- ప్రజాప్రతినిధుల వివరాల వెల్లడిలో పారదర్శకతకు ప్రాధాన్యం
- సుప్రీంకోర్టు కీలక తీర్పు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు, ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చినా, కీలక వివరాలను దాచిపెట్టినా వారిపై ఓటర్లు, ఇతర వ్యక్తులు నేరుగా ప్రైవేటు క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేయొచ్చని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 125ఎ కింద నమోదయ్యే నేరాలకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి ఎన్నికల సంఘం లేదా ప్రభుత్వ అధికారి మాత్రమే ముందుకు రావాలనే నిబంధన లేదని పేర్కొంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం ఈ మేరకు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి)లోని సెక్షన్ 195(1) ఈ తరహా ఫిర్యాదులకు అడ్డంకి కాదని తెలిపింది.
అధికారులకే పరిమితం చేయలేం
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఎ ప్రకారం, అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు లేదా అఫిడవిట్లలో తెలిసి కూడా తప్పుడు సమాచారం ఇవ్వడం, తప్పనిసరిగా వెల్లడించాల్సిన వివరాలను దాచిపెట్టడం నేరం. ఇలాంటి నేరాలపై ఫిర్యాదు చేసే అధికారాన్ని ప్రభుత్వ అధికారులకే పరిమితం చేసే నిబంధన ఏ చట్టంలోనూ లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సిఆర్‌పిసిలోని సెక్షన్ 195(1) కొన్ని నిర్దిష్ట నేరాలపై న్యాయస్థానాలు విచారణ చేపట్టడానికి సంబంధిత ప్రభుత్వ అధికారి నుంచి ఫిర్యాదు రావాల్సి ఉంటుందని చెబుతుంది. అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఎ ఆ నేరాల జాబితాలో లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 125ఎను 2002లో ప్రవేశపెట్టగా, సిఆర్‌పిసిలోని సెక్షన్ 195కు 2006లో సవరణలు చేసినప్పటికీ, ఈ నేరాన్ని ఆ జాబితాలో చేర్చలేదని గుర్తుచేసింది. ఈ మినహాయింపును ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు పరిగణించాలని తెలిపింది.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలే అంతిమం కాదు
అభ్యర్థుల అఫిడవిట్లలో తీవ్రమైన వివరాల గల్లంతుపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, తగిన చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపే విధంగా ఎన్నికల సంఘం 2020లో మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, ఆ మార్గదర్శకాలు లేదా పత్రికా ప్రకటనలు చట్టంలోని నిబంధనలను న్యాయస్థానాలు ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని నిర్దేశించలేవని సుప్రీంకోర్టు తెలిపింది. కర్ణాటకలోని బీదర్ నియోజకవర్గం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యే డాక్టర్ శైలేంద్ర బెల్దాలే తన నామినేషన్ అఫిడవిట్‌లో నివాస చిరునామా విషయంలో తప్పుడు ప్రకటన చేశారని రాజ్‌కుమార్ మద్కి ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సిఆర్‌పిసి సెక్షన్ 200 కింద ఆయన ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే, ఇలాంటి ఫిర్యాదును వ్యక్తిగతంగా దాఖలు చేయడానికి వీల్లేదని, ఎన్నికల సంఘం లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి మాత్రమే ఫిర్యాదు చేయాలని కర్ణాటక హైకోర్టు గతంలో పేర్కొంది. దీంతో మద్కి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రైవేటు ఫిర్యాదులపై హైకోర్టు ఇచ్చిన న్యాయపరమైన వివరణ తప్పని సుప్రీంకోర్టు తేల్చింది. అయితే, ఎమ్మెల్యే నివాస చిరునామాకు సంబంధించిన ఆరోపణలను రికార్డుల్లోని పత్రాలు ప్రాథమికంగా ఖండిస్తున్నాయని, ఈ కేసులో శిక్ష పడే అవకాశం చాలా తక్కువగా ఉందని అభిప్రాయపడింది.







కామెంట్‌లు (0)