సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రశ్నించే గొంతుల అణచివేత

1 గంట క్రితం

free
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 05:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- ఫీచర్స్‌ అండ్‌ ‌పాలిటిక్స్‌

కేంద్రంలోనూ, ఇటు బిజెపి, దానితో అంటకాగుతున్న పార్టీల పాలనలో ఉన్న రాష్ర్టాల్లో ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే ఈ దుర్మార్గం తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ వరుస ఆంక్షలకు గురవుతోంది. అధికారంలో వున్న వారిని ఎవరూ విమర్శించకూడదనే ధోరణి ప్రభుత్వ పెద్దల్లోనూ, ఆధిపత్య తరగతుల నేతల్లోనూ పెరిగిపోతుంది. విమర్శను ఏమాత్రం స్వీకరించకుండా..అలా మాట్లాడిన వారంతా అవతలి పక్షమని ముద్రవేయడం, మతాన్ని, ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని నిందారోపణలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ ‌చేస్తూ వేధింపులకు గురిచేయడం, పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టడం రివాజుగా మారింది. తెలకపల్లి రవి, ప్రొఫెసర్ నాగేశ్వర్, తులసీ చందు లాంటి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, పాత్రికేయులు కూడా ఈ తరహా అప్రజాస్వామిక దాడులకు గురవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉంటూ ప్రభుత్వ తీరుపై కానీ, అధికార పార్టీ నేతల వైఖరిపై కానీ విమర్శలు గుప్పించిన విలక్షణ సినీ నటులు ప్రకాష్‌ ‌రాజ్‌, అలాగే పోసాని కృష్ణమురళి వంటి అనేక మందిపై కేసులు నమోదయ్యాయి. హక్కుల కోసం ఉద్యమించిన రైతు ఉద్యమ నేత అప్పలరాజుపై ఏకంగా పిడి యాక్ట్ పెట్టి వేధించారు. తాజాగా ‘ప్రశ్న’ పేరుతో ఒక యూట్యూబ్‌ ‌ఛానెల్‌ ‌నడుపుతున్న సామాజిక కార్యకర్త రావణ్‌పై ప్రమాదకరమైన ‘ఉపా’ చట్టం కింద రాజద్రోహ నేరం కేసు పెట్టారు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు.

రాజద్రోహ నేర చట్టానికి కాలం చెల్లిందని దేశ సర్వోన్నత న్యాయస్థానమే పదేపదే స్పష్టీకరించింది. ఉపా చట్టాన్ని ఇష్టారీతిన దుర్వినియోగం చేసే హక్కు పోలీసులకు లేదని న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్‌ ‌పుర్కాయస్థ కేసులో ఢిల్లీ హైకోర్టు కూడా చీవాట్లు పెట్టిన సంగతి విదితమే. న్యాయస్థానాల హెచ్చరికలు పాలకులకు ఎంతమాత్రం తలకెక్కినట్టు కనిపించడం లేదు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపా చట్టం అత్యంత దుర్వినియోగం అయ్యింది. ఎలాంటి విచారణలేకుండా సంవత్సరాలుగా జైళ్లలో మగ్గుతున్నవారు అనేకమంది వున్నారు. కేంద్రంలో బిజెపి అనుసరించిన ఈ అప్రజాస్వామిక జాఢ్యం వారి స్నేహ ప్రభావం మన రాష్ట్ర పాలకులకు కూడా సోకింది. ఏలూరు సభలో ఉప ముఖ్యమంత్రిని అభినయిస్తూ రావణ్ చేసిన ఉపన్యాసం పై అభ్యంతరాలు వున్న జనసేన కార్యకర్తలు వివిధ స్టేషన్లలో కేసులు పెట్టారు, కోర్టులు బెయిల్ ఇస్తున్నాయి. అయితే గన్నవరంలోని జనసేన నేత, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు అలాంటిది కాదు. దేశంలో మావోయిస్టులను నిర్మూలించేసామని ఒకవైపు కేంద్ర హోంమంత్రి చెప్పుకుంటుంటే, మరోవైపు చాలా కాలంగా యూట్యూబ్‌ ‌ఛానెల్‌ ‌నిర్వహిస్తున్న రావణ్.. మావోయిస్టుల మద్దతు దారుడని, అందులో చేరాలంటూ యువతకు పిలుపిచ్చాడనే ఫిర్యాదుపై కేసు పెట్టడం ఆశ్చర్యం.

దేశసార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సమగ్రతకు భంగం కలిగించేలా చర్యలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం, దేశద్రోహ పూరిత , తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన నేరాలకు రావణ్ పాల్పడినట్లు పోలీసులు కేసు కట్టారు. గన్నవరం పోలీసుల కంటే ముందే పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, గుడివాడ పోలీసు స్టేషన్‌లలో జనసేన నేతలు పెట్టిన కేసులలో మావోయిస్టుల ప్రస్తావనే లేదు. ఇంత తీవ్రమైన మాటలు ఆయన మాట్లాడుతుంటే ఆ సభకు అనుమతిచ్చిన పోలీసులు, నిఘా విభాగం వారు వినకపోవడమేమిటి?

చట్టం ప్రకారం వ్యవహరించాల్సిన పోలీసు వ్యవస్థ పాలకుల చేతుల్లో కీలుబొమ్మగా మారి ఇష్టారీతిన తప్పుడు కేసులు పెడితే అది ఆ వ్యవస్థ విశ్వనీయతకే ప్రమాదం. ప్రశ్నించే గళాలను అణిచివేస్తున్న పాలకులు..పౌర హక్కులను కూడా కాలరాస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ సాయికృష్ణ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. కాళ్ళకు మేకులు కొట్టి తన కొడుకును చంపెశారు అని ఆయన తల్లి చెబుతున్న తీరు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు శాశ్వత మచ్చగా నిలిచిపోతుంది. చట్టం అందరిపట్ల సమానంగా వ్యవహరించాలని రాజ్యాంగంపై విశ్వాసం వున్న వారు కోరు కుంటారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షపడాలి. కానీ కొందరికి మినహాయింపు, మరికొందరికి నేరానికి మించిన శిక్ష వేసినప్పుడే వ్యవస్థ విశ్వనీయత ప్రశ్నార్థకమవుతుంది. రావణ్ చేసిన విమర్శలకంటే ఏ మాత్రం తక్కువ కానీ, లేదా అంతకంటే మించిన విద్వేషాలను రెచ్చగొట్టిన వారిపై ఎలాంటి కేసులు నమోదయ్యాయి? 2026 మే లో పెద్దాపురంలో జరిగిన శోభాయాత్రలో రాధా మనోహర్ దాస్ అనే అతను అన్యమతస్తుల గురించి చాలా అసభ్యంగా మాట్లాడిన విషయంపై కానిస్టేబుల్ ఫిర్యాదు చేస్తే..అది ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్‌’ (‌వాస్తవాల వక్రీకరణ) అని చెప్పి కేసు కూడా నమోదు చేయలేదు. సదరు కానిస్టేబుల్‌దే తప్పు అంటూ తేల్చేశారు. కానీ రాధా మనోహర్‌ ‌వ్యాక్యలు అంత తేలికగా కొట్టిపారేసే విషయం కాదని, మతాధిపత్య అహంకార జాఢ్యమన్న సంగతి ఆయన మాటలు విన్న లోకం కోడేకూసింది. ‘మీరంతా మాకు పుట్టిన వారే’ అంటూ ఒక నిండు సభలో ఇతర మతస్థులను ఉద్దేశించి రాధామనోహర్‌ నోరుపారేసుకుంటే ..‌ పోలీసు వ్యవస్థకు పట్టకపోతే ఎలా? ఇలాంటి వారిపై ఎందుకు చర్యలు లేవనే ప్రశ్న సమంజసమైందే కదా!

గతంలోనే కాదు, ఉపముఖ్యమంత్రి హోదాలో కూడా పవన్ కళ్యాణ్ ఇటీవల తాటతీస్తా, బట్టలు ఊడదీస్తా అని మాట్లడారు. ఆయనేకాదు అనేకమంది రాజకీయ నాయకుల నోల్లు అదుపుతప్పి ఇష్టారీతిన రాయలేని భాషలో మాట్లాడటం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి వారిలో ఒక్కరి మీదైన కేసు పెట్టివుంటే ఈ పరిస్థితి వచ్చి వుండేదికాదు. ప్రజాసమస్యలపై ప్రశ్నించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎంత దుర్భాషలాడారో పాలకులు తెలియదు అనుకోలేము. మనోభావాలు అధికారంలో వున్నవారికే కాదు, అందరికి వుంటాయని గుర్తించాలి.

గత వైసిపి ప్రభుత్వం అనుసరించిన అణచివేత, తప్పుడు కేసుల తీరుపై ప్రజల్లో వచ్చిన అసంతృప్తి వారిని ఏ స్థాయిలో గద్దెదించిందో కళ్ళకు కనిపిస్తుంటే అదే బాటలో నడవాలనుకోవడం వివేకం అనిపించుకోదు. ఎన్నికల నాడు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని ఈ ప్రభుత్వాన్ని గద్దెపై కూర్చోబెట్టారు. గ్రామీణ పేదలకు అందే ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గిపోవడంతో ఉపాధి కార్మికులు, గిట్టుబాటు ధరలు లేక రైతులు, కనీస వేతనాలు అందక శ్రమజీవులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ప్రభుత్వం పట్ల తమ నిరసనలను వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం రావణ్ సమస్య చుట్టూ తిరగడం కూటమిలోని కొద్దిమంది నేతలను సంతృప్తి పరుస్తుందేమో కాని ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చదు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్