నేడు ఇంగ్లండ్‌తో తొలి వన్డే
మధ్యాహ్నం 3.30గం.ల నుంచి
బర్మింగ్‌హామ్ : ఇంగ్లండ్ గడ్డపై టి20 సిరీస్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ(రో), విరాట్ కోహ్లి(కో) రాకతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలోపేతమైంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మంగళవారం తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్టులు, టి0 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే జట్టుతో కలిశారు. వీరిద్దరితోపాటు సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ రాకతో టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనబడుతోంది. 39 ఏళ్ల రోహిత్, 38 ఏళ్ల కోహ్లికి 2027 వన్డే ప్రపంచకప్ టీమిండియాలో చోటే లక్ష్యంగా ఈ మెగా టోర్నీకి సిద్ధమయ్యారు.
ఇక ఇంగ్లండ్ విషయానికొస్తే.. టి20 సిరీస్‌లో రాణించిన జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌లు తమ బౌలింగ్‌తో టీమిండియా బ్యాటర్లను బెంబెలెత్తించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ వన్డే ఫార్మాట్‌లో కోహ్లి, రోహిత్ వంటి అనుభవజ్ఞులు రాకతో వీరు ఏవిధంగా రాణిస్తారో వేచిచూడాల్సి ఉంది. బ్యాటింగ్‌లో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌తో పాటు కేఎల్ రాహుల్ కీలకంగా మారనున్నారు. ఆల్‌రౌండ్ విభాగంలో అక్షర్‌పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లు ఉన్నప్పటికీ వీరిలో ఇద్దరికి మాత్రమే అవకాశం రానుంది. ఇక బౌలింగ్ విభాగాన్ని జస్‌ప్రీత్ బుమ్రా నడిపించనుండగా.. టీ20 సిరీస్‌లో విఫలమైనప్పటికీ అర్ష్‌దీప్‌కు మరో చాన్స్ దక్కవచ్చు. స్పిన్నర్ కోటాలో కుల్దీప్ ఉండనే ఉన్నాడు. పేసర్ల కోటాలో ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్‌లలో ఒకరికి అవకాశం ఖాయం. కర్డీఫ్‌లో 16న రెండో వన్డే, లార్డ్స్‌లో 19న మూడో వన్డే జరగనున్నాయి.
జట్లు(అంచనా)...
ఇండియా: శుబ్‌మన్(కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), దూబే, అక్షర్, బుమ్రా, అర్ష్‌దీప్, కుల్దీప్, ప్రసిధ్ క్రిష్ణ/ గుర్నూర్ బ్రార్.
ఇంగ్లండ్: బ్రూక్(కెప్టెన్), బట్లర్(వికెట్ కీపర్), బేథెల్, డకెట్, రూట్, సామ్ కర్రన్, విల్ జాక్స్, ఆర్చర్, డాసన్, టంగ్, ఆదిల్ రషీద్.








కామెంట్‌లు (0)