- వెంకట రాహుల్ అజేయ శతకం
- రేవంత్ తృటిలో సెంచరీ మిస్
- రషీద్ అర్ధసెంచరీ కర్ణాటకతో రంజీట్రోఫీ మ్యాచ్
ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ (విజయవాడ) : ఆంధ్ర–కర్ణాటక జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రెండో రోజు ఆంధ్ర బ్యాటర్లు ఆకట్టుకున్నారు. సమష్టి ప్రదర్శనతో కర్ణాటక బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఆంధ్ర జట్టు, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 331 పరుగులు సాధించింది. ఎస్‌వి రాహుల్ అద్భుత సెంచరీతో రాణించగా, రేవంత్ రెడ్డి కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు విలువైన పరుగులు అందించారు. ఆంధ్ర బ్యాటర్ ఎస్‌వి రాహుల్ 187 బంతుల్లో పది ఫోర్ల సాయంతో 108 పరుగులు సాధించి శతకంతో మెరిశారు. మరోవైపు రేవంత్ రెడ్డి 143 బంతుల్లో 13 ఫోర్లతో 97 పరుగులు చేసి సెంచరీకి కేవలం మూ డు పరుగుల దూరంలో నిలిచారు. ఇద్దరూ క్రీజులో నిలదొక్కుకుని బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో ఆంధ్ర ఇన్నింగ్స్‌కు బలమైన పునాది పడింది.
కర్ణాటక బౌలర్లలో శిఖర్ శెట్టి మూడు వికెట్లు పడగొట్టగా, మాధవ్ బజాజ్ రెండు వికెట్లు, రితేష్ బతకల్ ఒక వికెట్ సాధించారు. ఆంధ్ర బ్యాటర్లను కట్టడి చేసేందుకు కర్ణాటక బౌలర్లు ప్రయత్నించినప్పటికీ, ఆంధ్ర బ్యాటర్లు కీలక భాగస్వామ్యాలతో జట్టు స్కోరును 300 పరుగుల మార్కును దాటించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 331 పరుగులతో ఆంధ్ర జట్టు పోటీలో పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో మూడో రోజు ఆట మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక దశగా మారనుంది. ఆంధ్ర బ్యాటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారా, కర్ణాటక బౌలర్లు తిరిగి పుంజుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మూలపాడు వేదికగా సాగుతున్న రంజీ పోరులో మూడో రోజు ఆటపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.







కామెంట్‌లు (0)