ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : నాలుగు కీలకరంగాల్లో చోటుచేసుకుంటున్న తిరోగమనం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. వీటిపై త్యేక దృష్టి పెట్టాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా తయారీ రంగంలో అభివృద్ధి తిరోగమనములో పయనించడంతో దాని ప్రభావం చిన్న, మధ్య, భారీ పరిశ్రమలపై కూడా పడనుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రంగంలో మైనస్ 4.7 శాతం వెనుకబడి ఉన్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో పెట్టుబడి వ్యయం, ఇన్లాండ్ ఫిషరీస్, విదేశీ పర్యాటకుల విభాగాల్లో కూడా వెనుకబాటు కనిపిస్తోంది. అభివృద్ధికి అత్యంత కీలకమైన పెట్టుబడి వ్యయం ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఈ విభాగంలో ఏకంగా 33.1 శాతం మైనస్లో ఉండడం ఇందుకు కారణంగా ఉంది. పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండడంవల్ల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేకపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో కీలకంగా ఉండే మత్స్య రంగంలో కూడా వెనుకబాటు ఇబ్బందికరంగానే కనిపిస్తోంది. 15 నుంచి 20 శాతం తగ్గుదల కనిపిస్తుండగా తాజా గణాంకాల్లో ఇన్లాండ్ మత్స్య రంగంలో 9.1 శాతం వృద్ధిని కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పర్యాటక రంగ ద్వారా ఎప్పుడు భారీ ఆదాయాన్ని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందులో విదేశీ పర్యాటకులు ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది అయితే తాజా గణాంకాల్లో విదేశీ పర్యాటకులు 22 శాతానికి పైగా తగ్గుముఖం పట్టినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నాలుగు రంగాల్లో వెనుకబాటు జిఎస్డిపిపై కూడా పడుతోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇకపై ఈ నాలుగు రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేయాలని భావిస్తున్నారు. దీనిపై సంబంధిత శాఖల అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పర్యాటక రంగం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. ప్రధానంగా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు కేవలం అరకు, మారేడుమిల్లి వంటి ప్రాంతాలతో పాటు కొన్ని దేవాలయాలకు మాత్రమే పరిమితం కావడం వల్ల విదేశీ పర్యాటకులు తగ్గుతున్నట్లు గుర్తించారు. ఇకపై విదేశీ పర్యటన మరింతగా పెరిగేలా చూసేందుకు పర్యాటకశాఖపాటు విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు కూడా బాధ్యతలు అప్పగించనున్నారు. త్వరలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో విదేశీ పర్యాటకులు నేరుగానే రాష్ట్రంలో కాలుమొపే అవకాశాలు ఉంటాయని దీనివల్ల పర్యాటక రంగం ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద దేశాలకు వెళ్లాలన్నా, అక్కడివారు రాష్ట్రానికి రావాలన్నా తెలంగాణలోని హైదరాబాద్ విమానాశ్రయం మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కూడా రాష్ట్రానికి విదేశీ పర్యాటకులు పెరగకపోవడానికి కారణంగా భావిస్తున్నారు. ఈ నాలుగు రంగులే కాకుండా ఆయిల్ సీడ్స్, మిరప, పసుపు, మిరియాలు వంటి పంటలు కూడా వెనుకంజలోనే ఉన్నట్టు గుర్తించారు. స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణాలు కూడా ఏకంగా 640 శాతం మైనస్ లో ఉన్నట్టు గుర్తించారు. అందుకే ఈ సంఘాలకు ఇచ్చే రుణాలను గణనీయంగా పెంచాలని మెప్మా, ఆర్థిక శాఖలకు సూచించినట్లు తెలిసింది. ఎస్ఎల్బీసీ ద్వారా కూడా స్వయం సహాయసంకాలకు రుణాలు పెంచే అంశంపై బ్యాంకులకు దిశానిర్దేశం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
నాలుగు రంగాల్లో తిరోగమనం
21 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 04:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)