మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిశిత పరిశోధనల రితికా చోప్రా

11 గంటల క్రితం

ritika
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 04:29 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పాలకుల విధానాలను ఎండగట్టటం అంత తేలిక కాదు. దేశంలో అతి కొద్దిమంది జర్నలిస్టులు మాత్రమే ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పత్రికా రంగంలో 19 ఏళ్ల అనుభవం ఉన్న జర్నలిస్టు రితికా చోప్రా వారిలో ఒకరు. ఎన్నికల సంఘం పనితీరుపై తాజాగా ఆమె అందించిన పరిశోధనాత్మక కథనం రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ కథనం ప్రచురణలో రితికతో పాటు దామిని నాథ్‌ భాగస్వామ్యం కూడా ఉంది. దామిని ప్రస్తుతం ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా, నేషనల్‌ బ్యూరోలో పనిచేస్తున్నారు. ​దేశంలో ఎంతోమంది ప్రజలను ఇక్కట్లకు గురిచేసిన ‘ఎస్‌ఐఆర్‌’ ప్రక్రియకు సంబంధించిన అవకతవకలను రితికా చోప్రా తన ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు. ఎన్నికల కమిషన్‌ నిర్ణయ ప్రక్రియ, ఓటర్ల జాబితాల సవరణలో మార్పులు, అధికారుల మధ్య జరిగిన సంప్రదింపుల వంటి కీలక అంశాలను బట్టబయలుచేశారు.

కోల్ కతాలో జన్మించిన రితిక సెయింట్‌ జేవియర్స్‌ కళాశాల నుంచి మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ వీడియోగ్రఫీలో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. 2006లో ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’లో ఇంటర్న్‌గా జర్నలిజం ప్రారంభించారు. 2015లో ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో చేరారు. 2015–16 ప్రాంతంలో ఢిల్లీలోని ‘నేషనల్‌ మీడియా సెంటర్‌’ నుంచి విద్యాశాఖతో పాటు ఎన్నికల కమిషన్‌ను కవర్‌ చేసేవారు. 'చుట్టూ ఎంత హడావుడి ఉన్నా రితిక తన నోట్స్‌, డాక్యుమెంట్లలో మునిగిపోతుందని, ముందుగా వార్త ఇవ్వాలన్న తొందర కంటే వివరాలు సరిగ్గా ఉన్నాయా? అవసరమైన ఆధారాలున్నాయా? అనే దానికే ప్రాధాన్యం ఇచ్చేవారు` అని ఆమెను దగ్గరగా గమనించిన వారు తరచూ చెబుతారు.

ప్రభుత్వ ప్రకటనలు, ప్రెస్‌ బ్రీఫింగ్స్‌కే పరిమితం కాకుండా విధానాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయి? వాటి ప్రభావం ఏమిటి? అనే అంశాలను రితిక క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాల నుంచి చరిత్ర, రాజనీతి శాస్త్రాల్లోని కీలక అధ్యాయాలను (గుజరాత్‌ అల్లర్లు, అత్యవసర పరిస్థితి, గాంధీజీ హత్య తదనంతర పరిణామాలు మొదలైనవి) తొలగించడాన్ని ఆధారాలతో సహా ఆమె తన వరుస కథనాల్లో బయటపెట్టారు. ఐఐటీ, ఐఐఎమ్‌ల యాజమాన్య స్వేచ్ఛలో ప్రభుత్వాల జోక్యం, ఫ్యాకల్టీ నియామకాల్లో నిబంధనల అమలు, ఐఐటీ విద్యార్థుల్లో పెరుగుతున్న ఒత్తిడి/ఆత్మహత్యలపై ఆమె అందించిన కథనాలు విద్యాశాఖ నిబంధనల్లో మార్పులకు దారి తీశాయి కూడా. హర్యానా పంచాయతీ ఎన్నికల్లో విద్యా అర్హతలను నిర్బంధం చేయడం వల్ల పేదలు, నిరక్షరాస్యులైన మహిళలు ప్రజాస్వామ్య ప్రాతినిధ్యానికి ఎలా దూరమవుతున్నారో ఆమె చేసిన గ్రౌండ్‌ రిపోర్ట్‌ ఆలోచనను రేకెత్తించింది.

ఎన్నికల కమిషన్‌పై తాజాగా వెలువడిన ఆమె కథనం సున్నితమైన, సంక్లిష్టమైన సంస్థాగత అంశాన్ని ప్రజా చర్చలోకి తీసుకురావడంలో విశేషంగా తోడ్పడింది. పత్రికా రంగంలో రితిక చేసిన కృషికి గాను ఆమెకు ‘రామ్‌నాథ్‌ గోయెంకా ఎక్సలెన్స్‌ ఇన్‌ జర్నలిజం’, ‘చమెలీ దేవి జైన్‌ అవార్డు ఫర్‌ ఔట్‌స్టాండింగ్‌ ఉమెన్‌ మీడియా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ వంటి విశిష్ట అవార్డులు అందుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్