గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కడప ‘ఉక్కు’కు శంకుస్థాపనలు మళ్లీ, మళ్లీ

4 రోజుల క్రితం

kadapa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 05:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కడప: కడప ఉక్కు పరిశ్రమకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి జులై 3న శంకుస్థాపన చేశారు. ఉక్కు రాష్ట్రంగా ఎపి మారుతుందని ఆయన ప్రకటించారు. కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు జిందాల్ కంపెనీ ముందుకు రావడానికి తమ ప్రభుత్వమే కారణమని మాజీ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ముగ్గురు ముఖ్యమంత్రులు ఈ పరిశ్రమకు ఆరు సార్లు శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు పడలేదో చెప్పడంలేదు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన ఎంపీ బాలశౌరి కడప ఉక్కు పరిశ్రమ గురించి పార్లమెంట్‌లో ప్రశ్నించగా, కడప స్టీల్‌ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని 2024 డిసెంబర్ 2న కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి లోక్‌సభలో ప్రకటించారు. తాజాగా జిందాల్ కంపెనీ మాత్రం రెండవసారి శంకుస్థాపన పూర్తిచేసింది.

బ్రహ్మణి ఉక్కు పరిశ్రమకు అంబవరం గ్రామ సమీపంలో 2007 జూన10న వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. పది వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ పరిశ్రమను నిర్మిస్తున్నట్లు అప్పట్లో ఆయన ప్రకటించి, ఆ పది వేల ఎకరాలను బ్రహ్మణి స్టీల్ కంపెనీకి ఎకరం రూ.18 వేల చొప్పున అప్పగించారు. ఉక్కు పరిశ్రమకు సమీపంగా జమ్ములమడుగులో నాలుగు వేల ఎకరాల్లో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయన మరణం తర్వాత అనూహ్య రాజకీయ పరిణామాలు, రాష్ట్ర విభజన సందర్భంగా మరల కడప ఉక్కు పరిశ్రమ చర్చలోకి వచ్చింది. రాష్ట్ర విభజన వల్ల నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్ కు పునర్విభజన చట్టం-2014 ప్రకారం ప్రభుత్వరంగంలోనే భారీ ఉక్కుపరిశ్రమను నిర్మిస్తామని అప్పటి కేంద్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ‌బిజెపి బలపరచింది.

రాష్ట్రాభివృద్ధికే కేంద్రంలో బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు, ప్రభుత్వ రంగంలోనే కడప ఉక్కు పరిశ్రమ త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రకటించారు. అయితే ఈ పరిశ్రమ సాధ్యాసాధ్యాలను పరిశీలించే పేరుతో కేంద్ర బృందాలను పంపుతూ సుమారు ఐదు సంవత్సరాలు రాష్ట్రంతో కేంద్రం దోబూచులాడింది. టిడిపికి బిజెపితో స్నేహం చెడిన తర్వాత ఎన్నికలకు ఐదు నెలల ముందు 2018 డిసెంబర్ 27న గండికోట రిజర్వాయర్‌ సమీపంలోని కంబాలదిన్నె గ్రామం వద్ద ఉక్కు పరిశ్రమకు తొలి శంకుస్థాపన జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత రెండవసారి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 డిసెంబర్ 23న మూడోసారి, తిరిగి 2023 ఫిబ్రవరి 15న నాలుగోసారి జిందాల్ కంపెనీతో శంకుస్థాపన చేయించారు. రాజశేఖరరెడ్డి ఒకసారి, చంద్రబాబు నాయుడు రెండుసార్లు, జగన్‌మోహన్‌రెడ్డి రెండుసార్లు శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు నిర్మాణం కూడా జరగలేదు.

బిజెపి మోసం

2014 నుండి కేంద్ర బిజెపిని టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరుస్తూనే ఉన్నాయి. అయినా, కడప ఉక్కు పరిశ్రమను నిర్మించకుండా అనేకవాదనలు ముందుకు తెచ్చింది. ప్రభుత్వరంగంలో ఉక్కుపరిశ్రమ నిర్మించడం సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకంకాదని ఒకసారి, క్యాప్టివ్ మైన్‌లు (గనులు) లేకుండా ఉక్కుపరిశ్రమ నిర్మించలేమని మరోసారి, ఈ ఉక్కుపరిశ్రమ నష్టాదాయకమని ‘సెయిల’ అధ్యయనం తేల్చిందని ఇంకోసారి చెబుతూ వచ్చింది. అయితే 2018 ఫిబ్రవరి 22న కర్నూలులో సభ జరిపిన బిజెపి ‘రాయలసీమ డిక్లరేషన్‌’ ప్రకటించింది. కడపలో ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే స్థాపించనున్నట్లు అందులో పేర్కొంది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తడంలేదు. ఇప్పుడు ‌టిడిపి కూటమి ప్రభుత్వంలో ఇటు రాష్ట్రంలో, ఎన్‌డిఎలో అటు కేంద్రంలో టిడిపి, బిజెపి భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఈ పరిశ్రమను నిర్మిస్తారా? మరోసారి శంకుస్థాపనకే పరిమితం చేస్తారా? అని ఈ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్