శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉపాధి లేకే వలసలు

19 గంటల క్రితం

ఉపాధి లేకే వలసలు
ఈశాన్యం నుండి దక్షిణ భారతానికే అధికం
పనుల్లేక వెళ్తున్నామన్న 90 శాతమంది యువత image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 04:27 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఈశాన్యం నుండి దక్షిణ భారతానికే అధికం

  • పనుల్లేక వెళ్తున్నామన్న 90 శాతమంది యువత

గౌహతి : ఎటువంటి ఉపాధి లభించకపోవడంతో దేశవ్యాప్తంగా వలసలు పెరిగిపోతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడి నుండి దక్షిణ భారతదేశానికి జరుగుతున్న వలసలు వ్యక్తిగత ఎంపికల కంటే కూడా తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల వల్లనే జరుగుతున్నాయని ఒక సర్వేలో వెల్లడైంది. మూడు ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, త్రిపురల్లో ఎనిమిది జిల్లాల్లోని 14 అడ్మినిస్ట్రేటివ్‌ ‌బ్లాక్‌‌ల వ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో ఉద్యోగాలు, ఉపాధి కోసం ప్రతి జిల్లాకు తమదైన సొంత వలస కారిడార్‌ ‌వుందని ఈ సర్వేలో వెల్లడైంది. కర్ణాటకకు వలస వెళ్లే ముగ్గురిలో ఇద్దరు త్రిపురలోని ధలాయ్‌ ‌జిల్లా నుండే వెళుతున్నారు. అస్సాంలోని నాగోవ్‌ ‌జిల్లా వాసులది హైదరాబాద్‌ ‌రూట్‌. ఇక మేఘాలయలోని ఉత్తర గరో హిల్స్‌‌కి చెందినవారు తమిళనాడు వలస పోతుంటారు. ఈశాన్య రాష్ట్రాల పరిధిలో అస్సాంలోని గౌహతి, మేఘాలయలోని షిల్లాంగ్‌‌ల నుండే ఎక్కువ మంది వలస కార్మికులు వుంటారు. గౌహతి ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఎన్‌‌జిఓ సెవెన్‌ ‌సిస్టర్స్‌ ‌డెవలప్‌‌మెంట్‌ అసిస్టెన్స్‌ ఈ మూడు రాష్ట్రాల్లో 693 కుటుంబాలను సర్వే చేసింది. ఆర్థిక ఇబ్బందులే ప్రధానంగా ఈ వలసలను శాసిస్తున్నాయనేది స్పష్టమైంది. తాము వున్న చోట తగినంత సాగు భూమి లేదని, అప్పులు పెరిగిపోయాయంటూ దాదాపు 91శాతం మంది కారణాలు చెప్పారు. స్థానికంగా సరైన ఉపాధి దొరకడం లేదంటూ 88శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు.

వీరందరికీ ప్రధాన గమ్యస్థానాలు కర్ణాటక (22.7శాతం), అస్సాం (22.3శాతం), తమిళనాడు (13.8శాతం)లే. వలస వెళ్లే వారిలో చాలామంది యువతే. 30ఏళ్లలోపు వారే. వీరిలో మహిళల వాటా 12శాతంగా వుంది. పైగా వీరి నెలసరి ఆదాయం కూడా కేవలం రూ.15 వేలే. 86శాతం మంది నెలకు రూ.20వేలు అంతకంటే తక్కువే సంపాదిస్తున్నారు. తమ తమ గ్రామాల్లోనే సరైన జీవనోపాధి అవకాశాలు దొరికితే ఎక్కడకూ వలసలు వెళ్ళబోమని ఇక్కడే వుంటామని దాదాపు 88శాతం కుటుంబాలు చెబుతున్నాయి. రిక్రూట్‌మెంట్‌ ‌చానళ్ళ ద్వారా కాకుండా వీళ్ళందరూ కూడా బంధువులు, స్నేహితుల ద్వారానే ఈ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. వీరిలో 53శాతం మంది సుదీర్ఘ పనిగంటలు శ్రమ పడాల్సి వస్తోంది. ఇంత చేసినా వీరికి ఏమీ మిగలదు. ఇళ్లకు పంపాల్సింది పంపిన తర్వాత ఇక వీరివద్ద పైసా వుండదు. వలస వెళ్ళడం అనేది అవసరంగా కన్నా ఎంపికగా వుండాలి అంటే ముందుగా స్థానిక ఉపాధి కల్పన బలంగా వుండాలని, పారిశ్రామికంగా కూడా మంచి అవకాశాలు కల్పించేలా వుండాలని ఈ అధ్యయనం పేర్కొంటోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్