- మొత్తం రూ.13,912 కోట్లకు ప్రతిపాదనలు
- ఇప్పటికి రెండు దశలు విడుదల
- మూడోదశలో రూ.6000 కోట్లు
- పెద్ద యుఎల్‌బిలకు 25 శాతం, చిన్న సంస్థలకు 33 శాతం గ్రాంటు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేసిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్(యుసిఎఫ్)లో షరతులు స్థానిక సంస్థలను అప్పులపాలు చేసేవిగానూ మున్సిపల్ ఆస్తులను ప్రైవేటు వక్తులకు కట్టబెట్టేవిగానూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రుద్దుతున్న ఈ పథకం కింద ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ప్రజలపై విపరీతంగా భారాలు మోపే ప్రమాదం ఉంది. దీంతోపాటు ఆస్తుల నిర్వహణ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు విలువైన ఆస్తులు కట్టబెట్టనున్నారు. రాష్ట్రంలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థ(యుఎల్‌బి)ల్లో సదుపాయాల కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద సుమారు రూ.13,912 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. వీటిల్లో మొదటిదశలో రూ.2000 కోట్లు ఇచ్చారు. రెండోదశలో 44 యుఎల్‌బిలకు రూ.5912 కోట్లు విలువైన పనులు మంజూరు చేస్తూ ఇటీవల ఆమోదం తెలిపారు. మూడోదశలో మరో రూ.6000 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎపియుఎఫ్‌ఐడిసి వీటికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తోంది. దీనికోసం రాష్ట్రంలో అమరావతి, విశాఖ, తిరుపతి అని మూడు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ క్లస్టర్ల పరిధిలో ఉండే పట్టణ స్థానిక సంస్థలను జనాభా, ఆదాయపరంగా వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. కార్పొరేషన్లు, ఎక్కువ ఆదాయం ఉన్న మున్సిపాలిటీలకు మొత్తం పెట్టుబడిలో 25 శాతం గ్రాంటుగా ఇస్తారు. మిగతా వ్యయంలో కనీసం 50 శాతం నిధులను మున్సిపల్ బాండ్లు, బ్యాంక్ రుణాలు లేదా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా మార్కెట్ నుంచి సమీకరించాలని నిబంధన విధించారు. 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ సాయంతో స్థానిక సంస్థలే రుణాలు సమకూర్చుకోవాలని తెలిపారు. ఆ మాత్రం ఆర్థికస్థితి లేని యుఎల్‌బిలు క్రెడిట్ రీపేమెంట్ గ్యారంటీ సబ్ స్కీమ్ కింద కేటాయించిన కార్పస్ ఫండ్ గ్యారంటీతో అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. యుసిఎఫ్ కింద తీసుకునే 50 శాతం అప్పునకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు. స్థానిక సంస్థలే నేరుగా వారి ఖజానా నుండి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ నగరాలకు ఆర్థిక క్రమశిక్షణ లేదని, అందువల్లే ఇటువంటి పద్ధతి తీసుకొచ్చామనీ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నిబంధనల్లో పొందుపరిచారు. అప్పు చెల్లించాల్సి రావడం వల్ల ఆర్థిక నిర్వహణ మెరుగు పడుతుందని పేర్కొన్నారు. అలాగే రోడ్లు, మార్కెట్ల నిర్వహణ కోసం ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యం అయ్యేందుకు మరిన్ని రాయితీలు ఇవ్వనున్నారు. దీనికోసం స్పెషల్ పర్పస్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ (ఎస్‌పియుఐఎం)గా ప్రైవేటు సంస్థలను నియమించుకునేందుకూ అవకాశం కల్పించారు.
ప్రజలపై భారాల ప్రమాదం
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నిధులు తీసుకునే సంస్థలు స్వయంగా అప్పు చెల్లించాల్సి ఉండటంతో మార్కెట్ నిధులు (మున్సిపల్ బాండ్లు, రుణాలు) ప్రైవేట్ భాగస్వామ్యంపై ఆధారపడాల్సి వస్తుంది. దీన్నుండి బయటపడేసేందుకు ప్రజల దగ్గర నుండి ముక్కుపిండి యూజర్ ఛార్జీలు, పన్నులు వసూలు చేయనున్నారు. ఇది ప్రజలకు పెనుభారంగా మారనుంది. ఇలా యూజర్ ఛార్జీలు వసూలు చేసే సంస్థలకు మరిన్ని రాయితీలు ఇచ్చేలా పలు ప్రోత్సాహకాలనూ ఈ పథకంలో ప్రవేశపెట్టారు. ఈ ఫండ్ కింద విజయవాడ నగరంలో డ్రైనేజీ, వర్షపు నీటి కాలువల నిర్వహణకు రూ.600 కోట్లు కేటాయించారు. ఇప్పటికే రోడ్ల ప్రైవేటీకరణ ప్రక్రియ చేపట్టారు. తిరుపతి, విశాఖపట్నంలోనూ ఇదే తరహా కార్యాచరణ చేపడుతున్నారు. మొత్తంగా స్థానిక సంస్థలు ఖచ్చితంగా అప్పుల బారినపడేలా షరతులు విధించారు.
జెఎన్ఎన్ యుఆర్ఎం పనులే మరలా
ఇంతకుముందు పట్టణ ప్రాంతాల్లో జవహర్ లాల్ నెహ్రు నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్(జెఎన్ఎన్ యుఆర్ఎం) కింద విజయవాడలో కోట్ల రూపాయలు వెచ్చించి వర్షపునీటి కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సరఫరా వంటి పనులు చేపట్టారు. ఇప్పుడు కొత్తగా మరలా అదే తరహా పనులను యుసిఎఫ్ కింద చేస్తున్నారు. మొత్తం నిధుల్లో డ్రెయిన్ల నిర్మాణానికి ఎంపిక చేసిన అన్ని యుఎల్బిలకు కలిపి రూ.3980 కోట్లు కేటాయించారు. తాడిగడపలో నీటి సరఫరాకు రూ.120 కోట్ుఉల, విజయవాడలో రూ.300 కోట్లు, గుంటూరులో రూ.50 కోట్లు కేటాయించారు. నెల్లూరులో పరిశ్రమలకు నీటి సరఫరాకు రూ.120 కోట్లు, గుంటూరు, తిరుపతిలో ఎస్టిపిల కోసం రూ.300 కోట్లు, రాజమండ్రిలో మల్టీస్టోరేజ్ పార్కింగు కోసం రూ.20 కోట్లు, కూరగాయల జనరల్ మార్కెట్కు రూ.120 కోట్లు కేటాయించారు. గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణం కోసం రూ.100 కోట్లు, గుంటూరులో పివికెనాయుడు మార్కెట్ నిర్మాణం కోసం రూ.100 కోట్లు ఇచ్చారు. వీటితోపాటు రోడ్ల నిర్వహణ, భవనాలు, రోడ్లను నిర్మించి పిపిపి పద్ధతిలో నిర్వహించుకోవడం వంటి పనులన్నీ చేపడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రవేటు నిర్వహణలోకి వెళ్లనున్నాయి.








కామెంట్‌లు (0)