లాసా : చైనాలోని టిబెట్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 16మంది మరణించగా, శుక్రవారం ఉదయం నాటికి గాయపడిన వారి సంఖ్య65కి చేరినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 11మంది పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.గురువారం రాత్రి 10.33 గంటల సమయంలో భూమికంపించిందని, రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0గా నమోదైనట్లు చైనా మీడియా జిన్హువా పేర్కొంది. నాగ్చు నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో సుమారు 190 కిలోమీటర్ల దూరంలో, రాజధాని లాసాకు ఈశాన్యంగా 390 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది. భూకంప కేంద్రం బాక్వెన్ కౌంటీలోని మారు టౌన్‌షిప్‌లో ఉందని, టౌన్‌షిప్‌లో భూకంప తీవ్రత స్పష్టంగా తెలిసిందని మీడియా తెలిపింది. అక్కడ గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయని వెల్లడించింది. భూకంపం ధాటికి సుమారు 339 ఇళ్లు కూలిపోయాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ ప్రాంతంలో 'లెవల్-2' స్థాయి అత్యవసర విపత్తు ప్రతిస్పందన చర్యలను ప్రారంభించినట్లు తెలిపింది.
శుక్రవారం ఉదయం నాటికి, భూకంప ప్రభావిత ప్రాంతానికి వివిధ స్థాయిల్లోని అధికారులు కేటాయించిన సహాయక సామగ్రి చేరుకోవడం ప్రారంభమైంది. వీటిలో 1,000 ప్రీఫ్యాబ్రికేటెడ్ గృహాలు (ముందుగానే తయారు చేసిన ఇళ్లు), 3,200కు పైగా టెంట్లు, 2,800కు పైగా మడత మంచాలు, అలాగే దుప్పట్లు, స్టౌలు, దుస్తులు వంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయి.
భూకంపం కారణంగా గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు, సహాయక చర్యలు చేపట్టాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశించారు. గాయపడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించాలని హెచ్చరించారు. ప్రాణనష్టాన్ని వీలైనంతగా తగ్గించేందుకు అన్ని విధాలా కృషి చేయాలని ఆయన తన ఆదేశాల్లో పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)