చక్రం తిప్పుతున్న కీలక నేతలు
15 శాతం పలుకుతున్న మామూళ్లు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర ఆర్థిక శాఖలో పెండింగ్ బిల్లులు వసూలు చేసుకోవాలంటే ఇన్నాళ్లు అధికారుల చుట్టూ సచివాలయంలో తిరిగేవారు. ఎంతోకొంత సమర్పించుకుని తమ బిల్లులు పరిష్కారమయ్యేలా చూసుకునేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. బిల్లులు పరిష్కారం కావాలంటే సచివాలయంలో కన్నా కూడా హైదరాబాద్ వెళ్తే ఈ బిల్లులు పరిష్కారం అవుతాయని సచివాలయంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. కొంతమంది కీలక వ్యక్తులు హైదరాబాదును బిల్లుల కోసం తమ అడ్డాగా మార్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కీలక వ్యక్తులు అమరావతిలోనే ఉన్నప్పటికీ హైదరాబాదులో ఏర్పాటుచేసిన ఒక ప్రత్యేక కౌంటర్లో సంప్రదిస్తే ఇక్కడ బిల్లులు పరిష్కారం అయిపోతుంది అని అంటున్నారు.
గతంలో ఐదు నుంచి 8 శాతం వరకు చెల్లిస్తే ఆ బిల్లులు ఇక్కడే పరిష్కారం అయ్యేవి. ఆ తర్వాత కాలంలో ఆ శాతం 10 దాటింది. ఇటీవల కాలంలో బిల్లు మొత్తం 13 నుంచి 15% వరకు చెల్లిస్తే పరిష్కారం పరిస్థితిలు నెలకొన్నాయి. ఇది కూడా చాలా కష్టంగా మారడంతో ఇక హైదరాబాద్కు వెళ్లి అక్కడ కౌంటర్లో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోందని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రానికి చెందిన మంత్రిగా ఉన్న ఒక కీలక నేత తను మనుషులను హైదరాబాదులో ఏర్పాటు చేసుకుని ఈ తతంగం నిర్వహిస్తున్నట్లు ఒక కాంట్రాక్టర్ వెల్లడించారు. అక్కడికి వెళ్లి మాట్లాడుకున్న తర్వాత అక్కడ నుంచి అమరావతికి 'ఎస్' అన్న సంకేతం వస్తే ఇక్కడ బిల్లులు పరిస్కారం అయిపోతున్నాయని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో కొంతమంది మంత్రులు తమ తమ మనుషులను ఆయా శాఖలో పనుల కోసం నియమించుకోగా తాజాగా గత ఏడాదికాలంగా ఆర్థిక శాఖలో కూడా అదే పరిస్థితి నెలకొందని విమర్శలు వస్తున్నాయి.
ఇలా హైదరాబాద్ అడ్డగా చేసుకున్న వారిలో అత్యంత కీలకమైన మూడు శాఖలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర జిల్లాల నుంచి తమ పనుల కోసం అమరావతికి రావడం కన్నా నేరుగా హైదరాబాద్ కు వెళ్లిపోయి అక్కడే మంతనాలు చేసుకుంటే తమ పనులు, బిల్లుల సమస్య సులభంగా పరిష్కారం అయిపోతోందని చాలామంది చెప్తున్నారు. ప్రధానంగా 50 నుంచి 100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ ప్రయోజనకరంగా ఉంటుందని 10 నుంచి 15 శాతం డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా త్వరగా పని అయిపోతుందని వారు చెప్తున్నారు.
ముఖ్యమంత్రి హెచ్చరికలు
ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి కూడా గతంలో వచ్చినట్లు సమాచారం. దీనిపై ఆర్థిక శాఖలో కీలకంగా ఉండే ఇద్దరినీ పిలిపించి ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ ఈ విధానంలో మార్పు లేదని ఆరోపణలు వస్తున్నాయి. విశేషమేంటంటే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు నేతలు కాంట్రాక్టర్లు కన్నా ప్రతిపక్ష పార్టీకి చెందిన వారికి కూడా బిల్లలు చెల్లింపుల్లో పెద్దపీట వేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇది కూడా సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఇటువంటి విధానాలు మానుకోవాలని ఆర్థిక శాఖలోని ఆ ఇద్దరికి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.








కామెంట్‌లు (0)