- కేంద్ర సాయం 11.74 శాతమే
- భారీగా పెరుగుతున్న ఆదాయ, ద్రవ్య లోటు
- ఆగస్టు నెల కాగ్ గణాంకాలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆగస్టు నెలలోనూ రాష్ట్ర ఖజానా కష్టాల్లోనే కొట్టుమిట్టాడుతోంది ఆదాయ లోటు, ద్రవ్యలోటు గణనీయంగా పెరిగిపోవడంతో పాటు కేంద్రం నుంచి రావలసిన నిధులు కూడా అతి తక్కువగా రావడంతో ఆ ప్రభావం ఖజానాపై పడుతోంది. అందుకే అంచనాలకు మించి భారీగా అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఆదాయాలు, వ్యయాల మధ్య భారీ అంతరం కొనసాగుతున్నట్లు తాజాగా కాగ్ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం రెవెన్యూ రాబడులు రూ.1,90,207.94 కోట్లుగా ఉండగా, ఇప్పటివరకు రూ.66,037.94 కోట్లు మాత్రమే సమకూరాయి. మరోవైపు రెవెన్యూ వ్యయం రూ.1,04,342.66 కోట్లుగా తేల్చారు.
వివిధ పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో భారీగా కోట పడింది. ఏడాది మొత్తానికి రూ.32,458 కోట్లు కావాల్సి ఉండగా 11.74 శాతంతో కేవలం రు. 3,810 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది కూడా ఆర్థిక ఇబ్బందికి కారణంగా అధికారులు చెబుతున్నారు. వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే వస్తు సేవల పన్ను ద్వారా రూ.62,681.23 కోట్లు అంచనా వేయగా, 23,645.50 కోట్లు వచ్చాయి. సేల్స్ ట్యాక్స్ ద్వారా రూ. 24,125.67 కోట్లకు గాను 8,739.96 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా రూ. 30,066.66 కోట్లకు గాను రూ.8,423.40 కోట్లు సమకూరాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ. 46,759.15 కోట్ల అంచనాకు గాను ఆగస్ట్ వరకు రూ.17,352.63 కోట్లు లభించాయి.
భారీగా రుణం
ఆదాయం తగ్గిపోవడంతో రుణాలపైనే ఆధారపడాల్సివస్తోంది. ఏడాది మొత్తానికి రూ.75,917.88 కోట్ల వరకు అప్పు తీసుకోవాలని ప్రతిపాదించగా తొలి ఐదు నెలల్లోనే ఏకంగా రూ.53,089.29 కోట్లు సమీకరించారు. రాష్ట్ర మొత్తం ఆదాయం రూ.3,10,058 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పటివరకు రూ. 1,25,877 కోట్ల మేర సమకూరాయి. ఇదే సమయంలో మొత్తం వ్యయం రూ.3,04,840 కోట్లుగా అంచనా వేయగా 1,23,439 కోట్లు ఖర్చు చేశారు. మూలధన వ్యయం మొత్తం రూ.48,698 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పటివరకు రూ. 13,719 కోట్లు ఖర్చు చేశారు. సామాజిక రంగానికి రు. 1,42,556 కోట్లు అంచనా వేయగా, ఇప్పటివరకు రూ.57,438.77 కోట్లు ఖర్చయ్యాయి.
రూ.36,932 కోట్ల రెవెన్యూ లోటు
తాజా గణాంకాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 36,933 కోట్లుగా నమోదైంది. మొత్తం రాబడులతో పోలిస్తే రెవెన్యూ వ్యయం అధికంగా ఉండటం వల్ల ఈ లోటు ఏర్పడింది. ద్రవ్య లోటు కూడా గణనీయంగా ఉంది. రుణాలు, ఇతర బాధ్యతలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ద్రవ్య లోటు రూ. 52,849 కోట్లుగా నమోదైంది.








కామెంట్‌లు (0)