గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘కొల్లేరు’పై నివేదికలే... చర్యలు నిల్‌!

17 గంటల క్రితం

‘కొల్లేరు’పై నివేదికలే... చర్యలు నిల్‌!
-రెండున్నరేళ్లు గడిచినా ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి
-కేంద్ర సాధికారిక కమిటీకి నివేదికలు సమర్పించడంలోనే కాలయాపన
-పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి చర్చ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 03:57 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రెండున్నరేళ్లు గడిచినా ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి

  • కేంద్ర సాధికారిక కమిటీకి నివేదికలు సమర్పించడంలోనే కాలయాపన

  • పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి చర్చ

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : కొల్లేరు సమస్యపై ప్రభుత్వం నివేదికలతోనే సరిపెడుతోందని, చర్యలు మాత్రం లేకుండా పోయాయన్న చర్చ స్థానిక ప్రజల్లో విస్తృతంగా సాగుతోంది. తాము అధికారంలోకి వస్తే కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామంటూ ఇచ్చిన హామీ అమలు టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో మరోసారి చర్చ మొదలైంది. కొల్లేరును మూడవ కాంటూరుకు కుదించాలన్న డిమాండ్‌‌పై మౌనం వహించడంతోపాటు, జిరాయితీ, సొసైటీలకు చెందిన 22 వేల ఎకరాలను మినహాయించి రైతులకు అప్పగిస్తామన్న హామీ సైతం మాటలకే పరిమితమైంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని తొమ్మిది మండలాల్లో 77 వేల ఎకరాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. దీనిని ఆనుకుని బెడ్‌, బెల్ట్‌ ‌గ్రామాలు 120 వరకూ ఉన్నాయి. దాదాపు మూడు లక్షల జనాభా నివసిస్తున్నారు. 2006లో ఆపరేషన్‌ ‌కొల్లేరు పేరుతో అప్పటి ప్రభుత్వం కొల్లేరులోని రైతుల చేపల చెరువులన్నింటినీ బాంబులు పెట్టి మరీ ధ్వంసం చేసింది. కొల్లేరు సరిహద్దులు నిర్ణయించకుండా అడ్డగోలుగా జిరాయితీ భూములు, ప్రభుత్వం ఇచ్చిన సొసైటీ భూముల్లోని చెరువులను సైతం నేలమట్టం చేసింది. కొల్లేరు గ్రామాల్లో అత్యధికంగా ఉన్న బిసి, ఎస్‌‌సి జనాభా రోడ్డున పడ్డారు. ఉపాధిలేక కేరళ, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు వలసపోయి బతుకు నెట్టుకొస్తున్నారు. కొల్లేరును మూడవ కాంటూరుకు కుదించి తమకు న్యాయం చేయాలని 20 ఏళ్లుగా అక్కడి ప్రజలు కోరుతున్నారు. 2014లో ఎన్నికల్లో అప్పటి ప్రధాని అభ్యర్థిగా మోడీ... భీమవరం సభలో మాట్లాడుతూ కొల్లేరును మూడవ కాంటూరుకు కుదించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో 13 ఏళ్లుగా ఆయనే ప్రధానిగా ఉంటున్నా కొల్లేరు ప్రజలకు మాత్రం న్యాయం జరగలేదు.

కొల్లేరు ప్రజల్లో ఆశలు నింపి వంచిస్తున్న టిడిపి కూటమి

కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామని 2024 ఎన్నికల్లో టిడిపి కూటమి నేతలు హామీ ఇచ్చారు. గత ఏడాది జూన్‌ 17, 18 తేదీల్లో కొల్లేరు ప్రాంతంలో కొల్లేరు సాధికారిక కమిటీ పర్యటించింది. కొల్లేరు ప్రజలతో పాటు, రాజకీయ పార్టీలు కొల్లేరు ప్రజల సమస్యను కమిటీకి వివరించడంతోపాటు, వినతులు సైతం అందించారు. కొల్లేరు సమస్య పరిష్కారమైనట్లేనంటూ టిడిపి కూటమి ఎంఎల్‌ఎలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జిరాయితీ, సొసైటీకి చెందిన 22 వేల ఎకరాలను కొల్లేరు ప్రజలకు తిరిగి ఇవ్వనున్నట్లు అక్కడి ప్రజల్లో ఆశలు నింపారు. ఏడాది దాటినా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా కేంద్ర సాధికారిక కమిటీ ఇటీవల స్పందించిన తీరు కొల్లేరు ప్రజల్లో మరింత ఆందోళన రేపుతోంది. అక్రమ చెరువుల ధ్వంసానికి జిల్లా అధికారులకు అటవీ శాఖకు సహకరించాలని సాధికారిక కమిటీ పేర్కొనడం వివాదాస్పదమైంది. నెలకు, రెండు నెలలకొకమారు రాష్ట్ర అధికారులు జిల్లాకు రావడం, కొల్లేరుకు సంబంధించి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతోనే సరిపెడుతున్నారు. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. టిడిపి కూటమి ప్రభుత్వం కొల్లేరు సమస్యను పరిష్కరిస్తుందనే నమ్మకం ఇక్కడి ప్రజల్లో సన్నగిల్లుతోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్