ఎసిసి ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ ఫైనల్‌కు శ్రీలంక-ఎ
దోహా: ఎసిసి ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ క్రికెట్ టోర్నీలో ఇండియా-ఎ సెమీస్‌లో ఓటమిపాలైంది. కీలక సెమీఫైనల్లో శ్రీలంక-ఎ 8 వికెట్ల తేడాతో ఇండియా-ఎపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(78), కెప్టెన్ తిలక్ వర్మ(53), షాబాజ్ అహ్మద్(54) అర్ధసెంచరీలతో రాణించారు. యుఎఇపై సంచలన ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(40; 27బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. తొలి వికెట్‌కు వైభవ్-అభిషేక్ 8 ఓవర్లలో 80 పరుగులు చేసి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత అభిషేక్-తిలక్ వర్మ 59 పరుగులు జతచేయడంతో టీమిండియా ఒక దశలో 400కు పైగా పరుగులు చేసేలా కనిపించింది. ఆ తర్వాత కుమార్ కుషాగ్రా(21), రింకూ సింగ్(12), సూర్యాంశ్ షేడ్గే(10), తనుశ్ కోటియన్(28), హర్ష్ దూబే(8నాటౌట్) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 317పరుగులకే పరిమితమైంది. శ్రీలంక-ఎ బౌలర్లు ఫెర్నాండో, లియనాగే, ధనంజయకు రెండేసి, సంకేత్, సమరకూన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. అనంతరం శ్రీలంక ఓపెనర్లు సినెత్ జయవర్దెనా(105; 70బంతుల్లో 10ఫోర్లు, 6సిక్సర్లు), లసిత్ క్రూస్‌పుల్లే (116; 107బంతుల్లో 12ఫోర్లు, 3సిక్సర్లు) ధాటిగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 21.3ఓవర్లలో 174పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి లంకను గెలుపు తీరాలకు చేర్చారు. దీంతో శ్రీలంక 41.3ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జయవర్ధనకు లభించింది. నేడు పాకిస్తాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
స్కోర్లు(సంక్షిప్తంగా)...
ఇండియా-ఎ : అభిషేక్(78), షాబాజ్(54) తిలక్ వర్మ(53); లియనాగే(2/37), ధనంజయ(2/41)
శ్రీలంక-ఎ : లసిత్(116), జయవర్ధన(105); హర్షిత్(1/61).








కామెంట్‌లు (0)