సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అనంత’ నగరపాలక సమస్యలు అనంతమే..!

6 గంటల క్రితం

‘అనంత’ నగరపాలక సమస్యలు అనంతమే..!
- దశాబ్ధాలుగా నెరవేరని హామీలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 07:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- దశాబ్ధాలుగా నెరవేరని హామీలు

ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ హడావుడి నడుస్తోంది. ఇదే సమయంలో అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో జరిగిన అభివృద్ధిపైనా చర్చ జరుగుతోంది. 1869 బ్రిటీష్‌ ‌కాలంలోనే అనంతపురం మున్సిపాలిటీగా ఏర్పాటైంది. 2004లో నగర పాలక సంస్థగా రూపాంతరం చెందింది. సుదీర్ఘ చరిత్ర ఉన్నా చెప్పుకోదగిన అభివృద్ధి మాత్రం లేదనే అభ్రిపాయం అందరిలోనూ ఉంది. ప్రధాన రహదారులున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పన మాత్రం ఆశించిన స్థాయిలో లేదనేది ప్రధాన విమర్శ.

దశాబ్ధాలుగా హామీలు

అనంతపురంలో అండర్‌ ‌గ్రౌండ్‌ డ్రెయినేజీ హామీ రెండు, మూడు దశాబ్ధాలుగా నగరపాలక సంస్థ ఎన్నికల సమయంలోనూ, సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉన్నప్పటికీ కాగితం దాటి ఇంతవరకు ముందుకు సాగలేదు. అనేక పర్యాయాలు మంజూరైనట్టు ప్రకటనలు వెలువడినా ఆచరణకు నోచుకోలేదు. నగరంలోనున్న మరో ప్రధానమైనది ట్రాఫిక్‌ ‌సమస్య. రహదారులు విస్తరిస్తున్నా ఈ సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ మధ్యలోనే ఆగిపోయాయి. ప్రధానమైన సమస్యల్లో శాంతి నర్సింగ్‌ ‌హోమ్‌ ‌వైపు నుంచి గుత్తిరోడ్డుకు కలిపే రహదారి నిర్మాణ పనులు భూసేకరణ సమస్యతో కొన్నేళ్లుగా మధ్యలోనే నిలిచిపోయాయి. గాంధీ బజారు రోడ్డు విస్తరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. సప్తగిరి సర్కిల్‌ ‌విస్తరణ చేపట్టనున్నట్టు గత పాలక వర్గం హయాంలో హడావుడి సాగింది. భూసేకరణ కూడా చేపడుతున్నట్టు జోరుగా ప్రచారం సాగినా... చివరకు రోడ్డు వేసి ముగించేశారు. ఇక నగరం నడిబొడ్డున నడిమివంక, మరువవంకల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో నడిమివంకకు వరదొచ్చి వందల ఇళ్లు నీట మునిగాయి. ఈ సందర్భంలో వాటిని అభివృద్ధి చేస్తామని ప్రకటన ఇవ్వడం, నిధులు మంజూరవడం కూడా జరిగింది. అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ ఛానలింగ్‌ ‌పనులు ముందుకు సాగలేదు.

కదలని పంచాయతీల విలీనం?

నగర పాలక సంస్థ పరిధి పెరగాలంటే పంచాయతీల విలీనం జరగాల్సి ఉంది. పాపంపేట, రుద్రంపేట, నారాయణపురం, కక్కలపల్లి, చిన్మయనగర్‌ ‌వంటి ప్రాంతాలు చాలా వరకు నగరంలో కలిసిపోయి ఉన్నాయి. వీటి విలీనం ద్వారా నగర పాలక సంస్థ పరిధి పెరిగే అవకాశముంది. తద్వారా నిధులు కూడా అధికంగా వచ్చేందుకు వీలుంది. కాని నగర పాలక సంస్థ ఏర్పాటై రెండు దశబ్దాలైనా విలీన ప్రతిపాదనలు అంతటితోనే ఆగిపోతున్నాయి. ఈసారి కూడా అవేవీ లేకుండా ఎన్నికలకు సమాయత్తమయ్యే ఆలోచనలున్నాయి. ఎంతో ఘనమైన చర్రిత కలిగిన అనంతపురం పట్టణంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా మారింది. ప్రస్తుత ఎన్నికల సందర్భంగానైనా ఈ సమస్యలు చర్చకు రావాలని నగరవాసులు కోరుకుంటున్నారు.

ఎన్నికల హామీగానే డ్రయినేజీ సమస్య

- సిపిఎం నగర కార్యదర్శి రామిరెడ్డి

అనంతపురం నగరంలో డ్రయినేజీ సమస్య ఎన్నికల హామీగానే మిగిలిపోయింది తప్ప పరిష్కారం లభించడం లేదు. నగరంలోని ప్రధాన రహదారులను తక్షణమే విస్తరణ చేపట్టాలి. డంపింగ్ యార్డును మరోచోటికి తరలించాలి.

రూ.1200 కోట్లతో అభివృద్ధి

- టిడిపి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌

రూ.1200 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాం. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాం. డ్రయినేజీ సమస్య పరిష్కారానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. డంపింగ్‌ ‌యార్డును త్వరలో మరోచోటికి మార్పు చేస్తాం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్