- రాష్ట్రంలో 7,769 ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్లే లేవు
- 624 పాఠశాలల్లో బాలికలకూ సౌకర్యం లేదు
• విద్యార్థులు, విద్యార్థినీలకు తీవ్ర కష్టాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారుచేస్తామని ప్రజాప్రతినిధులు ప్రగల్భాలు పలకడం తప్పితే ఆచరణలో మాత్రం చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. ఆధునీక యుగంలో కూడా ఇంకా మరుగుదొడ్లు లేవంటే పాలకులు ప్రభుత్వ పాఠశాలలపై ఎంత శ్రద్ధ పెడుతున్నారో తెలుస్తోంది. మరుగుదొడ్లే లేకుండా మరుగుదొడ్ల నిర్వహణ నిధి(టిఎంఎఫ్) పేరుతో అమ్మఒడి, తల్లికి వందనం పధకం పేరుతో లబ్ధిదారుల నుంచి వేల కోట్లు వసూలు చేయడం విశేషం. రాష్ట్రంలో 7769 పాఠశాలల్లో విద్యార్ధులకు మరుగుదొడ్ల సౌకర్యం ఇప్పటికీ లేకపోవడం గమనార్హం. వీటిల్లో బాలికలకు 853 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని దౌర్భాగ్యం రాష్ట్రంలో నెలకొంది. యునిఫైడ్ డిస్ట్రిక్ ఇన్‌ఫర్‌మేషన్ సిస్టం(యుడైస్) ప్లస్ లెక్కల ప్రకారం గడిచిన విద్యాసంవత్సరం(2025-26)లో 44,222 ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిల్లో బాలురు, బాలికలు కలిసి చదువుకునే పాఠశాలలు 43,784 ఉన్నాయి. అయితే వీటిల్లో 37,698 పాఠశాలల్లో బాలురకు, 43,124 బాలికలకు మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. అంటే 6050 పాఠశాలల్లో బాలురకు, 624 పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్ల సౌకర్యం అసలు లేదు. కొన్ని పాఠశాలల్లో పేరుకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. కానీ వాటిని పాఠశాల విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో అవి పనిచేయడం లేదు. నీటి సౌకర్యం లేకపోవడం, నిర్మాణం పూర్తికాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ఇలాంటివి బాలుర పాఠశాలలు 6761, బాలికల పాఠశాలలు 853 ఉన్నాయి. అంటే బాలురు, బాలికలు కలిసి చదువుకుంటున్న 43,784 పాఠశాలల్లో బాలురకు 6761 పాఠశాలలల్లో, బాలికలకు 853 పాఠశాలల్లో మరుగుదొడ్డి సౌకర్యం లేని దుస్థితి నెలకొంది. మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్ధులు బహిర్బూమి కోసం బడికి దగ్గరలో ఉన్న ముళ్ల కంపల్లోకి గానీ, ఇంటికి గానీ వెళ్లాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వ సాయంతో నడిచే ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 797 పాఠశాలలు ఉంటే 648 పాఠశాలల్లో బాలురకు మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. వీటిల్లో 642 పాఠశాలల్లో మాత్రమే ఇవి పనిచేస్తున్నాయి. అంటే 155 పాఠశాలల్లో విద్యార్ధులు బహిర్భూమి కోసం ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది.
టిఎంఎఫ్ నిధులు ఏమవుతున్నాయి?
గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో విద్యార్ధుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోంది. అయితే ప్రతి లబ్ధిదారుడి నుంచి రూ.2వేల చొప్పున మరుగుదొడ్ల నిర్వహణ నిధులు(టిఎంఎఫ్) పేరుతో కోత విధిస్తోంది. కేటాయించిన నిధుల నుంచే ప్రతి ఏటా సుమారు రూ.1000కోట్ల చొప్పున మరలా టిఎంఎఫ్ పేరుతో వెనక్కి తీసుకుంటోంది. ఈ విద్యాసంవత్సరం తల్లికి వందనం కింద ప్రభుత్వం రూ.10,120.78కోట్లు కేటాయించింది. రూ.2వేలు చొప్పున రూ.1349.43కోట్లు టిఎంఎఫ్ పేరుతో లబ్ధిదారుల నుంచి కోత విధించింది. అయితే ఈ నిధులను ఏ రూపంలో ఖర్చు చేస్తుందో అర్ధం కావడం లేదు. మరుగుదొడ్లు లేకుండానే 7769 పాఠశాలల్లో ప్రభుత్వం టిఎంఎఫ్ పేరుతో నిధులు వసూలు చేయడం గమనార్హం. మరుగుదొడ్ల నిర్వహణ కోసం విద్యార్ధుల సంఖ్యను బట్టి ప్రభుత్వం రూ.6వేల గౌరవ వేతనంతో ఆయాలను నియమించింది. ఈ ఆయాలకు వేతనాలు కూడా సకమ్రంగా అందించని పరిస్థితి నెలకొంది. మూడు నెలలకొక్కసారి, కొన్ని సార్లు ఆరునెలలకొక్కసారి వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తోంది. విద్యార్ధులకు అత్యంత అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకుండా రాష్ర్టప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్(పిటిఎం)కార్యక్రమాన్ని రాజకీయంగా వాడుకుంటోందని పలువురు విద్యావేత్తలు తప్పుపడుతున్నారు.








కామెంట్‌లు (0)