టన్నుకు రూ.23,777 చొప్పున కొనుగోలు
వంటనూనెల దిగుమతులపై సుంకం తగ్గితే రైతుల్లో ఆందోళన
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో ధరలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయిల్ ఫామ్ రైతులకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లభిస్తుండటంతో రెండేళ్ల తర్వాత లాభాల బాట పట్టారు. తాజా పండ్ల గుత్తి టన్నుకు రూ.23,777 ధర లభిస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతేడాది ఎకరాకు సుమారు రూ.60 వేలు ఆదాయం వచ్చిన పరిస్థితి నుంచి నేడు రూ.90వేల వరకూ ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ వాణిజ్య విధానాలు, దిగుమతి సుంకాలపై తీసుకునే నిర్ణయాలు ఈ ఆశలు నిలకడగా ఉంటాయా? లేదా? అనే అంశాన్ని నిర్ణయించే కీలక కారణాలుగా మారాయి.
ఆయిల్ పామ్ ధర నిర్ణయంలో ఆయిల్ రికవరీ కీలక పాత్ర పోషిస్తోంది. గెలల నుంచి ఎంత శాతం నూనె వస్తుందనే అంశాన్ని ఆధారంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా ధరను ప్రకటిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఫామ్ ఆయిల్ ధరలు, దేశీయ డిమాండ్, ఆయిల్ రికవరీ శాతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరను ఖరారు చేస్తారు. ప్రస్తుతం రికవరీ శాతం మెరుగ్గా ఉండటంతో ధరలు కూడా ఆశించిన స్థాయిలో ఉన్నాయి.
కాకినాడ జిల్లాలో ప్రస్తుతం 22 మండలాల్లో కలిపి 71,527 ఎకరాల్లో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ధరలను పరిశీలిస్తే జనవరిలో టన్నుకు రూ.19,218, ఫిబ్రవరిలో రూ.20,680 , మార్చిలో రూ.21,546, ఏప్రిల్‌లో రూ.22,936, మేలో రూ.23,656, జూన్ లో రూ.23,777 పలికింది. ఆరు నెలల వ్యవధిలోనే టన్నుపై రూ.4,500కు పైగా పెరిగింది. ధరలు ఆశాజనకంగా ఉండడంతో 2026–27 సంవత్సరానికి అదనంగా 4,800 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరించాలనే లక్ష్యాన్ని అధికారులు నిర్దేశించారు. ఇప్పటికే నల్లజర్ల మండలంలో రెండు వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టారు. దీర్ఘకాలిక ఆదాయం, మార్కెట్ భరోసా, కంపెనీల కొనుగోలు వ్యవస్థ వంటి అంశాలు నూతన రైతులను ఈ పంట వైపు ఆకర్షిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వంటనూనెల దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సుంకాలు తగ్గితే విదేశీ ఫామ్ ఆయిల్ మరింత చౌకగా దేశీయ మార్కెట్‌కు చేరే అవకాశం ఉందని, దీంతో దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్ ఫామ్ గెలల ధరలపై పడే ప్రమాదం ఉందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దిగుమతి చేసుకునే నూనె ధరలు తగ్గితే దేశీయ కంపెనీలు రైతుల నుంచి కొనుగోలు చేసే ధరలను తగ్గించే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లభిస్తున్న గిట్టుబాటు ధరలు ఒక్కసారిగా తగ్గిపోతే కొత్తగా పంట సాగు చేసిన రైతుల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంంది. ఒకవైపు దేశంలో వంటనూనెల స్వయం సమృద్ధి లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుండగా, మరోవైపు దిగుమతి సుంకాల్లో భారీ తగ్గింపు చేస్తే ఆ లక్ష్యానికే విఘాతం కలిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దిగుమతి సుంకాలు తగ్గితే ప్రమాదం
ప్రస్తుతం ఆయిల్‌పామ్ ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఇతర పంటలతో పోల్చితే ప్రభుత్వం నుంచి కొంత సహాయం లభిస్తుంది. భవిష్యత్తులో వంటనూనెలపై దిగుమతి సుంకాలు తగ్గించినట్లయితే రైతుల పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉంది. పాలనా యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రైతులకు లాభాలు వచ్చే పంటలనే ప్రోత్సహించాలి.
- పివి.నారాయణ, 20 ఎకరాల పామాయిల్ రైతు, నల్లజర్ల మండలం








కామెంట్‌లు (0)