సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘రైవాడ’ నీరు కలేనా?

21 గంటల క్రితం

vepda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 07:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- దశాబ్దాలుగా ఎదురుచూపులు

- అందని సాగు, తాగునీరు

- పాలకుల తీరుపై రైతుల ఆగ్రహం

ప్రజాశక్తి- వేపాడ (విజయనగరం జిల్లా) : ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు.. ఎన్నికల హామీలు సరికొత్తగా తెరపైకి వస్తున్నాయి. కానీ, వేపాడ మండల రైతాంగ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. తమ కళ్ల ముందే కాలువ ద్వారా విశాఖ మహానగరానికి కోట్ల లీటర్ల నీరు తరలిపోతున్నా, ఆ కాలువ కోసం భూములిచ్చిన స్థానిక రైతులు మాత్రం నేటికీ గుక్కెడు తాగు నీరు, సాగునీరు లేక అల్లాడుతున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ అన్యాయంపై వేపాడ మండల రైతులు... ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1981-82 కాలంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో వేపాడ మండలానికి సమీపంలో ఉన్న దేవరాపల్లి మండలం వద్ద రైవాడ జలాశయం ప్రాజెక్టు నిర్మాణానికి పునాది పడింది. 2.350 టిఎంసిల నీటి సామర్థ్యంతో అప్పట్లోనే రూ.42.43 కోట్ల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం విశాఖ నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడమే అయినప్పటికీ, నిర్మాణ సమయంలో స్థానిక రైతులను ఒప్పించడానికి అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక హామీ ఇచ్చారు. వేపాడ మండల రైతాంగానికి కచ్చితంగా సాగునీరు, తాగునీరు అందేలా చూస్తామని నమ్మబలికారు. ఆ నమ్మకంతోనే వేపాడ మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు తమ జీవనాధారమైన జిరాయితీ భూములను కాలువ నిర్మాణం కోసం త్యాగం చేశారు. కడకొండ, వావిలపాడు, నల్లబెల్లి, చినగుడిపాల, జమ్మాదేవిపేట, నీలకంఠరాజపురం అగ్రహారం, బల్లంకి, బిటికె రాజపురం అగ్రహారం, కృష్ణరాయుడుపేట, అంకజోష్యులపాలెం గ్రామాల గుండానే రైవాడ జలాశయ కాలువను ఏర్పాటు చేసి విశాఖపట్నానికి నీటిని తరలిస్తున్నారు. కానీ, భూములిచ్చిన ఈ పది గ్రామాల రైతులకు మాత్రం దక్కింది శూన్యం. ఎన్నికల రాజకీయం.. ఎన్నాళ్లీ మోసాలు? ప్రాజెక్టు ప్రారంభమై దశాబ్దాలు గడుస్తున్నా పాలకుల వైఖరిలో మార్పు రాలేదు. ప్రతి ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చే ప్రజాప్రతినిధులు 'ఈసారి మమ్మల్ని గెలిపించండి, వేపాడ మండలానికి రైవాడ నీరు అందిస్తాం' అంటూ నమ్మబలికి ఓట్లు వేయించుకోవడం, గెలిచాక ఆ మాట మరచిపోవడం నిత్యకృత్యమైంది. ఇచ్చిన గడువులు ముగిసిపోవడంతో మండల ప్రజలు, రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ కళ్ల ముందే కాలువలో నీరు ప్రవహిస్తున్నా, చేను ఎండిపోతుంటే చూసి తట్టుకోలేక వేపాడ మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాగ్రహానికి గురికాకముందే, ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం వేపాడ మండల ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం రైవాడ ప్రాజెక్టు నుంచి నీటిని కేటాయించాలని కోరుతున్నారు. రైవాడ నీరు వేపాడ మండలానికి అందిస్తే వలసల నివారణతో పాటు ఉన్న భూములను సాగు చేసుకుని సంవత్సరానికి రెండు పంటలు పండించే అవకాశం ఉంటుందని రైతులు చెపుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్