- టీమిండియా లక్ష్యం 388పరుగులు
లండన్: లార్డ్స్ స్టేడియంలో పరుగుల వరద పారింది. భారత బౌలర్లే లక్ష్యంగా ఇంగ్లండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. వన్డేలో ఈ మైదానంలో ఇదే అత్యధిక స్కోర్. ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెథెల్ తొలి వికెట్‌కు 192 పరుగులు జోడించి అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. జాకబ్ బెథెల్ 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత బెన్ డకెట్ అద్భుతంగా ఆడి 135 బంతుల్లోనే 141 పరుగులు చేసి టీమిండియాను కష్టాల్లోకి నెట్టేశాడు. జో రూట్ అజేయంగా 74 పరుగులు చేయగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ 14 పరుగులకు ఔటయ్యాడు. జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణకు రెండు, ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ దక్కాయి. టీమిండియా పేస్ గుర్రం జస్పీత్ బుమ్రా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఛేదనలో భాగంగా భారతజట్టు 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టపోయి 265 పరుగులు చేసింది. రోహిత్(138), గిల్(77) ఔటయ్యారు.
గుర్నూర్ బ్రార్‌కు చేదు జ్ఞాపకం..
ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి భారత బౌలర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా యువ బౌలర్ గుర్నూర్ బ్రార్ తన 10 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకుని వికెట్లేమీ తీయలేకపోయాడు. లార్డ్స్ మైదానంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా బ్రార్ నిలిచాడు. మరో బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ సైతం 72 పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ రాణించి 6.90 ఎకానమీతో 2 వికెట్లు తీసినా.. ఇంగ్లాండ్ పరుగుల వరదను మాత్రం అడ్డుకోలేకపోయాడు.
లార్డ్స్ మైదానంలో అత్యధిక వన్డే స్కోర్లు ఇవే:
1. ఇంగ్లాండ్-387/3; భారత్ (2026)
2. ఇంగ్లాండ్-334/4; భారత్ (1975)
3. దక్షిణాఫ్రికా-330/8; ఇంగ్లాండ్ (2025)








కామెంట్‌లు (0)