సుపర్ మార్కెట్లో బియ్యం కిలో రూ.120
సర్కారు లెక్కల ప్రకారం రూ. 84
తగ్గింపు ధరలంటూ నాసిరకం విక్రయాలు
సన్నబియ్యంగా మారుతున్న రేషన్ బియ్యం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్టంలో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కిలో బియ్యం ధర వంద రూపాయలు దాటిపోయింది. గత సెప్టెంబర్‌లో అధికారికంగా 68 రూపాయలుగా ఉన్న కిలో బియ్యం ఇప్పుడు రు.84కు చేరిపోయింది. అదే బహిరంగ మార్కెట్ లో అయితే వంద దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్ నినో పేరుచెప్పి టన్నుల కొద్దీ బియ్యాన్ని బడా వ్యాపారులు నల్ల బజారుకు తరలించడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తుతోందని చిన్న వ్యాపారాలు గగ్గోలు పెడుతున్నారు. ఇక సూపర్ మార్కెట్లలో బియ్యం ధర అందుకోలేనంతగా మారింది. గత ఆగస్టు వరకు కొంత అదుపులోనే ఉన్న బియ్యం ధరలలో సెప్టెంబర్ నుంచి భారీ పెరుగుదల నమోదవుతోంది. అక్టోబర్ నెలలో మరితంగా పెరిగాయి. ఆగస్టు తో పోలిస్తే సూపర్ ఫైన్, ఫైన్, సాధారణ రకం బియ్యం ధరలు 20 నుంచి 25 శాతం వరకు పెరిగాయి. బహిరంగ మార్కెట్లో అయితే 25 నుంచి 30 శాతానికిపైగా పెరిగిపోయాయి.
రాష్ట్ర సగటు ధరల ప్రకారం కిలో సూపర్ ఫైన్ బియ్యం ధర ఆగస్టులో రూ.65.95 ఉండగా, సెప్టెంబర్‌లో రూ.68.38కు చేరింది. దీంతో నెలవారీగా 3.68 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాది రూ.59.85గా ఉన్న ఈ ధర ప్రస్తుతం 15 శాతం అధికమైంది.అదేవిధంగా కిలో ఫైన్ రకం బియ్యం ధర ఆగస్టులో 58.65 రూపాయలుగా ఉండగా, సెప్టెంబర్‌లో రూ.60.80కు, అక్టోబర్లో 74 రూపాయలకు పెరిగింది. సాధారణ రకం బియ్యం ధర కూడా గణనీయంగా పెరిగింది. ఆగస్టులో కిలో రూ.47.89గా ఉన్న ధర సెప్టెంబర్‌లో రూ.49.83కు, అక్టోబర్లో 56 రూపాయలకు చేరుకోగా ఇప్పుడు 60 దాటిపోయింది.
మాల్ లో గోల్ మాల్
ధరల పెరుగుదలను ఆసరాగా తీసుకుని అనేక మాల్స్, సూపర్ మార్కెట్లలో ధరలకు బాగా పెంచేస్తున్నారు. కొన్ని చోట్ల కిలో వంద నుంచి 150రూపాయలకు కూడా విక్రయిస్తున్నారు. సేంద్రీయ బియ్యం పేరిట కూడా భారీ ధరలతో విక్రయాలు చేస్తున్నారు.
మార్కెట్ లోకి కల్తీ బియ్యం
ధరల పెంపుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు.
పేదలకు సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని అతి తక్కువ ధరకు రు. 15 నుంచి 20రూపాయలకు కొనుగోలు చేస్తూ వాటిని మిల్లుల్లో పాలిష్ చేసి తెల్లగా మెరిసేలా చేస్తున్నారని,ఆ బియ్యాన్నే 40 నుంచి 50రూపాయలకు బయట మార్కెట్లో విక్రయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో దొడ్డు బియ్యాన్ని కూడా ఇందులో కలుపుతున్నారని తెలుస్తోంది. ఇదే బియ్యాన్ని కొంతమంది వ్యాపారాలు రంగురంగుల బ్యాగుల్లో ప్యాకింగ్ చేసి కిలో 80 నుంచి 100 రూపాయలకు కూడా అమ్ముతున్నట్టు సమాచారం.
నాసిరకం సరఫరా
రిటైల్ బియ్యం వ్యాపారాలు చేసుకునే వారికి ప్రభుత్వ వత్తిడితో నాసిరకం బియ్యాన్ని మిల్లర్లు సరఫరా చేస్తున్నట్టు కనిపిస్తోంది. దుకాణాల బయట ధరల పట్టిక పెట్టిస్తూ కిలో 47 రూపాయలకే అమ్మాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ బియ్యం బాగోలేకపోవడంతో వినియోగదారుల నుంచి తాము విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తోందని ఓ వ్యాపారి వాపోయారు. అనేక దుకాణాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తోంది.








కామెంట్‌లు (0)