ఫిఫా ప్రపంచకప్ థర్డ్ ప్లేస్ ప్లేఆఫ్‌లో బుకాయో సాకా హ్యాట్రిక్‌తో చెలరేగడంతో ఇంగ్లాండ్ 6-4తో ఫ్రాన్స్‌ను ఓడించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మియామిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. కేవలం రెండున్నర నిమిషాల్లోనే కెప్టెన్ డెక్లాన్ రైస్ తొలి గోల్ నమోదు చేయగా, 18వ నిమిషంలో ఎజ్రి కొన్సా మరో గోల్ చేశాడు. అనంతరం సాకా వరుసగా రెండు గోల్స్ చేయడంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి ఇంగ్లాండ్ 4-0 ఆధిక్యంలో నిలిచింది.
రెండో అర్ధభాగంలో ఫ్రాన్స్ పుంజుకుంది. ఎంబాపె, బ్రాడ్లీ బార్కోలా గోల్స్‌తో స్కోరును 4-2కు చేర్చగా, 66వ నిమిషంలో ఎంబాపె మరోసారి గోల్ చేసి తేడాను 4-3కు తగ్గించాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. అయితే 87వ నిమిషంలో లభించిన పెనాల్టీని సాకా గోల్‌గా మలిచి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఇంజూరీ టైమ్‌లో డెంబెలె గోల్ చేసినా, చివరి క్షణాల్లో జూడ్ బెల్లింగ్‌హామ్ గోల్‌తో ఇంగ్లాండ్ 6-4 తేడాతో విజయం ఖరారు చేసుకుంది.
ఈ విజయంతో 1966 తర్వాత ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. మరోవైపు ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపె ప్రపంచకప్‌లో మొత్తం 22 గోల్స్‌తో లియోనెల్ మెస్సీ (21) రికార్డును అధిగమించి అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. టోర్నీలో 10 గోల్స్ చేసిన ఎంబాపె గోల్డెన్ బూట్ అవార్డును అందుకున్నాడు.








కామెంట్‌లు (0)