రూ.904 కోట్ల నిధుల మళ్లింపు..
ఫ్యూచర్ రిటైల్, రాకేశ్ బియానీలపైనా కేసు నమోదు
ఎస్‌బిఐ ఫిర్యాదుతో పలు చోట్ల సోదాలు
ముంబయి : బిగ్‌బజార్ మాతృసంస్థ ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ సంస్థ ప్రమోటర్ కిషోర్ బియానీ బ్యాంకు మోసాలపై సిబిఐ ఎట్టకేలకు కేసు నమోదు చేసింది. ఆయన సోదరుడు, సంస్థకు చెందిన మరో కీలక ప్రమోటర్ రాకేష్ బియానీతో పాటు సంస్థకు చెందిన ఇతర ప్రమోటర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, హామీదారుల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 4న కేసు నమోదు చేసిన సిబిఐ శుక్రవారం ముంబయిలో కిషోర్ బియానీకి సంబంధం ఉన్న పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో దర్యాప్తునకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. బ్యాంకు నుంచి నిర్దిష్ట ప్రయోజనాల కోసం మంజూరైన రుణ నిధులను వాటికి వినియోగించకుండా, అనుబంధ కంపెనీలు, సంబంధిత సంస్థల ద్వారా ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సిబిఐ, గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వ్యక్తులను కూడా కేసులో చేర్చింది. ఫ్యూచర్ రిటైల్ సంస్థ గతంలో బిగ్ బజార్, ఫ్యాషన్@బిగ్ బజార్, ఫుడ్‌హాల్ వంటి హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లను నిర్వహించింది.
తొమ్మిది బ్యాంకులకు కన్నం..
ఎస్‌బిఐ స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్‌మెంట్ బ్రాంచ్-3 ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఎస్‌బిఐతో పాటు తొమ్మిది బ్యాంకుల కన్సార్టియం నుంచి రుణాలు తీసుకుంది. అయితే బ్యాంకులు మంజూరు చేసిన రుణాలను అనుబంధ సంస్థలు, సంబంధిత ఇతర కంపెనీల ద్వారా నిధులను మళ్లించి బ్యాంకులకు రూ.904.32 కోట్ల మేర నష్టం కలిగించినట్లు ఎస్‌బిఐ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్ర, మోసంతో పాటు అవినీతి నిరోధక చట్టం కిందకు వచ్చే నేరాలపై కూడా కేసు నమోదు చేసినట్లు సిబిఐ తెలిపింది. రుణ నిధులు చివరకు ఎక్కడికి వెళ్లాయి? వాటి మళ్లింపులో ఎవరెవరి పాత్ర ఉంది? ప్రభుత్వ అధికారులు లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విచారణపై ఫ్యూచర్ రిటైల్ సంస్థ స్పందించాల్సి ఉంది.








కామెంట్‌లు (0)