టికెట్ ధరలపై సంస్థ పట్టుకోల్పోయే ప్రమాదం
వెట్ లీజుతో డ్రైవర్ల ఉపాధి ప్రశ్నార్థకం
సర్వీసు నిబంధనలపైనా ప్రభావం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించిన గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జిసిసి) పద్ధతి అనేది ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేయనుంది. టికెట్ ధరలపై సంస్థ పట్టుకోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రయాణికులపై పెనుభారం పడుతుంది. ఇది అంతిమంగా ప్రజా రవాణా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఆర్‌టిసి ఆస్తులు పోయి.. ఉద్యోగాలూ పోయి ప్రజలపై భారం పడటం తప్ప ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిసిసి పద్ధతిలో ఆర్‌టిసి సంస్థ.. ప్రైవేటు బస్సులను కిలోమీటర్ల లెక్కన లీజుకు తీసుకోనుంది. ఈ విధానంలో బస్సుల యాజమాన్యం, నిర్వహణ, డిపోలలో మెయింటైన్ చేయడం (ఛార్జింగ్ మౌలిక వసతులు, బ్యాటరీల నిర్వహణ వంటివి) ప్రైవేట్ ఆపరేటర్లే నిర్వహిస్తారు. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఆర్‌టిసి చేసి పెడుతుంది. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న కొన్ని బస్సుల్లో డ్రైవర్లను కూడా ప్రైవేట్ సంస్థే తీసుకుంటుంది. ప్రైవేటుకు అప్పగించిన డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు అక్కడ సంస్థకు చెందిన బస్సులను తీసుకుని వేరే డిపోకు వెళ్లిపోవడమే. అలాగే ఆర్‌టిసి సంస్థ బస్సుల్లో కండక్టర్లను నియమించడం, రూట్లను కేటాయించడం, టికెట్ ధరలను నిర్ణయించడం, కలెక్షన్ బాధ్యతలు చూసుకుంటుంది. ఇందులో ప్రైవేట్ సంస్థ నడిపే ప్రతి కిలోమీటర్‌కు బస్సుకు రూ.72.55 పైసలు ఇస్తుంది. ఆర్‌టిసికి ఇప్పటి వరకూ వస్తున్న ఆదాయపు లెక్కలను ఇప్పుడున్న ధరల ప్రకారంగా లెక్కలేస్తే స్ర్తీశక్తి పథకం అమలు తరువాత కిలోమీటరుకు రూ.50 వరకూ వస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రం రూ.72.55 పైసలు చెల్లించడం అంటే అదనంగా రూ.22.55 పైసలు ఆర్‌టిసిపై భారం పడుతుంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో కిలోమీటరుకు రూ.0.50 పైసలు అదనంగా పడ్డా భరించలేని స్థితిలో సంస్థ ఉంది. మరి అదనపు ఖర్చు ఎక్కడ నుండి తీసుకొచ్చి చెల్లిస్తారనేది ఒక ప్రశ్నగా ఉంది. మరోవైపు బస్సుల కొనుగోలుపై కేంద్రం ఇచ్చే సబ్సిడీ ప్రైవేటు ఆపరేటరుకు వెళుతుంది. అంటే ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు అయినా పెంచాలి.. లేదా ఆర్‌టిసి అయినా నష్టపోవాలి. పరోక్షంగా ప్రజలపై భారం వేయక తప్పని పరిస్థితి వస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులను రాబోయే కాలంలో 5 వేల వరకూ పెంచాలనేది ఒప్పందంలో భాగంగా ఉంది. ఇప్పుడు 1,050 బస్సులు ఏర్పాటు చేస్తే వాటిల్లో 300 తిరుపతికి కేటాయించారు. ఇవి కాకుండా క్రమంగా బస్సుల సంఖ్యను పెంచుకుంటూ వెళతారు. ఇలా వెళ్లేకొద్దీ ఆర్‌టిసిపై నిర్వహణ భారం పెరుగుతుంది. దీన్ని అంతిమంగా టికెట్ ధరను పెంచి ప్రజల నుండి వసూలు చేస్తారు. ఒప్పందం ప్రకారం ధరలు పెంచుకుంటూ పోతే భవిష్యత్లో టికెట్ ధరలపై ఆర్‌టిసి పట్టుకోల్పోయే ప్రమాదమూ ఉంది. దీని ప్రభావం 55 వేలకు పైగా ఆర్‌టిసి సిబ్బంది భవిష్యత్తుపై పడనుంది. అసలు సంస్థకు బస్సులిస్తే ఇబ్బంది లేదని, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి నిర్వహించాలని చెప్పడం అంటే క్రమంగా ఆర్‌టిసిని ప్రైవేటీకరించే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.








కామెంట్‌లు (0)