mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

T20: సఫారీల చేతిలో మహిళల ఓటమి

1 రోజు క్రితం

team india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 12:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- టీ20 ప్రపంచకప్‌

- హర్మన్ ప్రీత్ కౌర్ 
మ‌రో అరుదైన రికార్డు

మాంచెస్టర్: ఇంగ్లండ్‌‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్‌ 2026లో భారత్‌ జట్టు తొలి ఓటమి చవిచూసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌‌పై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు 4 వికెట్లు కోల్పోయి ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు లారా వోల్వార్డ్ట్ (20), తజ్మిన్ బ్రిట్స్ (40) ఫరవాలేదని పించగా, నాలుగో స్థానంలో వచ్చిన మారిజెన్ కాప్ (81 నాటౌట్‌; 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. దీంతో సఫారీ జట్టు 161 పరుగులతో విజాయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో శ్రీ చరణి మూడు, షెఫాలి వర్మ ఒక వికెట్ తీశారు. ఆదివారం మ్యాచ్‌‌లో ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలి వర్మ (31; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్ స్కోరర్ గా నిలిచింది. దీప్తి శర్మ (29), హర్మన్‌ప్రీత్ కౌర్ (24), స్మృతి మంధాన (17), యాస్తికా భాటియా (15), రిచా ఘోష్ (15), జెమీమా రోడ్రిగ్స్ (12) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ 2, మారిజెన్ కాప్ 2, మ్లాబా, అయాబొంగా ఖాకా, నాడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ నెల 25న జరిగే తదుపరి మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌ ‌జట్టుతో భారత్‌ ‌ఢీకొంటుంది. అలాగే, ఆదివారం జరిగిన మరొక మ్యాచ్‌‌లో శ్రీలంక జట్టుపై వెస్టిండీస్‌ ఐదు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌‌లో ముందుగా బ్యాటింగ్‌ ‌చేసిన శ్రీలంక 19.4 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌట్‌ అయింది. తరువాత ఈ లక్ష్యాన్ని వెస్టిండీస్‌ 16.1 ఓవర్లలో ఐదు వికెట్లు కొల్పోయి చేధించింది.

హర్మన్ ప్రీత్ కౌర్ కు అరుదైన రికార్డు

భారత మహిళా జట్టు కెప్టెన్‌ హర్మన్ ప్రీత్ కౌర్ మ‌రో అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకుంది. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలోనే 200 అంత‌ర్జాతీయ‌ టీ20 మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భాగంగా దక్షిణ్రాఫికాతో ఆదివారం మ్యాచ్‌‌తో హర్మన్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2009లో ఇంగ్లండ్ వేదిక‌గా జరిగిన తొలి మహిళల టీ20 ప్రపంచకప్‌తో అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన హ‌ర్మ‌న్‌.. త‌న‌ 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రెండు వందల టీ20 మ్యాచ్‌ల‌లో భార‌త్‌కు ప్రాతినిథ్యం వ‌హించింది. హర్మన్‌కు ఇది 10వ టీ20 వరల్డ్‌కప్‌ కావడం గమనార్హం. ఈ విషయంలో న్యూజిలాండ్ లెజెండరీ ప్లేయర్‌ సూజీ బేట్స్ (184 మ్యాచ్‌లు) రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా): 177 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక పురుషుల క్రికెట్‌లో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (163) అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డులో ఉన్నాడు. రోహిత్ శర్మ (భారత్)159 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నారు. కాగా త‌న కెరీర్‌లో హ‌ర్మ‌న్ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 200 మ్యాచ్‌ల‌లో 29.83 స‌గ‌టుతో 4147 ప‌రుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఆమె అత్యధిక వ్యక్తిగత స్కోరు 103 పరుగులుగా ఉన్నాయి. బౌలింగ్‌లో ఆమె 32 వికెట్లు ప‌డ‌గొట్టింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్