ఇప్పటికి 750 బస్సులు రావాల్సివుండగా వచ్చినవి 20 మాత్రమే..
లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్న ఆర్‌టిసి యాజమాన్యం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విద్యుత్ బస్సుల సాకుతో ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్న వేళ... కాంట్రాక్టు పొందిన ప్రైవేటు సంస్థ ‘పినాకిల్’ అమలులో తీవ్ర జాప్యం చేస్తోంది. ఒప్పందం ప్రకారం 750 ఇ-బస్సుల సరఫరా కావాల్సివుండగా 20 మాత్రమే వచ్చాయి. డిపోల్లో వసతుల కల్పననూ ఆ సంస్థ పూర్తిగా పక్కనపెట్టింది. దీనిపై చర్యలకు దిగాల్సిన ఆర్‌టిసి యాజమాన్యం మాత్రం కేవలం లేఖలు రాస్తూ కాలయాపన చేస్తోంది. ఎపిఎస్‌ఆర్‌టిసిలో ప్రైవేటు విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. సంస్థ మాత్రం అడుగు ముందుకేస్తోంది. తాము నిర్దేశించిన డిపోల్లో రూట్ సర్వే కోసం ప్రైవేటు ఏజెన్సీ తమ సిబ్బందిని నియమించాలని కోరింది. వారి ఆధ్వర్యంలోనే రూట్ ఉమ్మడి సర్వే చేయాల్సి ఉందని పేర్కొంది. ఆర్‌టిసి ప్రైవేటీకరణ, విద్యుత్ బస్సుల నిర్వహణపై ప్రభుత్వం చాపకింద నీరులా వ్యవహారం నడుపుతోంది. సెప్టెంబరు 11వ తేదీన, 18, 28వ తేదీల్లో వరుసగా రాసిన మూడు లేఖలతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. అందులో సంస్థ నిర్దేశించిన సమయానికి బస్సులు ఇవ్వలేదని, కేటాయించిన డిపోల్లో సదుపాయాలు కూడా కల్పించలేదని పేర్కొంది. ప్రభుత్వం కార్యాచరణకు ఇది అడ్డంకిగా మారిందని, వీలైనంత త్వరగా బస్సులు పంపించడంతోపాటు డిపోల్లో ప్రతినిధిని నియమించాలని కోరింది.
ఆర్‌టిసిలో ప్రైవేటు ఇ-బస్సుల ప్రవేశంపై ఇప్పటికే ఆర్‌టిసి కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒప్పందాన్ని ఉల్లంఘించిన ‘పినాకిల్’ సంస్థపై కఠిన చర్యలు తీసుకోకుండా, యాజమాన్యం లేఖలతో కాలయాపన చేయడం వెనుక ప్రైవేటీకరణ కుట్ర దాగి ఉందని ఆగ్రహిస్తున్నాయి. తక్షణమే ఆ సంస్థ కాంట్రాక్టును రద్దు చేసి, ప్రభుత్వమే సొంతంగా విద్యుత్ బస్సులను కొనుగోలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పిఎం ఇ-బస్ సేవా పథకం కింద 750 బస్సులు ఇస్తామని చెప్పి 20 మాత్రమే ఇచ్చారని, మిగిలిన 730 బస్సులు ఇవ్వలేదని బస్సుల సరఫరాదారు అయిన వృట్టి జిసిఎం మొబిలిటీస్ (పినాకిల్ మొబిలిటీస్‌కు సబ్ కాంట్రాక్టు)కు లేఖ ద్వారా ఎపిఎస్‌ఆర్‌టిసి తెలిపింది. అక్టోబరు నెలాఖరు నాటికి బస్సులన్నీ సరఫరా చేయాలని, గోదావరి పుష్కరాల సమయానికి పూర్తిస్థాయిలో నిర్వహించాలని వాటిల్లో పేర్కొంది. పిఎం ఇ-బస్ సేవా పథకం కింద 11 నగరాల్లో 12 డిపోల పరిధిలో 750 బస్సులకు 2025 మార్చి 19వ తేదీన అగ్రిమెంటు చేసుకున్నామని తెలిపింది. దీనిపై డిపో మేనేజర్లతోనూ ఒప్పందాలు చేసుకున్నారు. మొదటిదశలో 300 బస్సులను ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటే 20 బస్సులే ఇచ్చారని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబరు నెలాఖరుకు బస్సులు పూర్తిస్థాయిలో అందజేయాలని, నవంబరు 30వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇప్పటికే ఆలస్యం అయినందున ఈ నెలాఖరు నాటికి డిపోల్లో అన్ని పనులూ పూర్తి చేయాలని కోరింది. 12 డిపోల్లో ఇ-బస్సుల ఛార్జింగ్ కోసం ఛార్జర్ల ఏర్పాటు, డ్రైవర్లు, నిర్వహణ, పర్యవేక్షణ సిబ్బంది నియామకం, శిక్షణ వంటి ఇతర ఏర్పాట్లను కూడా నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని కోరారు. బస్సులు తిరిగే అన్ని రూట్లలో ఆర్‌టిసి, వృట్టి మొబిలిటీ సంస్థలు ఉమ్మడిగా రూట్ సర్వే నిర్వహించాల్సి ఉందని, దీనికోసం డిపోలవారీ ఇన్‌ఛార్జులను నియమించా లని, వారి వివరాలను తెలపాలని ఆర్‌టిసి కోరింది. సంస్థ కూడా ఉమ్మడి సర్వేకు సిద్ధంగా ఉండాలని లేఖలో ఆయా జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను కోరింది.








కామెంట్‌లు (0)