ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వెలుగులోకి తీసుకువచ్చిన అంశాల్లో ఐటీ వ్యవస్థ కీలక అంశంగా మారింది. ఓటర్ల జాబితా తయారీ, పేర్ల చేర్పు, తొలగింపు, అభ్యంతరాల పరిశీలన వంటి ప్రక్రియలు ఇప్పుడు ఇఆర్‌ఓ నెట్, ఇసిఐ నెట్ వంటి సాఫ్ట్‌వేర్ వ్యవస్థల ద్వారా జరుగుతున్నాయి. . 2025 నవంబర్ 4న సంధూ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సంజయ్ కుమార్ ఐటీ విభాగానికి రాసిన లేఖలో ఇఆర్‌ఓ, డిఇఓ,సిఇఓలకు చట్టం అప్పగించిన విధులను వారే స్వతంత్రంగా నిర్వహించేలా సాఫ్ట్‌వేర్ ఉండాలని పేర్కొన్నారు. ఐటి వ్యవస్థ చట్టబద్ధ అధికారుల నిర్ణయాధికారాన్ని పరిమితం చేయకూడదని స్పష్టం చేశారు. 2026 జనవరి 2న కూడా ఇదే అంశంపై మరోసారి లేఖ వెళ్లింది. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ( ఇఆర్‌ఓ) తన చట్టబద్ధమైన అధికారాలను ఉపయోగించడంలో సాఫ్ట్‌వేర్ ఎలాంటి పరిమితి విధించకుండా చూడాలని ఐటీ విభాగాన్ని కోరారు. ఆ తర్వాత జనవరి 22న ఇసిఐనెట్ ప్రారంభమైంది.
ఇసిఐనెట్ అంటే ఏమిటి ?
ఇసిఐనెట్‌ను ఎన్నికల సంఘం కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా రూపొందించింది. 40కి పైగా పాత యాప్స్, వెబ్ పోర్టల్స్‌ను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం దీని ఉద్దేశం. ఓటర్లు, బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీలు తదితరులు ఎన్నికలకు సంబంధించిన వివిధ సేవలను ఒకే డిజిటల్ వేదిక ద్వారా ఉపయోగించుకునేలా దీనిని రూపొందించారు. ఈ వ్యవస్థ ప్రారంభమైన కొద్ది నెలలకే ఏప్రిల్ 16న సుఖ్‌బీర్ సింగ్ సంధూ ఐటీ విభాగం పనితీరుపై అభ్యంతరం నమోదు చేశారు. గత కొన్ని నెలల్లో ఐటీ విభాగం అనేక కొత్త మాడ్యూల్స్, పోర్టల్స్ అభివృద్ధి చేసిందని, అయితే వాటి గురించి తనకు లేదా పూర్తి కమిషన్‌కు ముందుగా తెలియజేయలేదని ఆయన పేర్కొన్నారు. కొత్తగా అభివృద్ధి చేసిన వ్యవస్థల గురించి తనకు మీడియా ద్వారా మాత్రమే సమాచారం అందిందని ఆయన రికార్డులో పేర్కొన్నారు. ఐటీ విభాగం చేపట్టే కొత్త కార్యకలాపాలపై కమిషన్‌లోని సభ్యులందరికీ సమాచారం ఇవ్వాలని, అవసరమైన అన్ని ఆమోదాలు తీసుకున్న తర్వాతే వాటిని అమలు చేయాలని ఆయన కోరారు. దీంత, ఓటర్ల జాబితా నిర్వహణకు సంబంధించిన కొత్త సాఫ్ట్‌వేర్ మాడ్యూల్స్ ఎవరి నిర్ణయంతో రూపొందుతున్నాయి, వాటి విధానాలు ఎవరూ పరిశీలిస్తున్నారు అన్నది ప్రశ్నగా మారింది. ఇదే ప్రశ్నను మే 29న వివేక్ జోషి మరింత స్పష్టంగా లేవనెత్తారు. ఓటర్ల జాబితా డేటాబేస్ క్రమంగా కేంద్రీకృతమవుతోందన్న ఆందోళనను ఆయన నమోదు చేశారు. ఓటర్ల డేటాబేస్‌లో మార్పులు చేసే ఆధారాలు, లాగిన్ హక్కులు కేవలం చట్టబద్ధమైన అధికారుల వద్దే ఉన్నాయా లేదా అన్నది తనిఖీ చేయడానికి స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం ఐఐటీ వంటి సంస్థలకు చెందిన బాహ్య నిపుణుడితో పరిశీలన చేయించాలన్న ప్రతిపాదనను కూడా ఆయన ముందుకు తెచ్చారు. జూలై 13న మరో కమిషనర్: సంధూ కూడా జోషి ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ఈ ప్రతిపాదన వ్యవస్థను మెరుగుపరుస్తుందని, దాన్ని కమిషన్ ముందుకు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.అయితే ఆ తర్వాత ఆ రెండు ప్రతిపాదనలపై ఏ చర్య తీసుకున్నారో తనకు తెలియదని ఆగస్టు 14న సంధూ మరోసారి రికార్డులో పేర్కొన్నారు.
అసలు వివాదం ఇఆర్‌ఓ అధికారాలపైనే
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు. ఓటర్ల జాబితాలో పేరు చేర్చడం, తొలగించడం, అభ్యంతరాలు స్వీకరించడం, వాటిపై నిర్ణయం తీసుకోవడం వంటి బాధ్యతలు చట్టం ప్రకారం EROకు ఉన్నాయి. అయితే సాఫ్ట్‌వేర్‌లో ఒక ఆప్షన్ అందుబాటులో లేకపోతే ఆ నిర్ణయాన్ని సాఫ్ట్‌వేర్‌లో అమలు చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఇదే అంశంపై సంధూ, జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సంధూ, జోషి అభ్యంతరాల ప్రకారం కొన్ని సందర్భాల్లో ఫీల్డ్ స్థాయిలోని అధికారులు తమ చట్టబద్ధమైన విధులు నిర్వహించడానికి అవసరమైన సిస్టమ్ యాక్సెస్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల డేటాబేస్ నియంత్రణ క్రమంగా ఢిల్లీ కేంద్రానికి కేంద్రీకృతమవుతోందన్న ఆందోళనను వారు వ్యక్తం చేశారు.
జూలై చివర్లో...
జూలై 28న ఐటీ విభాగంపై ఉన్న పర్యవేక్షణ వ్యవస్థలో మార్పులు జరిగాయి. అప్పటి వరకు సీనియర్ అధికారి సంజయ్ కుమార్ ఐటీ విభాగం పనిని పర్యవేక్షిస్తూ, సంబంధిత ఫైళ్లను ముగ్గురు సభ్యులున్న కమిషన్‌కు పంపే వ్యవస్థలో భాగంగా ఉన్నారు. ఈ పర్యవేక్షణ స్థాయి తొలగించబడటం ఐటి వ్యవస్థపై ఉన్న అంతర్గత ఆందోళనను మరింత పెంచింది. ఆ తర్వాత సంధూ, జోషి ఇద్దరూ జూలై 29న కేంద్ర కేబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. పని విభజనలో జరిగిన మార్పులు ఐటీ విభాగంపై పర్యవేక్షణను, నిర్ణయాధికార కేంద్రీకరణను ప్రభావితం చేస్తున్నాయని వారు పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)