- అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్
- నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లో ఫైనల్ మ్యాచ్
దుబాయ్: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 2027 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 14 జట్లు 12 వేదికల్లో 57 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
భారత్ గ్రూప్-ఎలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, జింబాబ్వే, క్వాలిఫయర్-ఎ జట్లతో కలిసి ఉంది. గ్రూప్ దశలో భారత్ ఆడే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
అక్టోబర్ 7: భారత్ × ఆస్ట్రేలియా — కేప్‌టౌన్
అక్టోబర్ 10: భారత్ × పాకిస్థాన్ — జోహన్నెస్‌బర్గ్
అక్టోబర్ 14: భారత్ × అఫ్గానిస్థాన్ — ట్ష్వానే
అక్టోబర్ 17: భారత్ × క్వాలిఫయర్-ఎ — బ్లూమ్‌ఫోంటైన్
అక్టోబర్ 24: భారత్ × జింబాబ్వే — విక్టోరియా ఫాల్స్
టోర్నీ తొలుత నమీబియాలో మూడు మ్యాచ్‌ల సూపర్ సిరీస్‌తో ప్రారంభమవుతుంది. అనంతరం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్రతి గ్రూపులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు, రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్లలో మెరుగైన జట్టుతో కలిపి మొత్తం ఏడు జట్లు సూపర్-7 దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. సూపర్-7 దశ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 14 వరకు జరగనుంది. ఇందులో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. నవంబర్ 17న కేప్‌టౌన్‌లో తొలి సెమీఫైనల్, నవంబర్ 18న ట్ష్వానేలో రెండో సెమీఫైనల్ నిర్వహిస్తారు. నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మూడు దేశాల్లో జరిగే ఈ ప్రపంచకప్ కోసం ఇప్పటికే టికెట్ నమోదు ప్రక్రియను ఐసీసీ ప్రారంభించింది. ఆఫ్రికాలో 2003 తర్వాత తొలిసారిగా పురుషుల వన్డే ప్రపంచకప్ జరగనుండటం ఈ టోర్నీ ప్రత్యేకత.








కామెంట్లు (0)