బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసంక్షోభంలోనే పొగాకు

20 గంటల క్రితం

tobaco
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 05:58 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఏ మాత్రమూ మారని వ్యాపారుల తీరు

  • అదే రీతిలో వేలం

  • ఆందోళన బాటలోనే రైతన్న

ప్రజాశక్తి - ఒంగోలు బ్యూరో : ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బోసస్‌ ‌విధానం పొగాకు సంక్షోభానికి ఏమాత్రం పరిష్కారం చూపలేదు. వ్యాపారులకు మేలు జరిగేలా ఉందే తప్ప రైతులకు ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సోమవారం కందుకూరు వేలం కేంద్రంలో కొనుగోళ్లు నిలిపేసి ఆందోళన చేపట్టారు. రాస్తోరోకో చేశారు. అన్ని వేలం కేంద్రాల్లోనూ కొనుగోళ్ల తీరు మారలేదు. వ్యాపారులు సిండికేట్‌‌గా మారి, సీలింగు ధరలు అమలు చేస్తున్నారు. జాతీయ రహదారులను దిగ్బంధనం చేసినా ప్రభుత్వం రైతులు చెప్పింది చేయడానికి సిద్దంగా లేదు. బోసన్‌ ‌పేరుతో కిలోకు రూ.20 ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం బేసిక్‌ ‌ధరలు నిర్ణయించారు. ఆ ధరలు అమలు జరుగుతున్నాయా? అంటే అదీ లేదు. రోజురోజుకూ వేలం దిగజారిపోతోంది. వ్యాపారులు ధరలు దిగజార్చుతుంటే ప్రభుత్వం ఎంత భోనస్‌ ఇస్తుంది? ఆ భర్తీ ఎలా సాధ్యమన్నదీ ఆలోచించడం లేదు. ప్రస్తుతం 35 నుంచి 37 శాతం నో బిడ్లు కొనసాగుతున్నాయి. వాటిని తిరిగి తీసుకుపోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. సగటు ధర రోజువారీ కొనుగోళ్లపై రూ.187కు పడిపోయింది. దీంతో రైతులు వేలం తీరుపై మండిపడుతున్నారు. వేలం ప్రారంభమై నాలుగు నెలలవుతోంది. ఆరంభం నుంచే ధరల్లేవు. నెల రోజుల పాటు ఎదురుచూసిన రైతులు ఆందోళన బాటపట్టారు. రైతుసంఘాలు అండగా నిలిచాయి. బోర్డు వద్దకు రాయబారం నడిపారు. దీంతో ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. వ్యాపారులతో సమావేశం నిర్వహించిన సిఎం చంద్రబాబు నోబిడ్‌ ‌లోబిడ్‌ అనే తేడా లేకుండా కిలో రూ.200కు కొనాలని ఆదేశించారు. వ్యాపారులు దాన్ని లెక్క చెయ్యలేదు. మరో వైపు రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పరిస్థితి చేయిదాటడంతో మంత్రులు జోక్యం చేసుకున్నారు. తర్వాత సిఎం చంద్రబాబు పదేపదే సమీక్షలు చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన మంత్రులు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌‌ను, వాణిజ్య మంత్రి పియూష్‌‌ గోయల్‌‌ను కలిశారు. సంక్షోభంపై చర్చించారు. వాణిజ్య మంత్రిత్వశాఖ నుంచి ఉన్నతాధికారులు అమరావతికి వచ్చారు. సిఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అక్కడ కొన్ని ప్రతిపాదనలు నడిచాయి. బ్యారన్‌‌కు వడ్డీలేని రుణం రూ.50 వేలు ఇచ్చేలా, ధర లోటు భర్తీ కోసం కిలోకు రూ.20 బోనస్‌ ‌ప్రకటించాయి. ఈ ప్రకటన కూడా రైతులు జాతీయరహదారి దిగ్బంధన రోజున ఇచ్చారు. ఈ చర్యలపై రైతులు లాభం లేదని తేల్చారు. జాతీయ రహదారుల దిగ్బంధనం కొనసాగింది. ప్రభుత్వం తరుపున సిఎం మొదలు ప్రకాశం జిల్లా ఇద్దరు మంత్రులు సహా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవసభలో పాల్గొన్నారు. పొగాకు సంక్షోభంపై దృష్టి తగ్గింది. ఇప్పుడు మళ్లీ రైతులు రోడ్లెక్కుతున్నారు. తక్షణం రూ.వెయ్యి కోట్లు కేటాయించి సమాఖ్య, ఎస్టీసీలను రంగంలోకి దించి కొనుగోళ్లు చేపట్టాలన్నదే ఏకైక డిమాండ్‌. దీని కోసం ఆందోళన యథాతధంగా కొనసాగిస్తామని సంయుక్త కిసాన్‌‌ మోర్చా నేతలు ప్రకటించారు. ఇక కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. పొగాకు బోర్డు వద్ద రూ.750 కోట్లు రైతుల డబ్బులే ఉన్నాయి. వాటిని కొంత కేటాయించాలని కోరినా ప్రభుత్వ స్పందన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తరుపున తీసుకున్న చర్యలు పొగాకు మార్కెట్‌ ‌సంక్షోభానికి పరిష్కారం చూపలేదని సిఎం చంద్రబాబు, మంత్రులు గుర్తించాలి. పరిష్కారానికి రైతులు, రైతుసంఘాలు ఏం కోరుతున్నాయో ఆ ప్రకారం పొగాకు కొనుగోలుకు నిధులు కేటాయింపుపై దృష్టి సారించాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్