బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపప్పు పంటలకు ప్రోత్సాహకాలేవి ?

19 గంటల క్రితం

im3456ages.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 05:04 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రభుత్వాన్ని నిలదీసిన వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటీ

  • విధానాలు సరిగా లేకుంటే ఫలితాలు రావని వ్యాఖ్య

  • ఇథనాల్ ఉత్పత్తికి మిగులు బియ్యం ఇవ్వడంపై అభ్యంతరం

  • కూరగాయలు, పండ్ల పంటలకు భిన్నమైన విధానాలు అవసరమని సూచన

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఈ నెల 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన ‘కిసాన్ తక్ భారత్ వ్యవసాయ సదస్సు’లో ప్రసంగించిన పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశంలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ లక్షల టన్నుల పప్పు ధాన్యాలను ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటీ ప్రశ్నించారు. వరి సాగుకు కేటాయించిన పొలాల్లో రైతులు పప్పు ధాన్యాలను ఎందుకు పండించడం లేదని ఆయన అడిగారు. మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ధాన్యం ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారుగా ఉన్నదని, అయినా ప్రతి సంవత్సరం ఐదు లేక ఆరు మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. ప్రభుత్వ వ్యవసాయ విధానాలు వరి, చెరకు పంటలకే అనుకూలంగా ఉన్నాయని, ఎరువుల రాయితీలలో అధిక భాగం ఆ పంటలకే వెళుతోందని తెలిపారు.

విద్యుత్, ఎరువులు ఆదా అవుతాయి

వాస్తవానికి పప్పు ధాన్యాల పంటలు నత్రజనిని స్థిరీకరిస్తాయి. వీటికి ఎరువుల అవసరం పెద్దగా ఉండదు. పప్పు ధాన్యాల పంటలను పండించే రైతులకు హెక్టారుకు రూ.35,000 ప్రోత్సాహకం అందించాలని గులాటీ కోరారు. పప్పు పంటల సాగుతో విద్యుత్, ఎరువులను ఆదా చేయవచ్చునని, మూడేళ్ల వ్యవధిలో ఆ ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించేలా చేయవచ్చునని అన్నారు. విధానాలే ముఖ్యమని, అవి లేకుంటే మంచి ఫలితాలు రావని చెప్పారు. దేశం ఇప్పటికే అదనపు ధాన్యం నిల్వలతో ఇబ్బంది పడుతుంటే మిగులు బియ్యాన్ని ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు. ఇది ఆర్థికంగా ఏ మాత్రం అర్థవంతం కాదని తెలిపారు. లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి రెండున్నర నుంచి మూడు కిలోల బియ్యం అవసరమని, దీనికి ఎఫ్‌సిఐకి సుమారు రూ.150 ఖర్చవుతుందని, ఇథనాల్ ధర దాదాపు రూ.70గా ఉన్నదని వివరించారు. రూ.70 ఖరీదు చేసే ఇథనాల్ కోసం రూ.150 విలువైన బియ్యాన్ని అందజేస్తున్నారని విమర్శించారు.

విజయవంతమైన ప్రత్యామ్నాయంగా పాలు

అధిక ఉత్పత్తి ఎప్పుడూ రైతులకు అధిక ఆదాయాన్ని అందించదని గులాటీ చెప్పారు. ఇందుకు ఉదాహరణగా ఆయన టమాటా ధరల్లో హెచ్చుతగ్గులను ప్రస్తావించారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే పప్పు ధాన్యాలు, వంట నూనెల మాదిరిగా కాకుండా టమాటాలు, ఇతర పాడై పోయే ఉత్పత్తుల కోసం భిన్నమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు. కూరగాయలు, పండ్ల విషయంలో వినియోగదారులు పెట్టే డబ్బులో రైతులకు మూడో వంతు లేదా నాలుగో వంతు మాత్రమే లభిస్తోందని తెలిపారు. పాలు ఓ విజయవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయని అన్నారు. పాల రైతులకు వినియోగదారులు చెల్లించే సొమ్ములో 75 - 80 శాతం చేరుతోందని చెప్పారు. భారతదేశపు శ్వేత విప్లవ రూపశిల్పి, అమూల్ వెనుక ఉన్న సహకార ఉద్యమ నేత వర్గీస్ కురియన్ అవసరం దేశానికి ఎంతో ఉన్నదని గులాటీ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్