- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్
వ్యక్తిత్వాన్ని కించపరచినప్పుడు, కుటుంబ సభ్యులను అగౌరపరచినప్పుడు బాధ కలగడం ఎవరికైనా సహజం. ప్రధానమంత్రికి కూడా అలాంటి బాధే కలిగింది! విద్యార్థులు తనపై చేసిన విమర్శలు బాధ పెట్టాయని, అయినా వారందరూ మన పిల్లలే, అందుకే క్షమించేస్తున్నానని సోషల్ మీడియా వేదికగా మూడు నిమిషాల వీడియోను ప్రధాని విడుదల చేశారు. నపకారికి నుపకారం సేయువాడే నేర్పరి సుమతీ అన్నట్లుగా ఆయన స్పందనను కొందరు కీర్తిస్తున్నారు. మన ఉప ముఖ్యమంత్రి ప్రధానికంటే ఎక్కువ బాధపడిపోయారు. విమర్శించిన వారిని క్షమించిన ప్రధాని పాదాలకు నమస్కారాలు చేస్తానన్నారు. లాఠీల దెబ్బలకు తలలు, కాల్లు, చేతులు విరిగినవారిని ప్రధాని క్షమించడమేమిటి! ఉద్యమంలో పాల్గొన్న అమ్మాయిలను, వారి తల్లిదండ్రులను దారుణంగా మాట్లాడినప్పుడు కూడా ప్రధాని ఇలాగే స్పందించి వుంటే హుందాగా వుండేది. ఉద్యమంలో విచ్ఛిన్నకరశక్తులు వున్నాయని రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ కూడా క్షమాపణ చెప్పివుంటే ఆయన గౌరవానికి భంగం వుండేదికాదు.
22 లక్షల విద్యార్థుల జీవితాలతో, వారి ఆశలతో, తల్లిదండ్రుల డబ్బుతో మిళితమైన నీట్ ప్రశ్నాపత్రం లీకేజికి కారణమైంది కేంద్ర ప్రభుత్వం. 22 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాల్సింది కేంద్ర విద్యాశాఖ మంత్రి. న్యాయం కోరిన విద్యార్థులపై దారుణ లాఠీచార్జీకి కారణమైంది కేంద్ర హొంశాఖ మంత్రి. వీరందరి నాయకుడు ప్రధాని. సకాలంలో స్పందించి చర్యలు తీసుకుని వుంటే ప్రధాని ఇంత ఆవేదన చెందాల్సిన అవసరమే వుండేదికాదు. పాలకులు వారి బాధ్యతను గుర్తించలేదు కాబట్టే విద్యార్థులు ఢిల్లీలో 35 రోజులు ఉద్యమించారు. సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష దేశవ్యాప్తంగా విద్యార్థులను కదిలించింది. కేంద్ర పాలకుల వాట్సప్ బ్యాచ్‌లకు అలవాటైన విద్య ప్రకారం విద్యార్థులను కించపరుస్తూ, నిందారోపణలు చేస్తూ దుష్ప్రచారం చేశారు. ప్రధాన మీడియా ఈ ఉద్యమాన్ని తేలికచేయడానికి సకల ప్రయత్నాలు చేసింది. కానీ 10 సంవత్సరాల్లో 52 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజి కావడం, అందులో బిజెపి నాయకులు, వారి కుటుంబసభ్యులు వుండడం విద్యార్థులను తీవ్రంగా కలచివేసింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యార్థుల మీద వారి సంఘాల మీద, విశ్వవిద్యాలయాలపై అనేక రూపాల్లో దాడులు చేస్తుండడం కూడా వారి ఆగ్రహానికి మరో కారణమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్య ఈ తరం యువతను కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేసింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమంపై జులై 20న అమానుష లాఠీచార్జీతో జంతర్ మంతర్ రోడ్లు రక్తంతో తడిచినప్పుడైన ప్రధాని స్పందించలేదు. విద్యార్థుల తలలు, చేతులు, కాల్లు విరిగి రోదిస్తున్నా మౌనం వీడలేదు. అమ్మాయిలపై అసభ్యంగా లాఠీలతో పొడిచిన దృశ్యాలను చూసైనా మనస్సు బాధపడలేదు. ఢిల్లీ పోలీసు బాసు కొట్టిన దెబ్బకు అమ్మాయి కర్ణబేరి పగిలిపోయినప్పుడైనా ప్రధానికి ఆ బాధ వినిపించలేదు. పెల్లెట్ గన్స్ ఉపయోగించడంతో చూపు కోల్పోయిన యువత గురించీ పట్టలేదు. ఉద్యమానికి వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తున్న వారిని అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నప్పుడైనా ప్రధానిలో మానవత్వం చలించలేదు. ఆవేశానికి గురైన విద్యార్థులు వారికి తోచిన రీతిలో ప్రభుత్వానికి నిరసనను వినిపించారు. అందులో నొయిడాకు చెందిన 15 ఏళ్ల అమ్మాయి రుచికా సింగ్ కూడా వుంది. ప్రధానిపై అభ్యంతరకర విమర్శ చేయడాన్ని సమర్థించలేము. కానీ ఆ పరిస్థితికి కారణం ఎవరు? బిజెపి అనుకూల ఓటర్ల కుటుంబాల నుండి, చివరికి వారి పార్టీ నాయకుల పిల్లలు ఉద్యమంలో పాల్గొంటున్నా ప్రభుత్వ ధోరణిలో మార్పురాలేదు. ‘కొన్నిసార్లు మన నాలుక పళ్ల మధ్య ఇరుక్కుని గాయమై రక్తం వచ్చినా, మనం పళ్లను ఇరగొట్టము, ఎందుకంటే పళ్లు, నాలుక రెండు మనవే కాబట్టి, ఈ పిల్లలు కూడా మనవారే’ అన్నారు. ఇందులో నాలుక విద్యార్థులు అని రుజువైంది, మరి గాయం చేసిన పళ్లు ఎవరివి అనేదే ప్రశ్న?
విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న అమ్మాయిలను, ‘వారి తల్లులు ఎవరికి కన్నారో’ అని బిజెపి నాయకురాలు, బాలివుడ్ నటి కంగనా రనౌత్ అత్యంత నీచంగా మాట్లాడినప్పుడు ప్రధాని మాట్లాడలేదు. ఆ తల్లులు ఎంత బాధపడివుంటారో మోడీ గారు ఆలోచించారా? జంతర్ మంతర్‌లో కండోమ్స్ పెరిగిపోతున్నాయంటూ మీ సోషల్ మీడియా పిశాచాలు నీచంగా ప్రచారం చేసారే ఆ పిల్లల మనసు కూడా మీలాగే వేదనకు గురైవుంటుంది కదా? ఇలాంటి ఉద్యమాల్లో పిల్లలు పాల్గొంటున్నారంటే వారికి సంస్కారం, సంస్కృతి నేర్పడంలో వారి తల్లిదండ్రులు విఫలమవుతున్నట్లే అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌తో సహా అనేకమంది అంటుంటే ఒక్క మాటైనా ఆ తల్లిదండ్రుల పక్షాన ప్రధాని మాట్లాడలేదే? ‘ఢిల్లీలో లాఠీ చార్జీనే జరిగింది, అమెరికాలో అయితే కాల్చి చంపేవారు, ‘నా దగ్గర గన్ వుంటే విద్యార్థులను కాల్చి చంపేవాడినని’ బిజెపి ఎంపీలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే కనీసం మందలించలేదు. మీరు క్షమించానని చెబుతున్న ఆ అమ్మాయిని పోలీసులు, మీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులు వేధిస్తున్న విషయం మీకు తెలియదు అనుకోవాలా? విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించు కుంటామని హామీ ఇచ్చి, 2,873 మందిని క్రిమినల్స్‌గా ప్రచారం చేస్తున్నవారు ప్రధాని అనుకూల మీడియా కాదా?
పాలకులకు మాత్రమే మనసు, తల్లి వుండదు, పాలితులకు కూడా వుంటుందని గుర్తించివుంటే బిల్కిస్‌బానో నిందితులకు క్షమాభిక్ష పెట్టినప్పుడు, మణిపూర్‌లో స్త్రీలను వివస్త్రలను చేసి ఊరేగించినప్పుడు, మహిళ రెజిలర్స్‌ను అధికార పార్టీ ఎంపీ వేధించినప్పుడు, ఉన్నావో, హత్రాస్, కతువా అత్యాచార నిందితులను సన్మానించినప్పుడు స్పందించి వుండేవారు.








కామెంట్‌లు (0)