శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వీడియోకాన్‌ ధూత్‌ దివాలా....

2 గంటల క్రితం

వీడియోకాన్‌ ధూత్‌ దివాలా.. 
బ్యాంక్‌‌లకు రూ.12,668 కోట్ల ఎగవేత
ముంబయి ఎన్‌‌సిఎల్‌‌టి వెల్లడి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- బ్యాంక్‌‌లకు రూ.12,668 కోట్ల ఎగవేత

- ముంబయి ఎన్‌‌సిఎల్‌‌టి వెల్లడి

ముంబయి : వీడియోకాన్‌ గ్రూప్‌ మాజీ ప్రమోటర్‌, డైరెక్టర్‌ వేణుగోపాల్‌ నంద్‌లాల్‌ ధూత్‌ను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌‌టి) దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)కి చెల్లించాల్సిన రూ.12,668 కోట్ల రుణ బకాయిల వ్యవహారంలో ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం వెలువరించిన ఉత్తర్వుల్లో ధూత్‌ ఆస్తుల నిర్వహణ బాధ్యతను దివాలా ట్రస్టీ ఆశిష్‌ నారాయణ్‌కు అప్పగించింది. రుణదాతలకు చట్టప్రకారం ఆస్తుల నుంచి చెల్లింపులు జరిపే ప్రక్రియను చేపట్టాలని ఆదేశించింది. రుణాల చెల్లింపునకు ధూత్‌ ప్రతిపాదించిన కేవలం రూ.600 కోట్ల పరిష్కార ప్రణాళికను రుణదాతలు తిరస్కరించడంతో ఎన్‌‌సిఎల్‌‌టి జ్యుడీషియల్‌ సభ్యుడు వినయ్‌ గోయల్‌, టెక్నికల్‌ సభ్యుడు చరణ్‌జీత్‌ సింగ్‌ గులాటీలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌, వీడియోకాన్‌ టెలికమ్యూనికేషన్స్‌ సంస్థలు 2010, 2012 సంవత్సరాల్లో ఎస్‌బిఐ, దాని అనుబంధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ధూత్‌ వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఈ సంస్థలు రుణ చెల్లింపుల్లో విఫలమవడంతో 2018 జూన్‌లో కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ (సిఐఆర్‌‌పి) ప్రారంభమైంది. అనంతరం వీడియోకాన్‌ గ్రూప్‌నకు చెందిన మరో 12 సంస్థల దివాలా ప్రక్రియలతో ఎన్‌సిఎల్‌‌టి విలీనం చేసింది. అంతకుముందే 2018 ఫిబ్రవరిలో ఎస్‌బిఐ రుణ బకాయిల చెల్లింపునకు ధూత్‌కు డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2026 ఏప్రిల్‌లో ధూత్‌పై వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియను ఎస్‌బిఐ ప్రారంభించింది. రెండు నెలల తర్వాత ధూత్‌ రుణదాతలకు రూ.600 కోట్లు చెల్లించే ప్రతిపాదనను సమర్పించారు. సిలిగురిలో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా 36 నెలల్లో ఈ మొత్తాన్ని చెల్లిస్తామని అందులో పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదన మొత్తం బకాయిల్లో కేవలం 0.42 శాతానికే సమానమని ఎస్‌బిఐ పిటిషన్‌లో పేర్కొంది. దీంతో దివాలా పిటిషన్‌ను ఐబిసి–2016లోని సెక్షన్‌ 126 కింద విచారించిన ట్రిబ్యునల్‌ ధూత్‌ను దివాలాదారుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్