెంచుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన నాగబాబు కొడుకు సినిమాలో సీనియర్‌ ఎన్టీఆర్‌ను ట్రోల్‌ ‌చేశారంటూ ప్రతిగా సోషల్‌ ‌మీడియాలో టిడిపి కార్యకర్తలు పవన్‌ ‌కళ్యాణ్‌, ఆయన కుటుంబ సభ్యులపై ట్రోల్స్‌ ‌నడిపించారు. అదేవిధంగా ఎన్టీఆర్‌పై కూడా కొంతమంది జనసైనికులు ట్రోల్స్‌ ‌నడిపించారు. సోషల్‌ ‌మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయొద్దని జనసేన, టిడిపి ఆ పార్టీ నేతలకు విడివిడిగా ఆదేశాలు ఇచ్చాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్