శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition అమ్మకానికి మరిన్ని పిఎస్‌‌యుల ఆస్తులు..!

1 రోజు క్రితం

అమ్మకానికి మరిన్ని పిఎస్‌‌యుల ఆస్తులు..!
 - రూ.15 వేల కోట్ల నగదీకరణ లక్ష్యం 
- ఇప్పటికే రూ.9 వేల కోట్ల ఆస్తుల విక్రయం
- జాబితాలో బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటిఎన్‌ఎల్‌ అసెట్స్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 01:28 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రూ.15 వేల కోట్ల నగదీకరణ లక్ష్యం

  • ఇప్పటికే రూ.9 వేల కోట్ల ఆస్తుల విక్రయం

  • జాబితాలో బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటిఎన్‌ఎల్‌ అసెట్స్‌

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (‌సిపిఎస్‌ఇ) ఆస్తుల విక్రయాన్ని మోడీ ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోంది. నిరుపయోగం పేరుతో అనేక విలువైన భూములను చౌకగా ప్రయివేటు శక్తులకు దారాదత్తం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో ఇప్పటి వరకు రూ.9 వేలకోట్లకు పైగా విలువైన ఆస్తులను అమ్మకం చేయగా.. మరో రూ.6 వేల కోట్ల ఆస్తులను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నేషనల్‌ ల్యాండ్‌ మోనెటైజేషన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్‌ఎంసి) సిఇఒ రోహన్‌ చాంద్‌ ఠాకూర్‌ వెల్లడించారు. దీంతో ఈ ఏడాదిలో ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల నగదీకరణ లక్ష్యం రూ.15 వేలకోట్లకు చేరనుందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటిఎన్‌ఎల్‌, ఐటిఐ, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) వంటి సంస్థలకు చెందిన ఆస్తులనూ విక్రయాల ప్రక్రియలోకి తీసుకురానున్నట్లు చాంద్‌ ‌ఠాకూర్‌ తెలిపారు. ​న్యూఢిల్లీలో హెచ్‌ఐఎల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన 5.119 ఎకరాల భూమి ఇ-వేలం ముందస్తు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల వద్ద నిరుపయోగంగా ఉన్న లేదా పూర్తిస్థాయిలో వినియోగంలో లేని భూములు, భవనాలను గుర్తించి, పోటీ విధానంలో నగదీకరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నజఫ్‌గఢ్‌ పారిశ్రామిక ప్రాంతంలో హెచ్‌ఐఎల్‌ సంస్థకు చెందిన 5.119 ఎకరాల భూమికి రూ.829.69 కోట్లను రిజర్వ్‌ ధరగా నిర్ణయించినట్లు ఠాకూర్‌ వెల్లడించారు. కీలక ప్రాంతంలో ఉన్న ఈ భూమికి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భూముల విక్రయాలకే పరిమితం కాకుండా వివిధ నగరాల్లో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఫ్లాట్లను కూడా ఎన్‌ఎల్‌ఎంసి నగదీకరిస్తోందని తెలిపారు.

​ రాబోయే రోజుల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటిఎన్‌ఎల్‌, ఐటిఐ లిమిటెడ్‌, ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఆస్తులు నగదీకరణకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వీటికి సంబంధించి విలువ నిర్ధారణ, ఇతర ప్రాథమిక ప్రక్రియలు ఇప్పటికే పూర్తయ్యాయని వెల్లడించారు. టెలికాం, ఉక్కు, రసాయనాలు, పెట్రోకెమికల్స్‌ రంగాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ శాఖలతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల అదనపు ఆస్తులను గుర్తించి.. వాటి విక్రయ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ ఆధ్వర్యాన ఎన్‌ఎల్‌ఎంసి పనిచేస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్