శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బీమా భరోసా అంతంతే!

9 గంటల క్రితం

bheema
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 05:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

• గడువులు పెంచినా నమోదులు తక్కువే

• ‘ఉచితం’ లేక రైతులు దూరం

• ఎల్‌‌నినో సమయంలో రైతులపై రూ.272 కోట్ల ప్రీమియం భారం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : సూపర్‌ ఎల్‌‌నినో ప్రభావిత ఈ ఖరీఫ్‌ ‌సీజన్‌‌లోనూ పంటల బీమా పథకాల్లో రైతుల నమోదు అంతంత మాత్రంగానే ఉంది. సాగైన ప్రతి ఎకరాన్నీ ఇ-క్రాప్‌‌లో ఎక్కించి ఇన్సూరెన్స్‌ ‌చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినా రైతులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అందుకు ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమాను రద్దు చేయడమేనని చెబుతున్నారు. సాగు చేసిన పంటలు వర్షాభావం వల్ల దెబ్బతిని ఆర్థికంగా నష్టపోతామని తెలిసినా ప్రీమియం భారం భరించలేక ఇన్సూరెన్స్‌‌కు దూరం జరిగారు. వచ్చే కొద్దిపాటి పరిహారాన్ని గత్యంతరం లేక వదులుకున్నారు. ఎల్‌‌నినో వేళ బీమా పథకాల్లో చేరేందుకు రైతులు తమ వంతు ప్రీమియం వాటా చెల్లించడానికి ప్రభుత్వం రెండు తడవలు గడువులు పొడిగించినా ఎన్‌‌రోల్‌‌మెంట్‌ ‌చెప్పుకోతగ్గ స్థాయిలో పెరగలేదు. కాగా ఎన్‌‌రోల్‌‌మెంట్‌ జరిగిన మేరకు రైతులు తమ వాటాగా రూ.272 కోట్లు ఇన్సూరెన్స్‌ ‌కంపెనీలకు చెల్లించారు. కూటమి ప్రభుత్వ ఉచిత పంటల బీమా రద్దు విధానం కార ణంగా ఎల్‌‌నినో ప్రభావిత రైతులు తమ జేబుల్లో నుంచి ‌రూ.వందల కోట్లల్లో ప్రీమియం భరించాల్సి వచ్చింది.

స్పెషల్‌ ‌డ్రైవ్‌ ఇచ్చినా...

ఉచిత పంటల బీమా రద్దు తర్వాత రైతులు తమ వంతు ప్రీమియం చెల్లించుకోలేక పథకాలకు దూరం జరుగుతున్నారు. ఈ విమర్శల నుంచి బయట పడేందుకు 2026 ఖరీఫ్‌‌లో రైతులతో బలవంతంగానైనా ప్రీమియం చెల్లించే విధంగా అధికార యంత్రాంగం స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టింది. ఎల్‌‌నినో రావడంతో శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంఎల్‌ఎలకు బీమా బాధ్యత పురమాయించారు. మొన్నటి కలెక్టర్ల సమావేశంలో అధికారులకు ఆ విధంగా దిశా నిర్దేశం చేశారు. అధికారులు వెంటపడుతున్నా రైతులు ప్రీమియం చెల్లించలేక ఊరుకున్నారు. మరోవైపు వాతావరణ ఆధారిత బీమాకు ప్రీమియం చెల్లించే గడువు మామూలుగా జూలై 15తో ముగియగా గడువును రెండు తడవలుగా ఆగస్టు 15 వరకు పొడిగించారు. ఫసల్‌ ‌బీమా (దిగుబడి ఆధారితం) గడువు జూలై ఆఖరుతో ముగియగా ఆగస్టు 31 వరకు పొడిగించారు.

అయినా ఉచిత పంటల బీమా సమయంలో ఎన్‌‌రోల్‌‌మెంట్‌తో పోల్చితే బాగా తక్కువే జరిగింది. కూటమి సర్కార్‌ ఉచిత బీమా అమలు చేసిన 2024 ఖరీఫ్‌‌లో ఫసల్‌లో 23.97 లక్షల మంది రైతులు 51.55 లక్షల ఎకరాల్లోని పంటలకు ఇన్సూరెన్స్‌ చేయించగా, ఉచితం ఎత్తేశాక 2025 ఖరీఫ్‌‌లో 4.43 లక్షల మంది 8.17 లక్షల ఎకరాలకు బీమా చేయించారు. స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌తీసుకున్న ఈ ఏడాది 2026లో 11.67 లక్షల మంది రైతులు 27.77 లక్షల ఎకరాలకు బీమా చేయించారు. ఉచితం ఉన్న సీజన్‌‌ కంటే 12 లక్షల మంది తగ్గారు. గతేడాది కంటే కొంత వరకు నమోదులు పెరిగినా, ఉచితం ఉన్నప్పటి కంటే సగం కంటే ఎక్కువ తగ్గుదల ఉంది.

వాతావరణ బీమా సైతం

వాతావరణ బీమా విషయానికొస్తే... ఉచితం అమలు చేసిన 2024 ఖరీఫ్‌‌లో 8 లక్షల మంది రైతులు 19.57 లక్షల ఎకరాలకు బీమా చేయించగా, ఉచితం ఎత్తేసిన 2025 ఖరీఫ్‌‌లో బీమా చేయించిన రైతుల సంఖ్య 2.99 లక్షలకు, విస్తీర్ణం 10.97 లక్షల ఎకరాలకు తగ్గాయి. ఎల్‌‌నినో సమయంలో వాతావరణ ప్రతికూలత అధికంగా ఉంటుంది. కానీ ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నాక కూడా 2026లో వాతావరణ బీమాలో 4.91 లక్షల మంది రైతులే చేరారు. తాము సాగు చేసిన 14.87 లక్షల ఎకరాలకు బీమా చేయించారు.

వాతావరణ బీమాలో అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల రైతులే అధికంగా చేరారు. ఫసల్‌‌లో లక్ష మంది కంటే ఎక్కువ నమోదులు అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళంలో జరిగాయి. వాతావరణ బీమా కింద రైతులు రూ. 188.80 కోట్లు, ఫసల్‌ ‌కింద 83.95 కోట్లు.. వెరశి 272 కోట్లు కంపెనీలకు తమ వంతు ప్రీమియం చెల్లించారు. సెప్టెంబర్‌ 16 ‌నాటికి దాదాపు 60 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగు చేశారని వ్యవసాయశాఖ వెల్లడించగా, వాటిలో 47 లక్షల ఎకరాలు మాత్రమే బీమా పరిధిలోకి వచ్చాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్