నేడు థాయ్‌లాండ్ మహిళలతో ఢీ
రాత్రి 8.00గం.ల నుంచి
దుబాయ్: మహిళల ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్ భారతజట్టు తొలి పరీక్షను ఎదుర్కోనుంది. గ్రూప్-ఎలో ఉన్న భారత మహిళలజట్టు ఆదివారం జరిగే తొలి పోటీలో థాయ్‌లాండ్‌తో తలపడనుంది. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ జట్లు ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో మహిళల టి20 ఆసియా కప్‌లో భారత్ తమ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 2016-17 నుంచి జరిగిన ఐదు టోర్నమెంట్లలో మూడుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత మహిళల జట్టు ప్రదర్శన ఆందోళనకరంగా ఉంది. ఈ ఏడాది ఆడిన 16 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో తొమ్మిదింటిలో ఓడిపోయింది. మహిళల టి20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన తాజా ఓటమితో టీమిండియా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫామ్ లేమితో ఈ ఫార్మాట్‌లో ఆమె కొనసాగడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత మహిళల జట్టు ఆసియాకప్‌తోపాటు వచ్చే నెలలో జరిగే ఆసియా క్రీడల్లోనూ టైటిల్ కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేసియా, యూఏఈ జట్లున్నాయి. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పటిష్ట థాయ్ లాండ్ జట్టు 6పరుగుల తేడాతో హాంకాంగ్(చైనా)ను ఓడించింది. సెప్టెంబర్ 3న హాంకాంగ్‌తో, 5న పాకిస్తాన్‌తో తలపడనుంది. కనీసం రెండు మ్యాచుల్లో గెలిస్తేనే సెమీస్ బెర్త్ దక్కనుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెప్టెంబర్ 10న తొలి సెమీఫైనల్... సెప్టెంబర్ 11న రెండో సెమీఫైనల్...సెప్టెంబర్ 13న ఫైనల్ జరుగుతాయి.







కామెంట్‌లు (0)