- రెండో మ్యాచ్‌లో జింబాబ్వే మహిళలపై 9 వికెట్ల తేడాతో గెలుపు
రాయ్‌పూర్: జింబాబ్వేతో జరిగిన రెండో టి20లో మైదానంలో పదునైన బౌలింగ్, బ్యాటింగ్‌లో పరుగుల సునామీతో భారత మహిళల క్రికెట్ జట్టు 9 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే జట్టుకు భారత బౌలర్లు ఆదిలోనే చుక్కలు చూపిం చారు. నందిని శర్మ వేసిన అద్భుతమైన బంతికి కెలిస్ నధ్లోవు పరుగులేమీ చేయ కుండానే క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత క్రాంతి గౌడ్ బౌలింగ్‌లో దీప్తి పట్టిన అద్భు తమైన క్యాచ్‌కు షార్నే మేయర్స్ (9) పెవిలియన్ చేరింది. అయితే మధ్య వరుసలో చిపో ముగేరి-తిరిపానో (34), జోసెఫిన్ న్కోమో (27) పోరాడటంతో జింబాబ్వే జట్టు కోలుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో నికి ప్రసాద్ కేవలం 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీసింది.
షెఫాలీ, స్మృతి పరుగుల సునామీ
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొదటి ఓవర్ నుంచే బౌండరీల వర్షం కురిపిస్తూ పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు కేవలం 8 ఓవర్లలోనే 96 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షెఫాలీ వర్మ కేవలం 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి విధ్వంసం సృష్టించింది. చివర్లో బిజా బౌలింగ్‌లో ఆమె అవుటైనప్పటికీ, అప్పటికే భారత్ విజయం ఖాయమైంది. కెప్టెన్ స్మృతి మంధాన 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో భారత్ కేవలం 8.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 104 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది.








కామెంట్లు (0)